నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
దేశంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా వివిధ కార్యక్రమాలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం
Posted On:
07 AUG 2024 2:03PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపన మంత్రిత్వ శాఖ వివిధ కార్యక్రమాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా వారికి సాధికారత కల్పించడంతోపాటు ముందడుగు వేసేలా మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యవస్థాపన-సూక్ష్మ వ్యాపార అభివృద్ధి జాతీయ శిక్షణ సంస్థ (ఎన్ఐఈఎస్ బియూడి ), భారత వ్యవస్థాపన శిక్షణ సంస్థ (ఐఐఇ), గువాహటితో సంయుక్తంగా పలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపన (ఎంఎస్డిఇ) మంత్రిత్వ శాఖ 2021-24 మధ్య ‘ఎన్ఐఈఎస్ బియూడి’, ‘ఐఐఇ’, గువహటిలతో కలిసి తమ పరిధిలోని వివిధ వర్గాల ప్రజలు... ముఖ్యంగా అణగారిన వర్గాల కోసం ‘స్కిల్ అక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్ నెస్ ఫర్ లైవ్లీహుడ్’ (సంకల్ప్) కార్యక్రమం కింద దేశ ఆర్థిక వృద్ధి లక్ష్యంగా నైపుణ్యం, విజ్ఞానం, చేయూతనివ్వడం ద్వారా మహిళా వ్యవస్థాపకులు వ్యాపారాలు ప్రారంభించేలా ప్రోత్సహించడానికి కృషి చేసింది. ఈ కార్యక్రమం కింద 32,262 మహిళలు (మొత్తం లబ్దిదారులలో 67శాతం) అన్నివిధాలా ప్రయోజనం పొందారు.
శిక్షకులకు శిక్షణ, వ్యాపార వ్యవస్థాపనాభివృద్ధి కార్యక్రమం (ఇడిపి), ఉపాధి-వ్యవస్థాపకత-జీవన నైపుణ్యాలపై జన శిక్షణ సంస్థానాలలో (జెఎస్ఎస్) శిక్షకుల శిక్షణ కార్యక్రమాన్ని 2022-23లో ‘ఎన్ఐఈఎస్ బియూడి’ నిర్వహించింది, ఇందులో 3,883 మహిళలు (మొత్తం లబ్ధిదారులలో 78శాతం) శిక్షణ పొందారు.
నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ (ఎన్ఎస్ టిఐ)/ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ (ఐ టిఐ) విద్యార్థులకు శిక్షణనిచ్చాయి. పారిశ్రామిక విలువ పెంపుదల కోసం నైపుణ్యాల శిక్షణ (స్ట్రైవ్ ) పరిశ్రమలలో నైపుణ్య పరిమాణం బలోపేతం, వివిధ రంగాలలో నైపుణ్యాభివృద్ధి ద్వారా విద్యార్ధులను పరిశ్రమల అవసరాలకు సరిపడినట్లు తీర్చిదిద్దడం లక్ష్యంగా శిక్షణ ఇస్తోంది. ఆ తర్వాత మార్గదర్శకత్వం, సహకారం కూడా అందిస్తోంది. ఈ మేరకు 2023-24 (మే 2024 వరకు)లో 22,239 మహిళలు (మొత్తం పాల్గొన్న వారిలో 28శాతం) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పిఎం జన్మన్ ) కింద ప్రత్యేక బలహీన గిరిజన సమూహాల (పివిటిజి) అభ్యున్నతి పథకాన్ని గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో ‘ఎన్ఐఈఎస్ బియూడి’, ‘ఐఐఈ’ అమలు చేస్తున్నాయి. ఈ మేరకు 2023-24లో 36,016 మందికి శిక్షణ ఇవ్వగా, వారిలో 28,786 మంది మహిళలు కావడం గమనార్హం.
రాష్ట్రీయ ఉద్యమిత వికాస పరియోజన (ఆర్ యూవిపి) ప్రయోగ పద్ధతిలో ‘పిఎం స్వానిధి’ పథకం ద్వారా ‘ఎన్ఐఈఎస్ బియూడి’, ‘ఐఐఇ’ సంయుక్తంగా గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో వీధి వ్యాపారులకు శిక్షణనిస్తున్నాయి. ఈ మేరకు 2023-24 వరకు (మే 2024 వరకు) 2,729 మంది శిక్షణ పొందగా, వీరిలో 904 మంది మహిళలున్నారు.
