జల శక్తి మంత్రిత్వ శాఖ
జల్ జీవన్ మిషన్ ద్వారా నాణ్యమైన నీటి సరఫరా
గడచిన ఐదేళ్లలో గణనీయంగా తగ్గిన ఆర్సెనిక్.. ఫ్లోరైడ్ ప్రభావిత ఆవాసాల సంఖ్య;
రాష్ట్రాల్లో వివిధ స్థాయుల్లో 2,163 మంచినీటి నాణ్యత పరీక్ష ప్రయోగశాలల ఏర్పాటు;
దేశవ్యాప్తంగా టెస్టింగ్ కిట్లతో క్షేత్రస్థాయిలో నీటి పరీక్షల
నిర్వహణలో 24.61 లక్షల మందికిపైగా మహిళలకు శిక్షణ;
Posted On:
05 AUG 2024 1:57PM by PIB Hyderabad
దేశంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికి తగిన పరిమాణంలో, నిర్దేశిత నాణ్యతతో, క్రమం తప్పకుండా దీర్ఘకాలిక ప్రాతిపదికన మంచినీటి సరఫరా లక్ష్యంగా రాష్ట్రాల భాగస్వామ్యంతో జల్ జీవన్ మిషన్ (జెజెఎమ్)ను 2019 ఆగస్టు నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. తాగునీరు రాష్ట్ర పరిధిలోని అంశం కావడం వల్ల జల్ జీవన్ మిషన్ సహా నీటి సరఫరా పథకాల ప్రణాళిక, ఆమోదం, అమలు, నిర్వహణ, యాజమాన్య బాధ్యతలు రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలపైనే ఉంటుంది. ఈ బాధ్యతల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం సాంకేతిక-ఆర్థిక సహాయం అందిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 15న జల్ జీవన్ మిషన్ ప్రకటన చేసే సమయానికి 3.23 కోట్ల (17శాతం) గ్రామీణ గృహాలకు కొళాయి కనెక్షన్లున్నట్లు నివేదించారు. ఇక 31.07.2024 నాటికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు నివేదించిన ప్రకారం- సుమారు 11.80 కోట్ల అదనపు గ్రామీణ కుటుంబాలకు కొళాయి కనెక్షన్లు ఇచ్చారు. ఆ మేరకు 31.07.2024 నాటికి దేశంలోని 5.83 లక్షల గ్రామాలల్లోగల 19.32 కోట్ల గ్రామీణ గృహాలకుగాను సుమారు 5.80 లక్షల గ్రామాల్లోని 15.03 కోట్లకుపైగా (77.81శాతం) గృహాలకు కొళాయి నీరు సరఫరా అవుతున్నట్లు పేర్కొన్నారు. తదనుగుణంగా 31.07.2024 నాటికి దాదాపు 2.31 లక్షల గ్రామాల్లో ‘హర్ ఘర్ జల్’ లక్ష్యం చేరుకున్నట్లు ప్రకటించారు.
జల్ జీవన్ మిషన్ కింద ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం- పైపుల ద్వారా సరఫరా అవుతున్న నీటి నాణ్యత నిర్ధారణకు ‘బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్’ (బిఐఎస్):10500 ప్రమాణాన్ని కొలబద్దగా పరిగణిస్తారు. జెజెఎమ్ కింద గృహాలకు కొళాయి నీటి సరఫరా పథకాల రూపకల్పన సమయంలో నాణ్యత ప్రభావిత ఆవాసాలకు ప్రాధాన్యమిస్తారు. ఆ మేరకు నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు నిధుల కేటాయింపులో ఆర్సెనిక్, ఫ్లోరైడ్ వంటి రసాయన కలుషితాలతో ప్రభావితమైన ఆవాసాల జనాభాకు 10 శాతం అదనపు ప్రాధాన్యం ఉంటుంది.
