ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
డిజిటల్ ఆరోగ్య విద్య కోర్సు నిర్వహణపై జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఎ)-మహారాష్ట్ర ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (ఎంయుహెచ్ఎస్) మధ్య అవగాహన ఒప్పందం
వైద్య పాఠ్యాంశాల్లో డిజిటల్ ఆరోగ్య విద్యను చేర్చడం.. మరింత అనుసంధానిత-సమర్థ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు పునాది వేయడంలో ఇదొక కీలక మైలురాయి: శ్రీ జె.పి.నడ్డా;
‘‘ఈ భాగస్వామ్యం వైద్య విద్యార్థుల-వృత్తి నిపుణుల నైపుణ్యాలను పెంచడమేగాక ‘ఎబిడిఎం’ విస్తృత అమలు ద్వారా లక్షలాది ప్రజలకు నాణ్యమైన సంరక్షణనిస్తుంది’’;
‘‘వైద్యులకు.. ఆరోగ్య సేవల ప్రదాతలకు డిజిటల్ ఆరోగ్య
ప్రాథమికాంశాలపై ‘ఎంయుహెచ్ఎస్’ రూపొందించిన డిజిటల్
హెల్త్ ఫౌండేషన్ కోర్సు సమగ్ర అవగాహన కల్పిస్తుంది;
‘‘భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కోర్సుల రూపకల్పనను ఈ ఒప్పందం ప్రతిపాదిస్తోంది’’
Posted On:
13 AUG 2024 4:50PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా డిజిటల్ ఆరోగ్య విద్య అమలు దిశగా కీలక ముందడుగు పడింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి శ్రీ జె.పి.నడ్డా సమక్షంలో జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఎ), మహారాష్ట్ర ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (ఎంయుహెచ్ఎస్) మధ్య ఇవాళ అవగాహన ఒప్పందం (ఎంఒయు) కుదిరింది. ఈ ఒప్పందం కింద ‘ఎంయుహెచ్ఎస్’ తన డిజిటల్ హెల్త్ ఫౌండేషన్ కోర్సు (డిహెచ్ఎఫ్‌సి)లో ‘ఎన్‌హెచ్ఎ’కి వెసులుబాటు కల్పిస్తుంది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఎబిడిఎం) అమలులో సహాయపడేలా ‘ఎన్‌హెచ్ఎ’ సూచనలకు అనుగుణంగా అదనపు డిజిటల్ ఆరోగ్య కార్యక్రమాలు సమష్టిగా రూపొందుతాయి. సమష్టిగా పనిచేసే ఒక డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను అభివృద్ధి చేయడం కోసం దేశంలో డిజిటల్ ఆరోగ్య విభాగంలో ప్రభుత్వ విధానాలను ‘ఎన్‌హెచ్ఎ’ కొనసాగిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కోర్సులను రూపొందించాలన్నది ఈ ఒప్పందం ప్రతిపాదన.
ఈ సందర్భంగా శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా మాట్లాడుతూ- వైద్య పాఠ్యాంశాల్లో డిజిటల్ ఆరోగ్య విద్యను చేర్చడంతోపాటు మరింత అనుసంధానిత-సమర్థ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు పునాది వేయడంలో ఈ ఒప్పందం ఒక కీలక మైలురాయి’’ అని పేర్కొన్నారు. అలాగే ‘‘వైద్య విద్యార్థుల, వృత్తి నిపుణుల నైపుణ్యాభివృద్ధితోపాటు ‘ఎబిడిఎం’ విస్తృత అమలు ద్వారా లక్షలాది మంది ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తెస్తుంది’’ అన్నారు.
‘‘దేశంలోని ఆరోగ్య కార్యకర్తలు ప్రధానమంత్రి జనాఆరోగ్య యోజన (పిఎమ్-జెఎవై)ని సమర్థంగా అమలు చేయడంలో కాలానుగుణంగా వారికి సామర్థ్య వికాసం అవవసరం. ఈ ఒప్పందం అందుకు మార్గం సుగమం చేయడమేగాక డిజిటల్ బోధన రంగానికి తోడ్పాటునిస్తుంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య కార్యకర్తల సామర్థ్య నిర్మాణం కోసం ‘అవసరం ఆధారిత’ కోర్సు రూపకల్పనకు సంసిద్ధత తెలిపిన ‘ఎంయుహెచ్ఎస్’కి అభినందనలు’’ అన్నారు. అలాగే ‘‘దేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ బలోపేతం దిశగా ‘ఎన్‌హెచ్ఎ’ దీన్ని క్షేత్రస్థాయికి చేరుస్తుంది’’ అని పేర్కొన్నారు.
‘ఎన్‌హెచ్ఎ’ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీమతి దీప్తి గౌర్ ముఖర్జీ మాట్లాడుతూ- ‘‘డిజిటల్ ఆరోగ్యం వర్ధమాన రంగమని, ఆరోగ్య వ్యవస్థలోని సంబంధిత వ్యక్తులందరికీ దీనిపై పూర్తి అవగాహన కల్పించాల్సి ఉంది. మహారాష్ట్ర ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంతో తమ భాగస్వామ్యం దేశవ్యాప్తంగా డిజిటల్ ఆరోగ్య పరిష్కారాల అమలును వేగిరపరచడంలో పరివర్తనాత్మక పాత్ర పోషిస్తుంది. భవిష్యత్తులో మెరుగైన చికిత్స ఫలితాల సాధన, సమర్థ ఆరోగ్య సంరక్షణ సేవల ప్రదానం దిశగా ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఈ సాంకేతికతలను వాడుకునేలా సన్నద్ధం చేస్తుంది’’ అన్నారు.
