ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
సమష్ఠి కృషి ద్వారానే అవయవదానం, మార్పిడిలో అగ్రగామి దేశాల్లో ఒకటిగా ఎదుగుతాం
అవయవ మార్పిడికి ముందు అందిన అవయవాలు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలి
14వ భారత అవయవదాన దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్
మరణించిన అవయవ దాతల కుటుంబ సభ్యులు, గ్రహీతలు, ఇతర భాగస్వాములకు సన్మానం
ఇ-న్యూస్ లెటర్, నోటో వార్షిక నివేదిక, అవయవ రవాణా నిబంధనలు విడుదల
Posted On:
03 AUG 2024 5:25PM by PIB Hyderabad
“దేశంలో అవయవ దానం అవసరం ఎంతో ఉంది. ఇందు కోసం చనిపోయిన వ్యక్తుల నుంచి, "బ్రెయిన్ స్టెమ్ డెడ్" వ్యక్తుల నుండి అవయవ దానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అవయవ దానం అవసరాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రధానంగా ప్రస్తావిస్తూ.. ఒక అవయవ దాత 8 మందికి కొత్త జీవితాన్ని ఇవ్వగలరనే విషయంపై దృష్టి సారించాలని సూచించారు” అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ పేర్కొన్నారు. జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ(ఎన్ఓటీటీఓ) నిర్వహించిన 14వ భారత అవయవదాన దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీమతి పటేల్ మాట్లాడుతూ, ఎంతోమంది ప్రాణాలను కాపాడి మానవాళికి గొప్ప సేవ చేస్తున్న అవయవ దాతల కుటుంబ సభ్యులను కొనియాడారు. వారు యావత్ దేశానికి స్ఫూర్తి ప్రదాతలని పేర్కొంటూ, మరణించిన తర్వాత తమ అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేయడానికి ముందుకు రావాలని ఆమె దేశ ప్రజలనుకోరారు. “ప్రతి వ్యక్తి, సంస్థల సమిష్టి కృషి ద్వారానే అవయవదానం, అవయవ మార్పిడిలో అగ్రగామి దేశాల్లో ఒకటిగా ఎదగాలన్న తన దార్శనికతను భారత్ సాకారం చేసుకోగలుగుతుందని” ఆమె అన్నారు.
అవయవ దానంలో స్పెయిన్, అమెరికా, చైనా వంటి అనేక దేశాలు చాలా ముందున్నప్పటికీ, మన దేశం ఇటీవలి కాలంలో ఈ రంగంలో కొన్ని చెప్పుకోదగిన విజయాలు సాధించిందని కేంద్ర మంత్రి అన్నారు. అవయవ మార్పిడికి ముందు అవి ఏ విధం గానూ పాడైపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె అధికారులను కోరారు.
డాక్టర్ వినోద్ కుమార్ పాల్ మాట్లాడుతూ, అవయవాల డిమాండ్ కు, సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని, అవయవ మార్పిడి సవాలును స్వీకరించడానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంస్థాగత సంస్కరణలు అవసరమని పేర్కొన్నారు. అవయవ మార్పిడి సేవలను కేవలం 750 సంస్థలు మాత్రమే అందిస్తున్నాయని, ఇతర సంస్థలు కూడా ఇలాంటి సేవలు అందించేందుకు ముందుకు రావాలని కోరారు.
ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన(ఏబీపీఎం - జేవై) పరిధిలోకి మూత్ర పిండాల మార్పిడి కూడా వచ్చిందని డాక్టర్ పాల్ చెప్పారు. అవయవ మార్పిడిని బీమా కంపెనీలు పరిగణన లోకి తీసుకోవాలని డాక్టర్ పాల్ కోరారు. అవయవ మార్పిడిని సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన "వన్ నేషన్, వన్ పాలసీ" వంటి గణనీయ ప్రయత్నాల వల్ల అవయవ మార్పిడికి అడ్డంకులు తొలగిపోతున్నాయని ఆయన తెలిపారు. అవయవదాతలకు నివాళులు అర్పిస్తూ, ఈ మహోన్నత కార్యానికి ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపు ఇచ్చారు.
కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర మాట్లాడుతూ, అవయవదానం కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు నమోదు చేసుకుంటున్నందున అవయవదానంపై అవగాహన మరింత పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అవయవ మార్పిడిలో భారత్ మూడో స్థానంలో ఉన్నప్పటికీ, అవయవ దానం కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువగా జరుగుతుందని, అందరికి లబ్ది కలిగేలా అవయవ దానానికి నమోదు చేసుకోవడానికి ప్రజలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
“అవయవ వృథా జరగకుండా ఉండాలంటే మన వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి విషయంలో అవయవాలు తీసుకోవడానికి సమయం తక్కువగా ఉంటుంది. 12 గంటల్లో అవయవాలను సేకరించి తక్కువ సమయంలోనే మార్పిడి చేయాల్సి ఉంటుంది. అందువల్ల, మనం మన వ్యవస్థలను మెరుగుపరచాలి. ఇది ఎన్ఓటీటీఓ, ఎస్ఓటీటీఓ, ఆర్ఓటీటీఓ లపై పెద్ద బాధ్యత” అని ఆయన స్పష్టం చేశారు.
