ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎర్రకోటలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా 75 మంది ఆశాలు, ఏఎన్ఎంలు వారి జీవిత భాగస్వాములకు ఆహ్వానం


దేశానికి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా 75 మంది ఆశాలు, ఏఎన్ఎంలను
సత్కరించిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్

10.29 లక్షల మంది ఆశాలు, 89,000 మంది ఏఎన్ఎంలు మన దేశంలో
సామాజిక ఆరోగ్య రంగానికి మూలస్తంభం లాంటి వారు,

అట్టడుగు స్థాయిలో ఆరోగ్య సంరక్షణను మార్చడంలో
కీలక పాత్ర పోషిస్తున్నారు: శ్రీమతి అనుప్రియా పటేల్

"ఆశాలు, ఏఎన్ఎంలు దేశంలో మాతా, శిశు, కౌమార ఆరోగ్య పరిస్థితులను
మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించారు"

"మాతా శిశు మరణాలలో 82 శాతం తగ్గించడం, మెరుగైన టీకా కార్యక్రమాలు
అమలు చేయడంలో ఆశాలు, ఏఎన్ఎంలు కీలకం"

Posted On: 14 AUG 2024 7:25PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా వివిధ ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అంకిత భావంతో అవిశ్రాంతంగా పని చేస్తున్న ఆశా  (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్‌లు), ఏఎన్ఎం(ఆగ్జలరీ నర్స్ మిడ్ వైవ్స్)లకు  కేంద్రం తగిన గౌరవం ఇవ్వాలని భావించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ విజ్ఞాన్ భవన్‌లో 75 మంది ఆశా, ఏఎన్ఎం లను సత్కరించారు. వారి విశిష్ట సేవలను గుర్తిస్తూ 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా 75 మంది ఆశాలు, ఏఎన్ఎంలను  వారి జీవిత భాగస్వాములతో పాటు ఆహ్వానించారు. ఎర్రకోట నుంచి 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వీరంతా వీక్షించనున్నారు.

"దేశ ఆరోగ్య రంగాన్ని మెరుగుపరచడంలో ఆశా, ఏఎన్ఎంల అసాధారణమైన, అవిశ్రాంత ప్రయత్నాలను శ్రీమతి అనుప్రియా పటేల్ ప్రశంసించారు. “ప్రస్తుతం మన దేశంలో 10.29 లక్షల మందికి పైగా ఆశాలు, 89,000 మంది ఏఎన్ఎంలు కమ్యూనిటీ హెల్త్‌కి మూలస్తంభంగా పనిచేస్తున్నారు. అట్టడుగు స్థాయి వరకు ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి సహకారాలలో కమ్యూనిటీలను సమీకరించడం, ఆరోగ్య సేవలను సులభతరం చేయడం, కమ్యూనిటీ-స్థాయి ఆరోగ్య సంరక్షణ అందించడం, ఆరోగ్య అవగాహనను ప్రోత్సహించడం వంటివి జరుగుతున్నాయి. అత్యంత మారుమూల, బలహీనమైన జనాభాకు కూడా కీలకమైన ఆరోగ్య సేవలను అందించడంలో వారి అంకితభావం చాలా అవసరం. చేరుకోలేని ప్రాంతాలలో వారి పని ప్రభావం చాలా కీలకమైనది. ఆరోగ్య సంరక్షణను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి వారి నిబద్ధతను మేము ఎంతో అభినందిస్తున్నాము" అని కేంద్ర మంత్రి అన్నారు.