మహిళా వ్యవస్థాపకులను ప్రోత్సహించడానికి ఇతర మంత్రిత్వ శాఖలు/విభాగాలు చేపట్టిన వివిధ కార్యక్రమాల వివరాలను అనుబంధం-Iలో చూడవచ్చు.
మహిళలు ప్రారంభించిన వ్యాపారాల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక ప్రత్యేక ఇంక్యుబేషన్ హబ్ లను ప్రకటించింది. వీటి వివరాలను అనుబంధం-IIలో చూడవచ్చు.
అనుబంధం-I
ఎ. మహిళా వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘డిపిఐఐటి’ చేపట్టిన వివిధ కార్యక్రమాల వివరాలిలా ఉన్నాయి:
- మహిళా యాజమాన్యంలోగల అంకుర సంస్థలకు పెట్టుబడి, రుణ సహాయంకోసం భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బి) నిర్వహించే స్టార్టప్స్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ పథకం కింద 10 శాతం నిధులు కేటాయించారు.
- స్టార్టప్ ఇండియా హబ్: స్టార్టప్ ఇండియా పోర్టల్ లో మహిళా వ్యవస్ధాపకులకు ఒక ప్రత్యేక వెబ్ పేజీ రూపొందించారు. ఇందులో కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా వ్యవస్ధాపకుల కోసం అమలు చేసే వివిధ పథకాల వివరాలుంటాయి.
- మహిళా వ్యవస్థాపన వేదిక ( డబ్ల్యూఈపి): మహిళా వ్యవస్ధాపకులకు సమాచార ప్రదానంలో సమతౌల్యం దిశగా ‘డబ్ల్యూఈపి’ ఒక సమగ్ర వేదికగా పనిచేస్తోంది. ప్రభుత్వ పథకాల సమాచారం, ఆయా రంగాలపై అవగాహన కల్పించడం ద్వారా వారికి సాధికారత ఇవ్వడం కోసమే ప్రభుత్వం 2018లో ఈ వేదికను ప్రారంభించింది.
- దేశంలో వ్యవస్థాపకత వ్యాప్తి, నాణ్యత, నవీకరణ, వైవిధ్యం, సార్వజనీనత, ఆవిష్కరణలకు గుర్తింపు దిశగా ప్రభుత్వం ‘నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ (ఎన్ఎస్ఏ)ను ప్రారంభించింది. దీనికింద 20 రంగాలు, ప్రత్యేక వర్గాల స్టార్టప్స్ ను గుర్తించి ప్రోత్సహిస్తారు. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఎ-2020, 2021, 2022 , 2023 అవార్డులలో మహిళల యాజమాన్యంలోని స్టార్టప్స్ ను ప్రత్యేక కేటగిరీగా గుర్తించి పురస్కార ప్రదానం చేస్తున్నారు.
బి. శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని శాస్త్ర, సాంకేతిక విభాగం (డిఎస్ టి) మహిళల్లో వ్యవస్ధాపన నైపుణ్య సృష్టికి ఉద్దేశించిన మహిళా వ్యవస్ధాపన అభివృద్ధి కార్యక్రమాన్ని (డబ్ల్యూఈడిపి) నిర్వహిస్తోంది. ఈ మేరకు వివిధ సంస్ధల ద్వారా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతోంది. అలాగే మహిళా వ్యవస్ధాపకులపై ప్రత్యేకంగా దృష్టి సారించే విద్యాసంస్థలలో స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్ల స్థాపనకు మద్దతిస్తోంది.
సి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ పరిధిలోని గ్రామీణాభివృద్ధి విభాగం దీన్ దయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం (డిఏవై-ఎన్ఆర్ఎల్ఎం)లో భాగంగా స్టార్టప్ గ్రామ వ్యవస్థాపన కార్యక్రమం (ఎస్ వి ఈ పి) కింద స్వయం సహాయ సంఘాలు, వారి కుటుంబ సభ్యులకు వ్యవసాయేతర రంగంలో చిన్న వ్యాపారాల నిర్వహణకు మద్దతిస్తుంది.
