హోం మంత్రిత్వ శాఖ
సైబర్ నేరాల నిరోధానికి సమగ్ర సమన్వయ రీతిలో చర్యలు
Posted On:
06 AUG 2024 4:34PM by PIB Hyderabad
దేశంలో వివిధ నేరాల సమాచారం సేకరించే ‘జాతీయ నేర గణాంక నమోదు సంస్థ’ (ఎన్‌సిఆర్‌బి) ‘‘క్రైమ్ ఇన్ ఇండియా’’ ప్రచురణ ద్వారా ఆ గణాంకాలను వెల్లడిస్తుంది. ఈ మేరకు విడుదల చేసిన 2022 సంవత్సర నివేదిక ప్రకారం... 2020-2022 మధ్య (సంభాషణ-సమాచార పరికరాలు మాధ్యమం/లక్ష్యంగా) జరిగిన సైబర్ నేరాల కింద నమోదైన కేసుల వివరాలిలా ఉన్నాయి:
నమోదైన
సైబర్ నేరాలు
|
సంవత్సరం
|
2020
|
2021
|
2022
|
50,035
|
52,974
|
65,893
|
భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం ‘పోలీసు’, ‘శాంతిభద్రతలు’ రాష్ట్రాల జాబితాలోని అంశాలు. ఈ మేరకు ఆన్‌లైన్ లావాదేవీలలో మోసాలు, సైబర్ నేరాలు సహా అన్నిరకాల నేర నిరోధం, శోధన, దర్యాప్తు, విచారణ వగైరాలకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు తమ చట్టాల అమలు వ్యవస్థ (ఎల్ఇఎ)ల ద్వారా ప్రాథమికంగా బాధ్యత వహిస్తాయి. అయితే, సరిహద్దులంటూ లేని సైబర్ నేరాల విస్తృత స్వభావం దృష్ట్యా ఈ వ్యవస్థలకు పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఎల్ఇఎ’ల సామర్థ్య వికాసం కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆర్థిక తోడ్పాటుసహా సూచనాత్మక సిఫారసుల ద్వారా సాయం చేస్తోంది.
దేశంలో సైబర్ నేరాలను సమగ్ర, సమన్వయ రీతిలో నిరోధించే దిశగా పోలీసు యంత్రాంగాల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఇలా ఉన్నాయి:
- కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ‘ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్’ (ఐ4సి) పేరిట ప్రత్యేక అనుబంధ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది.
- అటుపైన ‘ఐ4సి’ కింద మేవాత్, జమ్తారా, అహ్మదాబాద్, హైదరాబాద్, చండీగఢ్, విశాఖపట్నం, గువహటిలలో 7 సంయుక్త సైబర్ సమన్వయ బృందాల (జెసిసిటి)ను ఏర్పాటు చేశారు. ఇవి సైబర్ నేరాల ప్రధాన కేంద్రాలు/బహుళ న్యాయపరిధి సమస్యలుగల ప్రాంతాల ప్రాతిపదికన రాష్ట్రాలు/‘యుటి’లలోని ‘ఎల్ఇఎ’లతో మెరుగైన సమన్వయ చట్రం ద్వారా దేశం మొత్తాన్నీ పర్యవేక్షిస్తాయి. ఈ నేపథ్యంలో ‘జెసిసిటి’లపై అవగాహన దిశగా 2023లో హైదరాబాద్, అహ్మదాబాద్, గువహటి, విశాఖపట్నం, లక్నో, రాంచీ, చండీగఢ్‌లలో 7 కార్యశాలలు (వర్క్ షాప్)లు నిర్వహించారు.
- ‘ఐ4సి’లో భాగంగా రాష్ట్రాలు/‘యుటి’ల పోలీసు విభాగాల్లోని దర్యాప్తు అధికారు (ఐఒ)లకు కేసు ప్రారంభ దశలో సైబర్ ఫోరెన్సిక్ సహాయం కోసం న్యూఢిల్లీలో అత్యాధునిక ‘నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ లాబొరేటరీ (ఇన్వెస్టిగేషన్)’ ఏర్పాటైంది. ఈ ప్రయోగశాల ఇప్పటిదాకా మొబైల్ ఫోరెన్సిక్స్, మెమరీ ఫోరెన్సిక్స్, ‘సిడిఆర్’ అనాలిసిస్ తదితర దాదాపు 10,200 సైబర్ ఫోరెన్సిక్ అంశాల్లో ‘ఎల్ఇఎ’లకు సేవలందించింది.
- మహిళలు, బాలలమీద సైబర్ నేరాలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ, అన్నిరకాల సైబర్ నేరాలపై ప్రజల ఫిర్యాదుకు వీలుగా, ‘ఐ4సి’లో జాతీయ సైబర్ నేరాల ఫిర్యాదు (నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ https://cybercrime.gov.in) పోర్టల్ ప్రారంభమైంది. సైబర్ నేరాలపై ఫిర్యాదుల స్వీకరణ, వాటిని ‘ఎఫ్‌ఐఆర్’గా మార్చడం, తదుపరి చర్యలు తీసుకోవడం వంటి చర్యలన్నీ నిబంధనల ప్రకారం ఆయా రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత ‘ఎల్ఇఎ’లు ఈ పోర్టల్ ద్వారా చేపడతాయి.
