రక్షణ మంత్రిత్వ శాఖ
ఎర్రకోట వద్ద స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై రక్షణశాఖ సహాయ మంత్రి సమీక్ష
ఈ వేడుకల్లో భాగస్వాములయ్యే ‘ఎన్‌సిసి/ఎన్ఎస్ఎస్’ కార్యకర్తలకు జ్ఞాపికల ప్రదానం
Posted On:
13 AUG 2024 5:39PM by PIB Hyderabad
దేశ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఎర్రకోట వద్ద సాగుతున్న ఏర్పాట్లను రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్ 2024 ఆగస్టు 13న పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ‘ఎన్‌సిసి, ఎన్ఎస్ఎస్’ కార్యకర్తలు, అధికారులు, సిబ్బంది కృషిని ఆయన అభినందించారు.
అనంతరం 78వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొనే ‘ఎన్‌సిసి, ఎన్ఎస్ఎస్’ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ- దేశమాత విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన యోధులు మనందరికీ సదా స్ఫూర్తిగా నిలుస్తారన్నారు. దేశ సమైక్యత, సమగ్రతల పరిరక్షణలో ‘ఎన్‌సిసి’ కేడెట్లు బలమైన మూలస్తంభం కాగలరని ఆయన అభివర్ణించారు. ‘‘మీరు సామాజిక సేవ, అభివృద్ధి సంబంధిత అనేక చర్యల ద్వారా పరివర్తనకు బహుముఖ దోహదకారులు కాగలరు. ‘నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ’, ‘క్లీన్ ఇండియా కార్యక్రమం’ ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ వంటి అనేక కార్యక్రమాలు విజయవంతం కావడానికి కూడా మీ వంతు కృషి చేశారు. ఏది చేసినా అంకితభావం, కఠోర శ్రమకు వెరవకుండా పనిచేశారు. ఇప్పుడిక స్వాతంత్య్ర దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు శ్రమిస్తున్నారు’’ అని వారిని కొనియాడారు.
ప్రధానమంత్రి శ్రీ మోదీ పిలుపునిచ్చిన ‘‘ఆత్మనిర్భర భారత్’’, ‘‘వికసిత భారత్’’ సంకల్పాల సాకారంలో ‘ఎన్‌సిసి’ కేడెట్ల పాత్ర కీలకమని రక్షణశాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్ అన్నారు. ఈ సందర్భంగా వారి ఉత్సాహాన్ని, మనోస్థైర్యాన్ని ప్రశంసిస్తూ జ్ఞాపికలతో సత్కరించారు.
****
(Release ID: 2045158)
Visitor Counter : 64