డి. ఆహార తయారీ పరిశ్రమల మంత్రిత్వశాఖ పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యాన 2020లో ‘ప్రధానమంత్రి ఆహార ప్రాసెసింగ్ లఘు పరిశ్రమల అధికారికీకరణ పథకాన్ని ప్రారంభించింది. దీనికింద సామాన్య ప్రజానీకంతోపాటు మహిళలకు శిక్షణ, ఆర్ధిక సహాయం కూడా అందిస్తోంది. వ్యక్తిగత, మహిళా వ్యవస్థాపక బృందాలకు రుణాధారిత రాయితీ కూడా మంజూరు చేస్తుంది. స్వయం సహాయ బృందాల సభ్యులకు నిర్వహణ మూలధనం, చిన్న పరికరాల కొనుగోలు కోసం రూ.40,000దాకా ప్రాథమిక మూలధనం సమకూరుస్తోంది. ఆహారతయారీ లఘు పరిశ్రమలు, ఎఫ్ పీ ఓ లు, స్వయం సహాయ బృందాలు, సహకార సంఘాలు లేదా స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్ పి వీ ) సముదాయాలకు ఈ పథకం కింద బ్రాండింగ్, మార్కెటింగ్ మద్దతు కోసం 50 శాతం ఆర్థికసహాయం మంజూరు చేస్తుంది.
ఇ. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ రంగ ‘జాతీయ షెడ్యూల్డ్ తెగల రుణసహాయం-అభివృద్ధి సంస్థ (ఎన్ ఎస్ టీ ఎఫ్ డి సి) ఆధ్వర్యాన ‘ఆదివాసి మహిళా సాధికారత యోజన (ఏ ఎం ఎస్ వై) పేరిట ఒక పథకం అమలవుతోంది. దీనికింద గిరిజన మహిళలు ఆదాయార్జన కార్యకలాపాలు చేపట్టవచ్చు. ఇందుకోసం రూ.2 లక్షలదాకా అవసరమయ్యే ప్రాజెక్టులకు 90 శాతం రుణాన్ని 4 శాతం రాయితీ వార్షిక వడ్డీతో వెంటనే మంజూరు చేస్తారు. ఈ పథకం కింద యూనిట్ స్థాపన వ్యయ పరిమితి ఇంతకుముందు రూ.50 వేల నుంచి రూ.1 లక్షదాకా ఉండగా, ప్రస్తుతం రూ.2 లక్షలకు పెంచారు.
ఎఫ్. మహిళా వ్యవస్థాపకులకు రుణాలు, సాంకేతికత, మార్కెట్ అభివృద్ధి, సామర్థ్య నిర్మాణం వంటి అవసరాలు తీర్చడం కోసం సూక్ష్మ-చిన్న-మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ వివిధ పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాల ద్వారా వారు వివిధ ప్రయోజనాలను పొందవచ్చు.
మహిళల ప్రగతిపై ప్రత్యేక దృష్టితో ప్రారంభించిన కొన్ని పథకాల వివరాలిలా ఉన్నాయి:
- ప్రభుత్వ కొనుగోలు విధానం: ఈ విధానం కింద అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు/ ప్రభుత్వ రంగ సంస్థల వార్షిక కొనుగోళ్లలో కనీసం 3 శాతం మహిళల యాజమాన్యంలోని సూక్ష్మ-చిన్న పరిశ్రమల (ఎస్ఎంఈ) నుంచి కొనుగోలు చేయాలి. తదనుగుణంగా మహిళా వ్యవస్ధాపకుల యాజమాన్యంలోని 15,000 ‘ఎస్ఎంఈ’ల నుంచి 2019-20లో 0.3 శాతంగా ఉన్న కొనుగోళ్లు ఇప్పుడు 1.26 శాతానికి పెరిగాయి.