- ఆర్థిక నేరాలపై తక్షణ ఫిర్యాదుతోపాటు ప్రజల సొమ్ము మోసగాళ్ల చేతికి వెళ్లకుండా ఆపడం కోసం ‘ఐ4సి’ కింద ‘ఆర్థిక నేరాలపై పౌర ఫిర్యాదులు-నిర్వహణ వ్యవస్థ’ (సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) ఏర్పాటైంది. దీంతోపాటు ఆన్‌లైన్ ఫిర్యాదుల నమోదుకు సహాయం కోసం ‘1930’ ఉచిత ఫోన్ నంబరును కూడా ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థకు ఇప్పటిదాకా 7.6 లక్షలకుపైగా ఫిర్యాదులు అందగా, రూ.2400 కోట్లకుపైగా ప్రజాధనాన్ని సురక్షితంగా రాబట్టారు.
- మరోవైపు ‘ఐ4సి’ కింద సైబర్ నేరాల దర్యాప్తు, ఫోరెన్సిక్స్, విచారణ వంటి కీలకాంశాలలో పోలీసు/న్యాయాధికారుల సామర్థ్య వికాసం కోసం ‘సైట్రైన్’ (CyTrain) పేరిట ఒక పోర్టల్ ద్వారా ‘సామూహిక సార్వత్రిక ఆన్‌లైన్ కోర్సుల’ (ఎమ్ఒఒసి-మూక్) వేదికను కూడా రూపొందించారు. దీనిద్వారా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 96,288 మందికిపైగా పోలీసు అధికారులు కోర్సులు పూర్తిచేయగా- 70,992కుపైగా ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యాయి.
- పోలీసు ప్రాధికార సంస్థల నివేదన ప్రకారం ఇప్పటిదాకా 5.8 లక్షలకుపైగా సిమ్ కార్డులు, 1,08,000కుపైగా ‘ఐఎమ్ఇఐ’లను కేంద్ర ప్రభుత్వం స్తంభింపజేసింది.
- కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాల్లోని 6,800 మంది అధికారులకు సైబర్ స్వచ్ఛతపై ‘ఐ4సి’ శిక్షణ ఇచ్చింది.
- అలాగే 35,000 మందికిపైగా ఎన్‌సిసి కేడెట్లకూ శిక్షణనిచ్చింది.
- ‘మహిళలు-బాలలపై సైబర్ నేరాల నిరోధం (సిసిపిడబ్ల్యూసి)’ పథకం కింద సైబర్ ఫోరెన్సిక్-శిక్షణ ప్రయోగశాలల ఏర్పాటు, జూనియర్ సైబర్ కన్సల్టెంట్ల నియామకానికి రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ తోడ్పాటునిచ్చింది. దీంతోపాటు ‘ఎల్ఇఎ’ల సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయాధికారులకు శిక్షణ ఇవ్వడం తదితర కార్యక్రమాల ద్వారా వారి సామర్థ్య వికాసం కోసం కూడా ఇప్పటిదాకా మొత్తం రూ.131.60 కోట్లమేర ఆర్థిక సాయం అందించింది. ఈ నిధులతో 33 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో సైబర్ ఫోరెన్సిక్-కమ్-ట్రైనింగ్ లేబొరేటరీలు ప్రారంభమయ్యాయి. అలాగే 24,600 మందికిపైగా ‘ఎల్ఇఎ’ల సిబ్బంది, న్యాయాధికారులు, ప్రాసిక్యూటర్లు సైబర్ నేరాలపై అవగాహన, దర్యాప్తు, ఫోరెన్సిక్స్ తదితరాలపై శిక్షణ పొందారు.
- హైదరాబాద్‌లో నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ లాబొరేటరీ (ఎవిడెన్స్) ఏర్పాటైంది. తద్వారా సైబర్ నేరాలలో ఆధారాలకు ఫోరెన్సిక్ మద్దతు లభిస్తోంది. అంతేకాకుండా ‘ఐటి’ చట్టం, సాక్ష్యాధారాల చట్టం నిబంధనల మేరకు వాటిని భద్రత, విశ్లేషణ, ఫలితాల వెల్లడి సమయం తగ్గింపు వంటివాటికి వీలు కలిగింది.
- XII. సైబర్ నేరాలపై అవగాహన కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ‘‘సంక్షిప్త సందేశ సేవ (ఎస్ఎమ్ఎస్), సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఖాతా @CyberDostతోపాటు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ మాధ్యమాల ఖాతా CyberDostI4C సహా రేడియో ప్రచారం ద్వారా ‘ఐ4సి’ సందేశాలు పంపుతోంది. అంతేకాకుండా బహుళ మాధ్యమాలలో ప్రచారం దిశగా ‘MyGov’ను వినియోగిస్తోంది. వీటన్నిటితోపాటు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో సైబర్ భద్రత-రక్షణపై అవగాహన వారోత్సవాల నిర్వహణ, వయోజనులు/విద్యార్థుల కోసం కరదీపికల ప్రచురణ వంటి చర్యలు కూడా చేపట్టింది. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు కూడా స్వయంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం సూచించింది.
దేశీయ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.
***
(Release ID: 2042502)
|