"దేశంలోని మాతా, శిశు, కౌమార ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయడంలో ఆశా, ఏఎన్ఎంల కీలకమైన సహకారాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, 1990 నుండి మాతాశిశు మరణాల నిష్పత్తిలో 82 శాతానికి తగ్గించడం ద్వారా వారు మాతా, శిశు, కౌమార ఆరోగ్య స్థితిగతులను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించారని ఆమె  పేర్కొన్నారు. సార్వత్రిక వ్యాధి నిరోధక కార్యక్రమాల ద్వారా టీకా కవరేజీని విస్తృతం చేసారని అన్నారు. శిశు మరణాల రేటు 2015లో 1,000 సజీవ జననాలకు 37 శిశుమరణాలు ఉంటె, అది 2020 నాటికి 28కి తగ్గింది. మిషన్ ఇంద్రధనుష్ కింద ఆశా, ఏఎన్ఎంల ద్వారా 2014 నుండి 2023 వరకు 5.46 కోట్ల మంది పిల్లలు, 1.32 కోట్ల మంది గర్భిణులకు వాక్సినేషన్ వేయగలిగాము.  2014  మార్చిలో పోలియో రహితంగా ధ్రువీకరణ అయింది. జులై 2016లో మెటర్నల్, నియోనాటల్ టెటానస్ (ఎంఎన్టి) నిర్ములించడం జరిగింది. ఫ్రంట్‌లైన్ వర్కర్లు, ఆశాలు, ఏఎన్ఎంల  అమూల్యమైన సహకారం కారణంగా ఇది వాస్తవ రూపం దాల్చింది" అని కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ స్పష్టం చేశారు.

ఆశాలు, ఏఎన్ఎంలు దేశానికి చేసిన కీలకమైన సేవకు కృతజ్ఞతలు కేంద్ర మంత్రి కృతజ్ఞతలు తెలియజేస్తూ, “మన స్వాతంత్ర్యం  శతాబ్ది వార్షికోత్సవం అయిన 2047 కల్లా  భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ప్రధానమంత్రి కల మన ఫ్రంట్‌లైన్ వర్కర్స్ వల్ల  మాత్రమే సాధ్యమవుతుంది.  ఆరోగ్యకరమైన దేశమే అభివృద్ధి చెందిన దేశం అన్నది వాస్తవం" అని అన్నారు.

“భారత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ బాధ్యత ఫ్రంట్‌లైన్ వ్యవస్థయిన, ఆశాలు, ఏఎన్ఎంల భుజాలపై ఉందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర అన్నారు. "గత 10 ఏళ్లలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలకు వచ్చే వారి సంఖ్య పదిరెట్లు పెరిగింది. ఫ్రంట్‌లైన్ కార్మికుల ఇంటి సందర్శనలు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల పంపిణీకి గణనీయంగా దోహదపడ్డాయి" అని ఆయన అన్నారు. ఆశా, ఏఎన్ఎంలు ఎదుర్కొంటున్న సవాళ్లను ఉదహరిస్తూ, టీబీ, హైపర్‌టెన్షన్, మధుమేహం మొదలైన వివిధ వ్యాధులకు సంబంధించిన రోగుల రికార్డులు రూపొందించడ వంటి అదనపు విధులను వారు నిర్వర్తిస్తూ ప్రశంసనీయం పాత్ర పోషిస్తున్నారని ఆయన తెలిపారు. వారి అదనపు పనిని తగ్గించడానికి వర్కర్స్ నుండి సూచనలను కూడా ఆయన కోరారు.

రాజధానికి చేరుకున్న 75 మంది ఆశాలు, ఏఎన్‌ఎంలు, వారి కుటుంబాలకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీలోని ప్రధానమైన సందర్శనీయ స్థలాలను చూసేందుకు వారికి ప్రత్యేక  ఏర్పాట్లు చేశారు. వారు నెహ్రూ ప్లానిటోరియం, అమరవీరులకు నివాళులు అర్పించేందుకు ఇండియా గేట్ వద్ద కర్తవ్య పథాన్ని సందర్శించారు. ఆరోగ్య కార్యకర్తలకు గుర్తింపునిచ్చే విధంగా  వారి మనోధైర్యాన్ని పెంపొందించడమే కాకుండా దేశంలో ప్రజారోగ్యాన్ని అభివృద్ధి చేయడంలో వారి ప్రాముఖ్యతను బలోపేతం చేయడంలో వారు ఎంత ముఖ్యమో తెలియజేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం  ఒక ఉదాహరణ.
ఎన్హెచ్ఎం మిషన్ డైరెక్టర్, అదనపు కార్యదర్శి శ్రీమతి ఆరాధనా పట్నాయక్, మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


 

***


(Release ID: 2045751) Visitor Counter : 53