వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, న్యూజిలాండ్ మంత్రి శ్రీ టాడ్ మెక్‌క్లే మధ్య ద్వైపాక్షిక సమావేశం


భారత్, న్యూజిలాండ్‌ల మధ్య ఉద్యానవన అభివృద్ధిని ప్రోత్సహించడంపై నిర్మాణాత్మక చర్చలు

రెండు దేశాల మధ్య వ్యవసాయ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి నిబద్ధత

Posted On: 12 AUG 2024 6:14PM by PIB Hyderabad

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూజిలాండ్ వ్యవసాయ, అటవీ, వాణిజ్య మంత్రి, విదేశాంగ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ టాడ్ మెక్‌క్లే  ప్రతినిధి బృందంతో ఇటీవల న్యూఢిల్లీలోని కృషి భవన్‌లో జరిగిన ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. . పరస్పర ప్రయోజనం గల కీలక రంగాలు, సహకార అవకాశాలపై ఈ సమావేశంలో దృష్టి సారించారు. రెండు దేశాల వ్యవసాయ ప్రాధాన్యతల గురించి సమాచారాన్ని పంచుకోవడం, ప్రతిపాదిత ఉద్యానవన రంగంపై సహకార ఒప్పందం (ఎంఓసి) వంటి కొత్త భాగస్వామ్య మార్గాలను అన్వేషించడంపై చర్చలు కేంద్రీకృతమయ్యాయి. వ్యవసాయ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై  ఉభయ మంత్రులు దృష్టి కేంద్రీకరించారు.  ద్వైపాక్షిక భాగస్వామ్యం ఇటీవలి సంవత్సరాలలో గణనీయమైన పురోగతిని సాధించింది.

భారతదేశంతో సంబంధాలను బలోపేతం చేయడంలో న్యూజిలాండ్  క్రియాశీల ప్రయత్నాలను మంత్రి చౌహాన్ ప్రశంసించారు. ఈ సుదృఢ సంబంధాలు కొనసాగేలా న్యూజిలాండ్ ప్రభుత్వం చేస్తున్న యత్నాల ప్రాముఖ్యాన్ని  గుర్తించారు. రెండు దేశాల మధ్య చారిత్రక, వ్యాపార, సాంస్కృతిక సంబంధాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. న్యూజిలాండ్‌లోని  ప్రవాస భారతీయుల  గణనీయమైన కృషిని ప్రశంసించారు. రెండు దేశాల మధ్య విద్యా సంబంధిత అంశాల్లో ఇచ్చిపుచ్చుకోవడాలు పెరగడాన్ని సైతం మంత్రి ప్రస్తావించారు.

భారతదేశంలో న్యూజిలాండ్ హై కమిషనర్ శ్రీ పాట్రిక్ రాటా,  రెండు దేశాల సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఉభయ దేశాల మధ్య వాణిజ్యం, మార్కెట్లలో ప్రవేశానికి సంబంధించి కొన్ని సానుకూల పరిణామాలు ఈ సమావేశంలో చోటు చేసుకున్నాయి.   భారత్ నుంచి దానిమ్మ పండ్లను దిగుమతి చేసుకోవడానికి న్యూజిలాండ్ సహకారం అందించడం, మామిడి ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని న్యూజిలాండ్  తొలగించడాన్ని ఒక సానుకూల చర్య గా చెప్పుకోవచ్చు. మంత్రి చౌహాన్ లక్నో, ఢిల్లీల్లో  కొత్తగా నెలకొల్పిన వీహెచ్ టీ   సౌకర్యాలకు త్వరిత గతిన ఆమోదం లభించగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా న్యూజిలాండ్‌కు  భారతీయ మామిడి ఎగుమతులు మరింతగా పెరిగేందుకు వీలవుతుంది.

న్యూజిలాండ్ నుంచి భారత్ కు గతంలో కలప దుంగలను ఎగుమతి చేసే సందర్భంలో కొన్ని రకాల విషపూరిత క్రిమికీటకాదుల సమస్యలు ఎదురయ్యేవి. తద్వారా అప్పట్లో ఎగుమతులు నిలిచిపోయాయి. ఆ సమస్యను అధిగమించి మళ్ళీ సజావుగా ఎగుమతులు సాగే విధంగా భారత ప్రభుత్వం అందించిన సహకారానికి న్యూజిలాండ్ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రంగంలో భారత దేశపు సహకారం కొనసాగుతుందని  కేంద్ర మంత్రి శ్రీ చౌహాన్ పునరుద్ఘాటించారు.  నారింజ, అరటిపళ్ళు వంటి తాజా, ఎండిన పండ్లు వంటి ఇతర వ్యవసాయ ఉత్పత్తులలో వాణిజ్యాన్ని విస్తరించే సామర్థ్యాన్ని నొక్కి చెప్పారు. న్యూజిలాండ్‌కు ద్రాక్షలను ఎగుమతి చేయడానికి భారతీయ ఎగుమతిదారులకు త్వరిత మార్కెట్ ప్రవేశం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను మరింత పెంచుకోవడానికి ప్రైవేట్ రంగ భాగస్వామ్యాలను పెంపొందించడంపై ఇరుపక్షాలు అంగీకరించాయి.

ఈ సమావేశం ప్రత్యేకించి ఉద్యానవన, పంజర చేపల పరిశోధన, అభివృద్ధిలో సాంకేతిక సహకారం  ప్రాముఖ్యతపై దృష్టి సారించింది.  ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఇరుదేశాల రైతులు, ఉత్పత్తిదారులు, వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేవిధంగా  కలిసి పని చేయడానికి మంత్రులు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.

న్యూజిలాండ్ మంత్రి మెక్‌క్లే , ఆయన ప్రతినిధి బృందం భారత పర్యటన, ప్రయోజనాత్మకంగాను, సౌఖ్యంగాను సాగాలని కాంక్షిస్తూ చౌహాన్ వారికి హార్దిక శుభాకాంక్షలను తెలియజేయడంతో ఈ సమావేశం ముగిసింది.

***




(Release ID: 2044928) Visitor Counter : 45