- ప్రధానమంత్రి ఉపాధి సృష్టి కార్యక్రమం: ఇది గ్రామీణ-పట్టణ ప్రాంతాల్లో సొంత పరిశ్రమలు ప్రారంభించే ఔత్సాహిక సూక్ష్మ వ్యవస్ధాపకుల కోసం ఉద్దేశించిన ప్రధాన రుణాధారిత రాయితీ కార్యక్రమం. తద్వారా సాధారణ దరఖాస్తుదారులతో పోలిస్తే మహిళలకు ఎక్కువ రాయితీ లభిస్తుంది. ఈ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ లబ్ధిదారులకు ప్రాజెక్ట్ వ్యయంలో 25 శాతం, పట్టణ ప్రాంతాల్లో 15 శాతం రాయితీ లభిస్తుంది. షెడ్యూల్ కులాలు/తెగలు/మహిళల వంటి ప్రత్యేక వర్గాల లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో 35 శాతం, పట్టణ ప్రాంతాల్లో 25 శాతం రాయితీ లభిస్తుంది. కాగా, ఈ కార్యక్రమం కింద ఔత్సాహిక మహిళా వ్యవస్ధాపకులు మరింత ప్రయోజనం పొందుతున్నారు. ఈ మేరకు గత ఎనిమిదేళ్లలో 1.83 లక్షల మందికిపైగా మహిళలు సూక్ష్మ వ్యవస్ధాపకులుగా ఎదిగారు.
- సూక్ష్మ-చిన్న పరిశ్రమలకు రుణ హామీ పథకం: ఈ పథకం కింద సూక్ష్మ-చిన్న పరిశ్రమలకు రూ.5 కోట్లదాకా హామీరహిత రుణం (2023 ఏప్రిల్ 1 నుంచి అమలు) లభిస్తుంది. ఈ మొత్తం రుణంలో ఇంతకుముందు 75 శాతంపై ప్రభుత్వ హామీ లభిస్తుండగా ఇప్పుడు 85 శాతానికి పెంచారు. ప్రస్తుత, కొత్త సంస్థలు కూడా ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చు.
- జెడ్ఇడి ధ్రువీకరణ: ఎంఎస్ఎంఇ సుస్థిర (జెడ్ఇడి) ధ్రువీకరణ పథకం కింద మహిళల యాజమాన్యంలోని తయారీ ‘ఎంఎస్ఎంఇ’లు 2023 నవంబరు 11 నుంచి ఉద్యమ్ పోర్టల్ లో నమోదు చేసుకున్న సంస్థలకు ధ్రువీకరణ వ్యయంలో 100 శాతం రాయితీ పొందే అర్హత ఉంటుంది.
- మహిళా కోయిర్ యోజన (ఎంసివై): ఇది ‘కోయిర్ వికాస్ యోజన’లో 100 శాతం మహిళలకే ప్రత్యేకించిన ఒక ఉప కార్యక్రమం. దీనికింద గ్రామీణ ప్రాంతాల్లోని కొబ్బరి పీచు రంగంలోగల మహిళలకు ఆధునిక యంత్రాలు/సాంకేతికతలపై రెండు నెలలపాటు పూర్తిస్థాయి శిక్షణ ఇస్తారు. మహిళల జీవన ప్రమాణాల మెరుగు, సుస్థిర ఉపాధి లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. దీనిద్వారా లబ్ధిదారులకు కొబ్బరి పీచు నేతలో ఉపకార వేతనంతో కూడిన నైపుణ్య శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత ప్రధానమంత్రి ఉపాధి సృష్టి కార్యక్రమం (పిఎంఇజిపి) కింద రుణం కోసం వారు దరఖాస్తు చేసుకుని సొంత సంస్థలు ప్రారంభించవచ్చు. ఈ విధంగా గడచిన ఐదేళ్లలో 11,000 మందికిపైగా మహిళలు శిక్షణ పొంది ప్రగతిపథంలో సాగుతున్నారు.
- సామర్థ్య వికాసం: వ్యవస్ధాపన, నిర్వహణ, మార్కెట్, నైపుణ్యాభివృద్ధి తదితరాల్లో శిక్షణ కార్యక్రమాల ద్వారా సామర్థ్య వికాసానికి చేయూత లభిస్తుంది. గడచి మూడేళ్లలో ఖాదీ-గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి) దేశవ్యాప్త సాంకేతిక/విస్తరణ కేంద్రాల ద్వారా దాదాపు 3 లక్షల మంది మహిళలకు శిక్షణ లభించింది.
