బొగ్గు మంత్రిత్వ శాఖ

అంతర్జాతీయ గనుల నిర్వాహకుల ద్వారా బొగ్గు ఉత్పత్తి పెంపుపై భారీ ప్రణాళికను ఆవిష్కరించిన బొగ్గు మంత్రిత్వ శాఖ

Posted On: 13 AUG 2024 3:51PM by PIB Hyderabad

   దేశంలో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెంపు, దిగుమతులపై పరాధీనత తగ్గింపు, గనుల రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం దిశగా బొగ్గు మంత్రిత్వశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) పరిధిలోగల ప్రధాన బొగ్గు గనుల ప్రాజెక్టుల నిర్వహణకు మైనింగ్ డెవలపర్స్-కమ్-ఆపరేటర్ల (ఎండిఒ)ను నియమించాలని తలపెట్టింది. తద్వారా ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు శ్రీకారం చుట్టింది.

   గనుల కార్యకలాపాల క్రమబద్ధీకరణ, ఉత్పాదకత పెంపు, తవ్వకం ఖర్చులు తగ్గింపు వంటి చర్యలతో బొగ్గు ఉత్పత్తిని గణనీయంగా పెంచే ప్రాథమిక లక్ష్యసాధన దిశగా ‘ఎండిఒ’ల నియామకం చేపట్టింది. ఆమోదిత మైనింగ్ ప్రణాళికల ప్రకారం బొగ్గు తవ్వకం, వెలికితీత, కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్)కు సరఫరా తదితరాలు ‘ఎండిఒ’ల ప్రధాన బాధ్యతలు. తద్వారా దేశీయ బొగ్గు ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే అత్యాధునిక సాంకేతిక సామర్థ్యాలున్న ‘ఎండిఒ’లతో భాగస్వామ్యం ద్వారా మైనింగ్ పద్ధతుల ఆధునికీకరణ, కార్యకలాపాల సామర్థ్యం మెరుగుదలను ‘సిఐఎల్’ లక్ష్యంగా పెట్టుకుంది.

   ‘ఎండిఒ’ల నియామకం కోసం తొలుత 168 మిలియన్ టన్నుల సామర్థ్యంగల  15 బొగ్గు గని ప్రాజెక్టులను ‘సిఐఎల్’ గుర్తించింది. అయితే, ప్రస్తుతం ఈ జాబితా సుమారు 257 మిలియన్ టన్నుల సామర్థ్యంగల 28 ప్రాజెక్టులకు (18 ఓపెన్ కాస్ట్, 10 భూగర్భ గనులు) విస్తరించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రణాళికలో భాగంగా ఇప్పటివరకూ 18 గనులను ప్రముఖ ప్రైవేటు సంస్థలకు అప్పగించడాన్ని కీలక మైలురాయిగా పరిగణించవచ్చు. ‘ఎండిఒ’ల వల్ల ఉత్పత్తి మెరుగుపడటమే కాకుండా కార్యకలాపాల సామర్థ్యం పెరిగి, బొగ్గు ఉత్పత్తిలో గణనీయ పరివర్తనాత్మక మార్పులు రానున్నాయి.

   అంతర్జాతీయ సార్వత్రిక టెండర్ల ద్వారా ఎంపిక చేసిన ఈ సంస్థలు ఒప్పందం మేరకు బొగ్గు తవ్వకం, వెలికితీత నుంచి సరఫరా దాకా యావత్ మైనింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తాయి. ఈ సంస్థల రాకతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతోపాటు కార్యకలాపాల్లో అసమాన సామర్థ్యం వ్యవస్థలో ప్రవేశిస్తాయి. దీంతో ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా మెరుగుపడుతుంది.

   ఉత్పత్తి పెంపుతోపాటు పునరావాసం-పునరుద్ధరణ (ఆర్ అండ్ ఆర్) సమస్యలు సహా భూసేకరణ, పర్యావరణ అనుమతులు వంటి కీలకాంశాలను ‘ఎండిఒ’లు చూసుకుంటాయి. పర్యావరణ ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా కేంద్ర/రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులతో సమన్వయం చేసుకుంటాయి. ఈ సంస్థలతో ఒప్పందాలకు 25 ఏళ్లు లేదా గని జీవితకాలంలో ఏది తక్కువైతే అది గడువుగా ఉంటుంది. తద్వారా తవ్వకం కార్యకలాపాలలో దీర్ఘకాలిక స్థిరత్వం, స్థిరమైన ప్రగతికి వీలుంటుంది.

   భారత బొగ్గు గనుల రంగం ఆధునికీకరణ దిశగా ‘ఎండిఒ’ల నియామకం కీలక ముందడుగు. ఈ విధంగా ప్రసిద్ధ సంస్థల నైపుణ్య వినియోగంతో బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం పెంపు, నిర్వహణ సామర్థ్యం  మెరుగుదల, దిగుమతులపై పరాధీనత తగ్గింపు ‘సిఐఎల్’ లక్ష్యాలుగా ఉన్నాయి. ఇది అంతిమంగా దేశ ఇంధన భద్రత, ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుంది.

****



(Release ID: 2045155) Visitor Counter : 35