నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జల విద్యుత్ ప్రాజెక్టులు

Posted On: 07 AUG 2024 3:43PM by PIB Hyderabad

   దేశంలో చిన్న (25 మెగావాట్ల వరకూ సామర్థ్యంతో) జల విద్యుత్ కేంద్రాల నిర్మాణం దిశగా నవ్య-పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ చేపట్టిన చర్యలు కిందివిధంగా ఉన్నాయి:

  1. చిన్న జల విద్యుత్ ఉత్పత్తి (స్మాల్ హైడ్రో పవర్) కేంద్రాల సామర్థ్యంపై రూర్కీలోని ‘ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ 2016లో అంచనాలు రూపొందించింది. దీనిపై ‘ఐఐటి’ నివేదిక మేరకు- 7133 సంభావ్య ప్రదేశాల్లో ఉత్పాదక సామర్థ్యం 21,133 మెగావాట్ల స్థాయిలో ఉంటుంది. నదీ ప్రవాహ-కాలువల ఆధారిత, డ్యామ్-టో ప్రాజెక్టుల ప్రాతిపదికన ఈ అంచనాలు రూపొందాయి.
  2. నిర్దిష్ట ప్రదేశాల్లో ఎత్తు, జల ప్రవాహ లభ్యత ప్రాతిపదికన చిన్న జలవిద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తారు. ఆ మేరకు చిన్న జలవిద్యుత్ ప్రాజెక్టులను సరైన రీతిలో నిర్మించడం లక్ష్యంగా ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భాగస్వామ్యంతో 2013-14లో 27 రకాల  ప్రమాణాలు/మార్గదర్శకాలు/మాన్యు వ‌ల్స్‌ను మంత్రిత్వశాఖ రూపొందించింది.

   మరోవైపు 25 మెగావాట్లకు మించిన జలవిద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి కింది అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ 2017-23 మధ్యకాలంలో కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సిఇఎ) పునఃపరిశీలన అధ్యయనాలు నిర్వహించింది:

  • నదీ పరీవాహక ప్రాంత గరిష్ఠ సద్వినియోగం
  • తగినంత ఎత్తు లభ్యత
  • తగుమేర జలావరణ సౌలభ్యం

   ఈ అంచనాల ప్రకారం దేశంలో (25 మెగావాట్లకు మించిన) జలవిద్యుత్ సామర్థ్యం సుమారు 133 గిగావాట్లుగా ఉంది.

   తదనుగుణంగా కలహండి ప్రాజెక్టులు సహా ఒడిషా రాష్ట్రంలో నిర్మించనున్న ప్రాజెక్టుల జాబితాను అనుబంధం-1లో చూడవచ్చు. కాగా, నవాపాడాలో కొత్త ప్రాజెక్టులేవీ లేవు.

   చిన్న జలవిద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసేవారికి సబ్సిడీ సంబంధిత పథకమేదీ లేదు. అయితే, వివిధ పథకాల కింద సౌర విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక సహాయం (సిఎఫ్ఎ)పై వివరాలను అనుబంధం-2లో పొందుపరిచారు.

  ఇందులో భాగంగా 05.08.2024 నాటికి ‘పిఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన’ కింద ఒడిషాలో ఇళ్ల పైకప్పుపై సౌరశక్తి ఉత్పాదనకు 102 మంది విక్రేతలు నమోదు చేసుకున్నారు.

   ఈ పథకం గురించి ప్రజలకు మరింత అవగాహన కల్పించడంలో భాగంగా ఒడిషాలో నిర్వహించిన వివిధ ప్రచార కార్యక్రమాలు కిందివిధంగా ఉన్నాయి:

  1. రాష్ట్రంలోని ప్రముఖ వార్తా, వినోద చానళ్లు... కణక టి.వి., కలర్స్ ఒడియా, న్యూస్ 18 ఒడియా, కళింగ, ‘ఒటివి’లలో ప్రధాన సమయ వాణిజ్య ప్రకటనల ప్రసారం;
  2. రేడియో చాక్లేట్ ఎఫ్ఎమ్; రెడ్ ఎఫ్ఎం; బిగ్ ఎఫ్ఎం, రూర్కెలా; రేడియో చాక్లేట్ ఎఫ్ఎం, రూర్కెలా వంటి ఛానళ్లలో జింగిల్స్ ప్రసారం.
  3. జాతీయ, ప్రాంతీయ వార్తాపత్రికలలో ప్రకటనల ప్రచురణ.
  4. గూగుల్ ప్రకటనలు, సామాజిక మాధ్యమ ప్రచారాలు, డిజిటల్ వెబ్ సైట్ ప్రమోషన్ వంటివి దేశవ్యాప్తంగా చేపట్టారు.

   కేంద్ర నవ్య-పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్ ఇవాళ ఒక ప్ర‌శ్న‌పై లోక్‌స‌భ‌కు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు.

***


(Release ID: 2043089) Visitor Counter : 126


Read this release in: English , Urdu , Hindi , Tamil