- vii. ‘స్ఫూర్తి’ పథకం కింద 2019 జూలై నుంచి మహిళా ప్రాబల్యం (50 శాతానికిపైగా)తో 80 మహిళల సముదాయాలకు ఆమోదం లభించింది.
- మహిళా వ్యవస్ధాపనలకు మద్దతు-అభివృద్ధి కోసం ‘యశస్విని’ కార్యక్రమం: దేశంలోని మహిళా వ్యవస్ధాపకులకు మద్దతు-అభివృద్ధి దిశగా ‘‘యశస్విని’’ పేరిట 2024-25లో మంత్రిత్వశాఖ ప్రజా ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. గ్రామీణాభివృద్ధి, ప్రజాపనులు, పట్టణ వ్యవహారాలు, గిరిజన వ్యవహారాలు, నీతి ఆయోగ్, రాష్ట్ర ప్రభుత్వాలు, మహిళా పారిశ్రామిక సంఘాలు, వివిధ మంత్రిత్వ శాఖలు తదితరాల భాగస్వామ్యంతో.. ముఖ్యంగా 2, 3 అంచె నగరాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మహిళా యాజమాన్య సూక్ష్మ సంస్థలను ఉద్యమ్ పోర్టళ్లతోపాటు ‘జెఇఎం’లో అధికారిక నమోదుసహా ‘జిఎస్ టి, పాన్’ తదితరాలపై చేయూత నివ్వడంపై ఈ సందర్భంగా దృష్టి సారించారు. మంత్రిత్వ శాఖ, ఇతర సంస్థల నుంచి రుణ సహాయంతోపాటు మార్కెట్, సాంకేతికత, సామర్థ్య నిర్మాణం, శిక్షణ, మార్గదర్శనం వంటి మార్గాల్లో తోడ్పాటు లభిస్తుంది. బ్యాంకులు, సిడ్బి, ‘సిజిటీఎంఎస్ఈ, సిపిఎస్ఈ’ వగైరాల నుంచి చేయూతగా స్టాళ్ల ఏర్పాటుకు వెసులుబాటు కల్పిస్తారు. డిజిటల్/ఆర్థిక అక్షరాస్యత, వ్యాపార నిర్వహణ, ఇ-కామర్స్, ఎగుమతులపైనా శిక్షణ ఇస్తారు. దీనికింద 2024 జూలై 19న జైపూర్ లో తొలి ప్రచార కార్యక్రమం నిర్వహించగా 650 మందికిపైగా సూక్ష్మ మహిళా వ్యాపారులు, స్వయం సహాయ సంఘాలు సభ్యులు పాల్గొన్నారు.
- ఎంఎస్ఎంఈ వాణిజ్య సాధికారత-మార్కెటింగ్ (ఎంఎస్ఎంఈ టీం): ఇది మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కొత్త ఉప పథకం. ఇది సూక్ష్మ-చిన్న సంస్థలు ‘ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఒఎన్ డిసి)లో అంతర్భాగం కావడంతోపాటు కేటలాగ్ తయారీ, అకౌంట్ నిర్వహణ, రవాణా మద్దతు, ప్యాకేజింగ్ తదితరాల కోసం ఆర్థిక సహాయం/రాయితీ అందించడానికి ఉద్దేశించిన పథకం. రాబోయే మూడేళ్లలో 2.5 లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందగలరని అంచనా.
- సమర్థ్ కార్యక్రమం: ఈ కార్యక్రమాన్ని మంత్రిత్వశాఖ 2022 మార్చిలో ప్రకటించింది. దీనికింద ఏటా సాధించాల్సిన లక్షాలు కిందివిధంగా ఉన్నాయి:
(ఎ) మంత్రిత్వ శాఖ నిర్వహించే వివిధ నైపుణ్య అభివృద్ధి పథకాల కింద ఉచిత శిక్షణ కార్యక్రమాలలో 20 శాతం సీట్లు మహిళలకు కేటాయించిన నేపథ్యంలో 7500 మందికిపైగా లబ్ధి పొందుతారు.
(బి) మంత్రిత్వ శాఖ అమలు చేసే మార్కెటింగ్ మద్దతు పథకాల కింద జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శనలకు మహిళల యాజమాన్యంలోని సంస్థల ప్రతినిధులు 20 శాతంగా ఉంటారు.