అవయవదానం చేసిన 10 మంది మృత దాతల కుటుంబ సభ్యులు, నలుగురు అవయవ గ్రహీతలను కేంద్ర మంత్రి ఈ సందర్భంగా సన్మానించారు. అవయవ దానం, మార్పిడి లో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, ప్రాంతీయ, రాష్ట్ర అవయవ, కణజాల మార్పిడి సంస్థలు, వైద్య కళాశాలలు , సంస్థలు, ప్రొఫెషనల్ సొసైటీలు, వైద్య నిపుణులు, వివిధ ప్రభుత్వేతర సంస్థలకు అవార్డులు ప్రదానం చేశారు.
రోటో నార్త్ - పీజీఐఎంఈఆర్, చండీగఢ్ ఉత్తమ రోటో అవార్డును గెలుచుకుంది. తెలంగాణకు ఉత్తమఎస్ఓటీటీఓ /స్టేట్ అవార్డు దక్కగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు రెండో ఉత్తమ ఎస్ఓటీటీఓ /స్టేట్ అవార్డును దక్కించుకున్నాయి. మణిపూర్ కు బెస్ట్ ఎమర్జింగ్ స్టేట్ ఇన్ నార్త్ ఈస్ట్ అవార్డు లభించింది. అవయవ దానంలో ఎమర్జింగ్ స్టేట్స్ అవార్డు పొందిన రాష్ట్రాలు: 1) ఆంధ్రప్రదేశ్ 2) మధ్యప్రదేశ్, 3) జమ్ముకశ్మీర్. ఉత్తమ నాన్ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గాన్ రిట్రీ వల్ సెంటర్స్ (ఎన్ టీ ఓ ఆర్ సీ) అవార్డును అహ్మదాబాద్ లోని సివిల్ హాస్పిటల్ అందుకుంది. ఎమర్జింగ్ ఎన్ టీ ఓ ఆర్ సీ అవార్డులు: 1. కమాండ్ హాస్పిటల్, చాందమందిర్, 2. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, హిమాచల్ ప్రదేశ్ కు లభించాయి. ఉత్తమ అవగాహన/ఐ ఇ సి యాక్టివిటీస్ ఉన్న రాష్ట్రంగా రాజస్థాన్ కు అవార్డు లభించింది. సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రికి అత్యున్నత విరాళం పురస్కారం లభించింది. మరణించిన అవయవ దానం కార్యక్రమాన్ని సమర్థవంతంగా పునరుద్ధరించినందుకు కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి ప్రత్యేక అవార్డు న్యూఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రి గెలుచుకుంది. చనిపోయిన అవయవదాన కార్యక్రమాన్ని సమర్థవంతంగా పునరుద్ధరించినందుకు స్టేట్ హాస్పిటల్ ప్రత్యేక అవార్డును ముంబైలోని కెఇఎమ్ హాస్పిటల్ అందుకుంది. ఉత్తమ బ్రెయిన్ స్టెమ్ డెత్ సర్టిఫికేషన్ టీమ్ గుర్తింపు పొందిన వాటిలో (ప్రాంతాల వారీగా) : 1. వెస్ట్ - న్యూ సివిల్ హాస్పిటల్, సూరత్; 2. నార్త్ - ఆల్ఎంఎస్, ఢిల్లీ; 3. దక్షిణం - కిమ్స్, సికింద్రాబాద్; 4. ఈస్ట్ - ఐపీజీఎంఈఆర్, కోలకతా ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో ఇ-న్యూస్ లెటర్, నాటో వార్షిక నివేదిక, ఆర్గాన్ ట్రాన్స్ పోర్ట్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఒపి) ను వివరించే మాన్యువల్ లను ఆవిష్కరించారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా 2023లో 'జన్ ఆందోళన్'గా దేశవ్యాప్తంగా ' అవయవ దానమహోత్సవ్' పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జూలై నెలను అవయవదాన మాసంగా పాటిస్తారు. ఈ సంవత్సరం "అంగ్ దాన్ జన్ జాగృత అభియాన్" అనే ప్రచారం కింద, అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు / విభాగాలు, రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు / జాతీయ, ప్రాంతీయ , రాష్ట్ర అవయవ ,కణజాల నెట్వర్కింగ్ సంస్థలు / ఆసుపత్రులు / సంస్థలు ,వైద్య కళాశాలలు, ఎన్ జి ఒ , ఇతర భాగస్వాముల ద్వారా నగరం నుండి గ్రామ స్థాయి వరకు దేశవ్యాప్తంగా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నోటో డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్, ఢిల్లీ పోలీసు సిబ్బంది, అవయవ గ్రహీతలు, విద్యార్థులు, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.