అనంతరం ‘ఎంయుహెచ్ఎస్’ ఉపకులపతి లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) మాధురి కనిత్కర్ (‘పివిఎస్ఎమ్ ఎవిఎస్ఎమ్ విఎస్ఎమ్’) మాట్లాడుతూ- ‘‘ఆరోగ్య సంరక్షణలో నేడు డిజిటల్ ఆరోగ్య విధానం ముందంజలో ఉంది. అలాగే డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను, రోగుల సంరక్షణలో దాని ఉపయోగాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. దేశంలోని వైద్య విద్యార్థులందరికీ డిజిటల్ ఆరోగ్య విద్యను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా ‘ఎంయుహెచ్ఎస్’ మహారాష్ట్రకు ఘనత తెచ్చిపెట్టడం మాకు గర్వకారణం. ఇక జాతీయ స్థాయిలో దీని అమలు దిశగా ‘ఎన్‌హెచ్ఎ’కి తోడ్పాటునిచ్చేందుకు మేం సిద్ధం’’ అని ప్రకటించారు.
డిజిటల్ పరివర్తన, ‘ఎబిడిఎం’ అమలు నిమిత్తం ఆరోగ్య సంరక్షణ నిపుణులను తీర్చిదిద్దడంలో డిజిటల్ హెల్త్ ఫౌండేషన్ కోర్స్ (డిహెచ్ఎఫ్‌సి) కీలకం కాగలదు. ఈ నేపథ్యంలో కోయిటా ఫౌండేషన్ సహకారంతో ‘ఎంయుహెచ్ఎస్’ రూపొందించిన ఈ కోర్సు వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సేవాప్రదాతలకు డిజిటల్ ఆరోగ్య ప్రాథమికాంశాలపై సమగ్ర అవగాహనను కల్పిస్తుంది. దీనికి అనుగుణమైన పాఠ్యప్రణాళికను ప్రముఖ వైద్యులు, విషయ నిపుణులు రూపొందించారు. ఈ విధంగా ప్రజారోగ్య వ్యవస్థలో సంబంధిత వ్యక్తులకు తగినట్లుగా ‘డిహెచ్ఎఫ్‌సి’ రూపొందింది.
మిషన్ కర్మయోగి-ఐగాట్ (ఐజిఒటి)సహా వివిధ వేదికల ద్వారా వైద్య విద్యార్థులు, వైద్యసేవల్లోగల డాక్టర్లు, ఆరోగ్య సంరక్షణ నిపుణులకు ‘డిహెచ్ఎఫ్‌సి’ అందుబాటులో ఉంటుంది. డిజిటల్ హెల్త్ సర్టిఫికేషన్, నిరంతర వైద్య విద్య క్రెడిట్‌లకు ఇది అవకాశం కల్పిస్తుంది. తద్వారా తమతమ రంగాల్లో ‘ఎబిడిఎం’ సమర్థ అమలుకు దోహదం చేస్తుంది.
ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర, ఇతర సీనియర్ అధికారులు, కొయిటా ఫౌండేషన్ డైరెక్టర్/నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ (ఎన్ఎబిహెచ్) చైర్మన్ శ్రీ రిజ్వాన్ కొయిటా, ‘ఎంయుహెచ్ఎస్’ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
నేపథ్యం
భారత ఆరోగ్య సంరక్షణ రంగం పురోగమనానికి డిజిటల్ ఆరోగ్య రంగం కీలక చోదకశక్తిగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ-ప్రైవేట్ రంగాల మధ్య క్రియాశీల సహకారంతో పటిష్ట డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ ఏర్పాటు లక్ష్యంగా 2021 సెప్టెంబర్ 27న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఎబిడిఎం)ను ప్రారంభించారు. దేశంలోని ఆస్పత్రులు, క్లినిక్‌లు, లేబొరేటరీలు, ఔషధ సంస్థలు, ఆరోగ్య బీమా కంపెనీలు వంటి ఆరోగ్య సంరక్షణ రంగ సంస్థల అనుసంధానం దీని లక్ష్యం. తద్వారా రోగులకు సంరక్షణ, సౌలభ్యం, స్థోమతలను మెరుగుపడతాయి. మొత్తంమీద డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ, ‘ఎబిడిఎం’ల సంపూర్ణ సామర్థ్యం సద్వినియోగం కావాలంటే వైద్యులు, నర్సులు, ముందువరుస కార్యకర్తలు, పారామెడికల్ సిబ్బంది, వైద్య విద్యార్థులు సహా ఆరోగ్య సంరక్షణ నిపుణులందరికీ విస్తృత శిక్షణ, అవగాహన కల్పన అవశ్యం.
****
(Release ID: 2045532)
Visitor Counter : 62