(సి) ‘ఎన్ఎస్ఐసి’ వాణిజ్య పథకాల వార్షిక ప్రాసెసింగ్ ఫీజుపై మంత్రిత్వ శాఖ 20 శాతం రాయితీ ఇస్తుంది.
(డి) మహిళల యాజమాన్యంలోని ‘ఎంఎస్ఎంఇ’లు ఉద్యమ్ కింద నమోదు చేసుకునే ప్రత్యేక కార్యక్రమం. దీనికింద మంత్రిత్వ శాఖ 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో విజయవంతంగా లక్ష్యాలను అందుకుంది.
అనుబంధం-II
1. వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వశాఖ పరిధిలోని పారిశ్రామిక-అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డిపిఐఐటి) నిర్వహించే మహిళా వ్యవస్థాపన ఇంక్యుబేషన్ కూడళ్ల వివరాలిలా ఉన్నాయి:
- మహిళా సాంకేతిక అంకుర సంస్థలకు ‘ప్రో-బోనో యాక్సిలరేషన్’ ద్వారా చేయూతనిచ్చేలా జోన్ స్టార్టప్స్ భాగస్వామ్యంతో మహిళా వ్యవస్ధాపకులకు వర్చువల్ ఇంక్యుబేషన్ ప్రోగ్రాం నిర్వహించారు.
- బయోనెస్ట్, ఇ-యువ పథకాల కింద బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బిఐఆర్ఏసి), ప్రత్యేక బయో-ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేసింది. ఇవి విద్యార్థినులతోపాటు మహిళా శాస్త్రవేత్తలు/వ్యవస్ధాపకులు, స్వయం సహాయ సంఘాలకు ఇంక్యబేషన్ అవకాశం కల్పిస్తూ మార్గదర్శక (వ్యాపార, మేధా, ఆస్తి, న్యాయ) మద్దతునిస్తాయి.
2. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని గ్రామీణాభివృద్ధి విభాగం దీన్ దయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ ఉపాదికల్పన మిషన్ కింద వ్యవసాయేతర జీవనోపాధిలో భాగంగా ఇంక్యేబేషన్ ఉప-పథకాన్ని అమలు చేస్తోంది. ఏదైనా రాష్ట్రంలో 150 అధిక వృద్ధి సామర్థ్యంగల సంస్థలకు మద్దతివ్వడమే దీని లక్ష్యం. ఇవి ఉపాధి కల్పన సామర్థ్యంగలవిగా ఉంటాయి. ఈ ఉప పథకాన్ని అస్సాం, బిహార్, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి.
3. ఎలక్ట్రానిక్స్-సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ: సాంకేతికత ఇంక్యుబేషన్, వ్యవస్థాపన అభివృద్ధి పథకం (టిఐడిఇ) కింద ఇంక్యుబేషన్ సెంటర్ల బలోపేతం దిశగా విద్యా సంస్థలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. యువ వ్యవస్ధాపకులు సాంకేతిక స్టార్టప్ కంపెనీలు నెలకొల్పడానికి, వాటి ద్వారా రూపొందించిన సాంకేతికతల వాణిజ్యీకరణకు ఇది దోహదం చేస్తుంది.
4. ‘ఎంఎస్ఎంఇ’ వినూత్న (ఇంక్యుబేషన్) పథకం: ఇది ‘ఎంఎస్ఎంఇ’ ఛాంపియన్ పథకంలో ఒక ఉపాంగం. దీనికింద సమాజానికి ప్రత్యక్ష ప్రయోజనం లక్ష్యంగా ఆవిష్కర్తలకు తమ ఆలోచనలను అనుసరణీయ వ్యాపార ప్రణాళికగా మలచి విజయవంతంగా మార్కెట్ చేయగలిగేలా మద్దతు, మార్గనిర్దేశం లభిస్తాయి.
కేంద్ర నైపుణ్యాభివృద్ధి-వ్యవస్థాపన మంత్రిత్వశాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ జయంత్ చౌదరి ఇవాళ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.
***
(Release ID: 2044189)
Visitor Counter : 181