గ్రామీణ ప్రాంతాల్లో ‘జెజెఎం’ కింద తాగునీటి వనరుల్లో కాలుష్యాలను ఆవాసాల వారీగా పర్యవేక్షిస్తారు. జల్ జీవన్ మిషన్ ప్రారంభించిన నాటి నుంచి ఆర్సెనిక్, ఫ్లోరైడ్ ప్రభావిత ఆవాసాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నివేదన ప్రకారం- 31.07.2024 నాటికి దేశంలో 316 ఆర్సెనిక్, 265 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామీణ ఆవాసాలున్నాయి. ఈ ఆవాసాల్లో సామాజిక జలశుద్ధి ప్లాంట్ల (సిడబ్ల్యూపిపి) ద్వారా వంట, తాగునీటి కోసం నీరు సరఫరా చేస్తున్నారు. దీనికి సంబంధించి ‘జెజెఎమ్-ఐఎంఐఎస్’పై రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నివేదికల మేరకు ఆర్సెనిక్, ఫ్లోరైడ్ ప్రభావిత ఆవాసాల సంఖ్య కిందివిధంగా ఉంది:
కలుషితాలు
|
ఆర్సెనిక్/ఫ్లోరైడ్ ప్రభావిత ఆవాసాల సంఖ్య
|
|
01.04.2019
|
01.04.2020
|
01.04.2021
|
01.04.2022
|
01.04.2023
|
01.04.2024
|
31.07.2024
|
|
|
|
|
|
|
|
|
ఆర్సెనిక్
|
14,020
|
4,568
|
1,717
|
800
|
507
|
378
|
316
|
ఫ్లోరైడ్
|
7,996
|
5,796
|
1,021
|
638
|
393
|
348
|
265
|
మూలం: జేజేఎం-ఐఎంఐఎస్
పథకం నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం, వాటర్ క్వాలిటీ మానిటరింగ్ అండ్ సర్వైలెన్స్ (డబ్ల్యూక్యూఎం అండ్ ఎస్) కార్యకలాపాల కోసం జెజెఎమ్ కింద రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు తమకు కేటాయించిన వార్షిక నిధులలో 2 శాతందాకా వాడుకోవచ్చు. ఈ నిధులతో నీటి నాణ్యత పరీక్ష ప్రయోగశాలల ఏర్పాటు, బలోపేతం, పరికరాలు, సామగ్రి, రసాయనాలు, గాజు సామగ్రి, వినియోగ వస్తువులు, నిపుణ మానవ వనరుల నియామకం, క్షేత్రస్థాయి టెస్ట్ కిట్లను (ఎఫ్ టి.కె)లో సామాజిక తనిఖీపై అవగాహన కల్పన, నీటి నాణ్యతపై చైతన్య కార్యక్రమాలు, ప్రయోగశాలలకు అక్రెడిటేషన్/గుర్తింపు తదితరాలు చేపట్టవచ్చు.
నీటి నాణ్యత దిశగా నమూనాల పరీక్ష, తాగునీటి వనరుల నమూనాల సేకరణ, నివేదన, పర్యవేక్షణ, తనిఖీ కోసం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు, ఆన్ లైన్ జెజెఎమ్ - వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (డబ్ల్యుక్యూఎంఐఎస్) పోర్టల్ ను రూపొందించారు. డబ్ల్యుక్యూఎంఐఎస్ ద్వారా నివేదించిన నీటి నాణ్యత పరీక్ష రాష్ట్రాలవారీ వివరాలు పబ్లిక్ డొమైన్ లో లభ్యమవుతాయి.
దీనిపై అదనపు సమాచారం కోసం https://ejalshakti.gov.in/WQMIS/Main/report లో
చూడవచ్చు.
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నివేదన ప్రకారం- ఇప్పటిదాకా దేశంలో వివిధ స్థాయులలో రాష్ట్ర, ప్రాంతీయ, జిల్లా, సబ్ డివిజన్/లేదా బ్లాక్ స్థాయిలో 2,163 తాగునీటి నాణ్యత పరీక్ష ప్రయోగశాలలు ఉన్నాయి. నాణ్యతగల తాగునీటి సరఫరా దిశగా పరీక్షలను ప్రోత్సహించడంలో భాగంగా సామాన్య ప్రజలకు తమ నీటి నమూనాలను నామమాత్రపు రుసుముతో పరీక్షించడానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ప్రయోగశాలలను ప్రారంభించాయి.
జెజెఎం డ్యాష్ బోర్డుపై 'సిటిజన్ కార్నర్'ను కూడా రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల్లో పిడబ్ల్యుఎస్ ద్వారా నీటి సరఫరా నాణ్యతపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడానికి, విశ్వాసం పెంచడానికి తగినట్లుగా నీటి నాణ్యత పరీక్ష ఫలితాలను పబ్లిక్ డొమైన్ లో ప్రదర్శించడం ఇందులో భాగం.
నీటి నాణ్యతను పర్యవేక్షించేలా సమాజాలకు సాధికారత కల్పించడానికి, గ్రామస్థాయిలో ఫీల్డ్ టెస్టింగ్ కిట్స్ (ఎఫ్ టికె )తో నీటి నాణ్యత పరీక్షల నిర్వహణకు ప్రతి గ్రామంలో 5 మందికి... ముఖ్యంగా మహిళలకు శిక్షణ ఇవ్వాలని, ఆ సమాచారాన్ని డబ్ల్యూక్యూఎంఐఎస్ పోర్టల్ లో నివేదించాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. ఆ మేరకు డబ్ల్యూక్యూఎంఐఎస్ పై రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు నివేదించిన మేరకు- ఇప్పటిదాకా 24.61 లక్షల మందికిపైగా మహిళలకు కిట్లతో నీటిని పరీక్షించడంలో శిక్షణ ఇచ్చారు.
కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ వి.సోమన్న రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు తెలిపారు.
***
(Release ID: 2042077)
Visitor Counter : 69