గనుల మంత్రిత్వ శాఖ
మార్గదర్శక సంస్కరణలు సాంకేతికత సుస్థిర ప్రగతితో పరివర్తన దిశగా భారతీయ గనుల పరిశ్రమ: జి.కిషన్ రెడ్డి
అత్యుత్తమ పనితీరు కనబరిచిన ‘5 స్టార్’ గనుల యాజమాన్యాలకు పురస్కార ప్రదానం
Posted On:
07 AUG 2024 8:41PM by PIB Hyderabad
దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరచిన ‘5 స్టార్’ హోదాగల గనుల యాజమాన్యాలకు కేంద్ర బొగ్గు-గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఇవాళ పురస్కార ప్రదానం చేశారు. ఈ మేరకు భారత గనుల బ్యూరో (ఐబిఎం), గనుల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ లో నిర్వహించిన కార్యక్రమంలో 2022-23కుగాను ‘5-స్టార్’ హోదా పొందిన 68 గనుల యాజమాన్యాలను ఆయన సత్కరిస్తూ పురస్కార గ్రహీతలను ప్రశసించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ- భారతీయ గనుల పరిశ్రమ మార్గదర్శక సంస్కరణలు, సాంకేతికత, సుస్థిరత ప్రగతితో పరివర్తన దిశగా ముందడుగు వేస్తున్నదని శ్రీ రెడ్డి పేర్కొన్నారు. గనుల పారిశ్రామిక రంగ ప్రతిరోధకత, ఆవిష్కరణాత్మకత, అవిరళ కృషికి నేటి పురస్కార ప్రదానమే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ ఖనిజ వనరుల సంపూర్ణ సద్వినియోగంతోపాటు గనుల ప్రభావిత ప్రజల శ్రేయస్సుకు, మరింత మెరుగైన సుస్థిర భవిష్యత్తుకు మార్గం సుగమం చేసేలా పరిశ్రమ ఐక్యంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
భారత్ ఖనిజ వనరుల భాండాగారమని, స్వయంసమృద్ధ-సౌభాగ్య భారతం మహా సంకల్ప సాకారంలో ఈ వనరుల సమర్థ వినియోగం కీలకమని శ్రీ రెడ్డి అన్నారు. సుస్థిర గనుల తవ్వకం, సామాజిక సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ దిశగా అంకితభావం చూపి, ‘5 స్టార్’ హోదా పొందిన 68 గనుల యాజమాన్యాలను అభినందించారు. భారత సుస్థిర భవిష్యతకు బాటలు వేయడంలో వారు తమవంతు పాత్ర పోషిస్తున్నారని ఆయన కొనియాడారు.
కేంద్ర బొగ్గు-గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే మాట్లాడుతూ- గనుల తవ్వకం వల్ల పునరుద్ధరించ శక్యంకాని పర్యావరణ దుష్ప్రభావాల నిరోధం అవసరాన్ని నొక్కిచెప్పారు. దేశీయ స్థూలోత్పత్తి (జిడిపి) సహా పారిశ్రామిక పురోగతి, ఉద్యోగ కల్పనలోనూ గనుల రంగం పాత్ర కీలకమన్నారు. అయితే, ఈ వనరుల తవ్వకం-వినియోగాలను పర్యావరణ పరిరక్షణ-సామాజిక జవాబుదారీతనంతో సముచితంగా సమన్వయం చేసుకోవాలని సూచించారు.
గనుల శాఖ కార్యదర్శి శ్రీ వి.ఎల్.కాంతారావు మాట్లాడుతూ- ఖనిజోత్పత్తిని పెంచడంతోపాటు దిగుమతి పరాధీనతను తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని గుర్తుచేశారు. సుస్థిరత ప్రమాణాల అనుసరణకు ప్రాధాన్యమిచ్చే బలమైన పర్యవేక్షణ, మూల్యాంకన వ్యవస్థ అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. గనుల తవ్వకంపై ప్రత్యక్ష పర్యవేక్షణతోపాటు వనరులను కచ్చితంగా వెలికి తీసేలా సామర్థ్యం, సుస్ధిరత పెంపు దిశగా యాంత్రీకరణ, కృత్రిమ మేధ, డేటా విశ్లేషణ వంటి అత్యాధునిక ఉపకరణాల వినియోగం ఆవశ్యకతను నొక్కిచెప్పారు. తద్వారా పర్యావరణంపై దుష్ప్రభావాల తగ్గింపు సహా మెరుగైన భద్రతకు మార్గం సుగమం కాగలదన్నారు.
ఈ కార్యక్రమంలో ముందుగా ‘ఐబిఎం’ అదనపు కార్యదర్శి, కంట్రోలర్ జనరల్ శ్రీ సంజయ్ లోహియా స్వాగతోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ‘మైనింగ్ టెనమెంట్ సిస్టమ్, స్టార్ రేటింగ్ సిస్టమ్’ అమలుతో వచ్చిన పరివర్తనాత్మక మార్పులను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
ఈ కార్యక్రమ ప్రాంగణం మొత్తం పెద్ద సంఖ్యలో పాల్గొన్న గనుల మంత్రిత్వశాఖ పరిధిలోని వివిధ విభాగాల కార్యదర్శులు, ఇతర అధికారులతో నిండిపోయింది. ప్రతి ‘5 స్టార్’ గని యాజమాన్య ప్రతినిధి పురస్కారం స్వీకరించినప్పుడల్లా కరతాళ ధ్వనులు, ప్రశంసాపూర్వక నినాదాలతో ప్రాంగణం మార్మోగింది. కాగా, పురస్కార గ్రహీతలలో హిందుస్థాన్ కాపర్, ‘ఎంఎండిసి’ నాల్కో, టాటా స్టీల్, అల్ట్రాటెక్ వంటి ప్రముఖ సంస్థలతోపాటు అనేక చిన్న గనుల యాజమాన్యాలు కూడా ఉన్నాయి.
ఈ కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జ్యోతి వెలిగించడంతో ప్రారంభమైంది. గనుల మూసివేత అంతిమ ప్రణాళిక మాడ్యూల్, అన్వేషణ లైసెన్స్/కాంపోజిట్ లైసెన్స్/శోధన లైసెన్స్ మాడ్యూల్ పేరిట రెండు కొత్త మాడ్యూళ్లను ఆవిష్కరించారు. దీంతోపాటు ఆన్‌లైన్ ద్వారా గనుల నియంత్రణ, సుస్థిర తవ్వకాల నిర్వహణపై ఒక డాక్యుమెంటరీని ప్రదర్శించారు.
****
(Release ID: 2043528)
Visitor Counter : 35