సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

తిరంగా యాత్రను ప్రారంభించిన ‘కెవిఐసి’ చైర్మన్


ముంబైలోని ప్రధాన కార్యాలయంలో ఘనంగా 78వ స్వాతంత్య్ర వేడుకలు;

ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్;

ఆధునికీకరించిన మహాత్మా హాలుకు ప్రారంభోత్సవం;

పూజ్య బాపూజీ వారసత్వమైన ఖాదీ గత పదేళ్లలో ప్రధాని మోదీ
నేతృత్వాన ‘వికసిత భార‌త్‌’కు హామీగా మారింది: శ్రీ మనోజ్ కుమార్

Posted On: 15 AUG 2024 5:12PM by PIB Hyderabad

   భారత 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర సూక్ష్మ-లఘు-మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ పరిధిలోని ఖాదీ-గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి) ముంబైలోని విలేపార్లేలోగల కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించింది. ఇందులో భాగంగా ‘కెవిఐసి’ చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే సంస్థ ఆధ్వర్యాన ‘కెవిఐసి’ అధికారులు, సిబ్బంది తిరంగా యాత్ర నిర్వహించారు. అంతేకాకుండా కార్యాలయం ప్రాంగణంలో ఇటీవల పునరుద్ధరించిన ‘మహాత్మా హాల్’ను చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణతోపాటు బహుమతి ప్రదానం కూడా చేశారు.

   జాతీయ పతాకావిష్కరణ అనంతరం చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ మాట్లాడుతూ- ‘కెవిఐసి’ అధికారులు, సిబ్బంది, ఖాదీ కార్యకర్తలు, స్పిన్నర్లు, చేనేత కార్మికులు, వ్యాపారవేత్తలు సహా దేశవ్యాప్తంగా ఖాదీ కార్యకలాపాలతో ముడిపడిన వారందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఖాదీ త్రివర్ణ పతాకం కేవలం ఒక వస్త్రవిశేషం కాదని, బ్రిటిష్ పాలన దురాగతాల నుంచి భరతమాతను విముక్తం చేసిన అసంఖ్యాక యోధుల పోరాటం, త్యాగం, కలలకు చిహ్నమని ఆయన అభివర్ణించారు. స్వాతంత్ర్యోద్యమంలో ప్రాణార్పణ చేసిన సమరయోధుల కల నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన సాకారమవుతోందని పేర్కొన్నారు. గడచిన పదేళ్లలో పూజ్య బాపూజీ వారసత్వమైన ఖాదీ ‘వికసిత భారత్’కు ఒక హామీగా మారిందన్నారు. ఈ పరివర్తనాత్మక కృషిలో పాలుపంచుకున్న ‘కెవిఐసి’ అధికారులు, సిబ్బందిని అభినందించారు. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన ‘ఎంఎస్ఎంఇ’ మంత్రిత్వశాఖ మార్గనిర్దేశంతో ఖాదీ-గ్రామీణ పరిశ్రమల వార్షిక వ్యాపార పరిమాణం రూ.1.55 లక్షల కోట్లు దాటిందని తెలిపారు.

   ప్రస్తుత స్వాతంత్ర్య అమృత కాలంలో జాతిపిత మహాత్మా గాంధీ, ఖాదీల వారసత్వాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్రాండ్ పవర్‌తో ‘కెవిఐసి’ కొత్త శిఖరాలకు చేర్చిందని శ్రీ మనోజ్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’ను ఇంటింటికీ చేర్చడంలో భాగంగా ‘కెవిఐసి’ దేశమంతటా ‘ఇంటింటా త్రివర్ణం’, ‘ఇంటింటా ఖాదీ’ ప్రచారం నిర్వహించిందని పేర్కొన్నారు. ప్రధాని బ్రాండ్ పవర్‌తో ఖాదీ-గ్రామీణ పరిశ్రమ ఉత్పత్తులు 4 రెట్లు, విక్రయాలు 5 రెట్లు పెరిగాయని చైర్మన్ తెలిపారు. అంతేగాక తొలిసారి ఈ రంగంలో 10.17 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు.

   ఈ సందర్భంగా ఖాదీ-గ్రామీణ పరిశ్రమల కమిషన్ కేంద్ర కార్యాలయం ఆధ్వర్యాన నిర్వహించిన తిరంగా యాత్రలో అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. అలాగే స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా కళాకారుల ప్రదర్శనలతోపాటు ఉద్యోగులు కూడా దేశభక్తి గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా ‘రాజ్‌భాషా విశేషాంక్’ రెండో ఎడిషన్‌ను ‘కెవిఐసి’ చైర్మన్ మనోజ్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం వార్షిక క్రీడా పోటీల విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాల్లో ‘కెవిఐసి’ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

****


(Release ID: 2045764) Visitor Counter : 88