నేపథ్యం:
అవయవ, కణజాల దానాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ "మన్ కీ బాత్" కార్యక్రమంలో అవయవదానం ప్రాముఖ్యతను అనేకసార్లు ప్రస్తావించారు.
బ్రెయిన్ స్టెమ్ డెత్ , అవయవ దానం గురించి అవగాహన పెంచడానికి, అవయవ దానంతో సంబంధం ఉన్న అపోహలను, అపనమ్మకాలను తొలగించడానికి , మరణించిన తర్వాత అవయవాలు కణజాలాలను దానం చేసేలా దేశ పౌరులను ప్రేరేపించడానికి , ప్రోత్సహించడానికి, అలాగే అవయవ దానం విలువలను తమ జీవితాల్లో నింపుకోవడానికి 2010 నుండి ప్రతి సంవత్సరం భారతీయ అవయవ దానం దినోత్సవం (ఐఒడిడి) ని నిర్వహిస్తున్నారు.అవయవ మార్పిడి కోసం డిమాండ్‌ను తగ్గించడానికి, ప్రచార కార్యకలాపాలు ఆరోగ్యకరమైన జీవనశైలిని, ఆరోగ్యాన్ని అనుసరించడాన్ని ప్రోత్సహిస్తాయి. అవయవ వైఫల్యం నివారణకు చర్యలు తీసుకుంటాయి.అవయవ మార్పిడి కోసం అవయవాలు అవసరమైన వారి సంఖ్యకు, దాతల సంఖ్యకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడానికి ప్రజలు అవయవాలను దానం చేసేలా అవగాహన పెంచేందుకు ప్రేరేపించడానికి 14 వ ఐ ఒడిడి ఒక అవకాశం.
దానం చేసిన ప్రతి అవయవం విలువైనది, ప్రాణరక్షణ, జాతీయ వనరు. ఒక వ్యక్తి మరణించిన తరువాత మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, గుండె, క్లోమం , ప్రేగు వంటి ముఖ్యమైన అవయవాలను దానం చేయడం ద్వారా 8 మందికి కొత్త జీవితాన్ని ఇవ్వగలడు. కార్నియా, చర్మం, ఎముక ,గుండె వాల్వ్ వంటి కణజాలాలను దానం చేయడం ద్వారా మరింత మంది నాణ్యమైన జీవితాలను మెరుగుపరచవచ్చు.
ఒక ఉదాత్తమైన లక్ష్యం కోసం ప్రతిజ్ఞ చేయడానికి ,ఈ జాతీయ ప్రయత్నంలో భాగస్వామ్యం కావడానికి ప్రజలు ముందుకు రావాలని ప్రోత్సహించడం జరిగింది. అవయవదానం, మార్పిడిపై ఏదైనా సమాచారం కోసం www.notto.mohfw.gov.in వెబ్ సైట్ ను సందర్శించవచ్చు లేదా టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 180114770 కు కాల్ చేయవచ్చు.
ఈ సంవత్సరం "అంగ్ దాన్ జన్ జాగృక్త అభియాన్" ప్రచారం కింద, అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు / విభాగాలు, రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు / జాతీయ, ప్రాంతీయ ,రాష్ట్ర అవయవ, కణజాల నెట్వర్కింగ్ సంస్థలు / ఆసుపత్రులు / సంస్థలు ,వైద్య కళాశాలలు, ఎన్ జి ఒ లు , ఇతర భాగస్వాములతో నగరం నుండి గ్రామ స్థాయి వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
అభియాన్ కింద జూలై నెలను అవయవదాన మాసంగా పాటించారు. అవయవ, కణజాల దానం కోసం పౌరులు ప్రతిజ్ఞ చేయడానికి వీలుగా, https://notto.abdm.gov.in వెబ్ పోర్టల్ అందుబాటు లో ఉంది. దీని ద్వారా 2023 సెప్టెంబర్ 17 నుండి ఇప్పటివరకు 1.7 లక్షల మందికి పైగా పౌరులు ముందుకు వచ్చి తమ ప్రతిజ్ఞను నమోదు చేశారు.
****
(Release ID: 2041568)
Visitor Counter : 100