సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘యుగయుగేఁ భారత్ మ్యూజియం’పై మూడు రోజుల సదస్సు


36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 80 సంస్థలు.. నిపుణుల హాజరు;

ప్రసిద్ధ దేశవిదేశీ మ్యూజియం నిపుణుల నేతృత్వాన సామర్థ్య వికాస కార్యక్రమాలు;

కేంద్ర-రాష్ట్ర మ్యూజియాల కీలక నిర్వహణ భాగస్వాముల మధ్య వివిధ అంశాలపై చర్చలు

Posted On: 04 AUG 2024 1:26PM by PIB Hyderabad

   ప్రపంచంలోనే అత్యంత పెద్దదిగా న్యూఢిల్లీలో ‘యుగయుగేఁ భారత్ మ్యూజియం’ నిర్మిస్తున్న నేపథ్యంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మూడు రోజులపాటు అధికారిక మ్యూజియంల సదస్సు నిర్వహించింది. ఈ నెల 1 నుంచి 3వ తేదీదాకా సాగిన ఈ కార్యక్రమంలో భాగంగా భాగస్వాముల మధ్య సంప్రదింపులు, సామర్థ్య వికాస కార్యక్రమాలను నిర్వహించారు. సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఉత్తర-దక్షిణ భవన సముదాయాల నడుమ ఈ మ్యూజియం రూపుదిద్దదుకుంటోంది. ఈ సదస్సులో కీలకాంశాలు ఇలా ఉన్నాయి:

  • కేంద్ర-రాష్ట్ర మ్యూజియం పర్యావరణ వ్యవస్థల కీలక నిర్వహణ భాగస్వాముల మధ్య చర్చలు
  • మ్యూజియంల నిర్వహణలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకార బలోపేతం
  • ప్రసిద్ధ దేశవిదేశీ మ్యూజియం నిపుణుల నేతృత్వాన సామర్థ్య వికాస కార్యక్రమాలు

   దేశంలోని వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ మ్యూజియాల్లోని నిపుణులను ఈ సదస్సు ఒకే వేదికపైకి తెచ్చింది. ఈ మూడు రోజుల సదస్సులో 36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 80 సంస్థలు-వివిధ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు సహా 150 మందికిపైగా నిపుణులు పాల్గొన్నారు. మ్యూజియాల నిర్వహణ, కార్యకలాపాల సంబంధిత ప్రధానాంశాలపై ఈ రంగంలోని అగ్రశ్రేణి నిపుణులు పునశ్చరణ తరగతులు నిర్వహించారు. వీటిలో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఇలా ఉన్నాయి:

  • ‘‘ఆర్కిటెక్చర్ అండ్ మెటీరియాలిటీ’’పై ఫ్రాన్స్ మ్యూజియంల ఆర్కిటెక్ట్ విన్నెట్ సౌలియర్ కార్యక్రమం
  • ‘‘మ్యూజియాలజీ’’పై ‘ఐఐహెచ్’ విద్యా వ్యవహారాల డీన్ డాక్టర్ మాన్వి సేథ్ కార్యక్రమం
  • ‘‘ఐసిసిఆర్ఒఎం’ భాగస్వామ్యంతో సంరక్షణ’’పై ‘ఐకామ్-సిసి’ డైరెక్టరీ బోర్డు చైర్ పర్సన్ కేట్ సీమోర్ కార్యక్రమం
  • ‘‘కళాఖండాలు, లలిత కళావస్తు నిర్వహణ... ఆదానప్రదానం (లోనింగ్)’’పై జాతీయ మ్యూజియం అదనపు డైరెక్టర్ జనరల్ ఆశిష్ గోయల్ కార్యక్రమం
  • ‘‘మ్యూజియం గ్రాంట్స్ పథకం.. మ్యూజియంల చట్టం’’పై సాంస్కృతిక శాఖ డిప్యూటీ సెక్రటరీ జీవన్ బచ్చవ్ కార్యక్రమం
  • ‘‘1970 యునెస్కో తీర్మానం’’పై యునెస్కో ఢిల్లీ విభాగం డైరెక్టర్ టిమ్ కర్టిస్ కార్యక్రమం
  • ‘‘మ్యూజియం నిర్వహణ’’పై బెంగళూరు ‘ఐఐఎం’ ప్రొఫెసర్ ఎ.దామోదరన్ కార్యక్రమం
  • ‘‘సంరక్షణ, ప్రదర్శనా స్వరూపం (క్యురేషన్ అండ్ ఎగ్జిబిషన్ డిజైన్)’’పై ‘డిఎంబిజి’ కన్సల్టెంట్స్ డైరెక్టర్ గౌరీ కృష్ణన్ కార్యక్రమం

   ఈ మూడు రోజుల సదస్సులో భాగంగా తమతమ పరిధిలోని రెండుమూడు ప్రధాన మ్యూజియాల నుంచి ఉత్తమ కళాఖండాలు, విధానాలను ప్రదర్శించేలా రాష్ట్రాలను ప్రోత్సహించారు. ఈ ప్రదర్శనలను  ప్రత్యేక నిపుణుల బృందం మూల్యాంకనం చేసింది. అటుపైన విమర్శకుల ఎంపిక, సహ సంస్థల సమీక్ష (పీర్ రివ్యూ) ద్వారా ప్రజాదరణ (పాపులర్ ఛాయిస్) ప్రాతిపదికన ప్రతి మండలం పరిధిలో ఒకరు వంతున విజేతలను నిర్ణయించారు.

విమర్శకుల ఎంపిక కింద విజేతలు:

  • ఉత్తరం: పంజాబ్‌; ప్రతినిధి శ్రీమతి నీరూ కాత్యల్ గుప్తా
  • దక్షిణం: ఆంధ్రప్రదేశ్; ప్రతినిధి శ్రీమతి జి.వాణీమోహన్
  • తూర్పు: బీహార్‌; ప్రతినిధి శ్రీ రాహుల్ గుప్తా
  • ఈశాన్యం: అస్సాం; ప్రతినిధి శ్రీ అరిందమ్ బారువా
  • పశ్చిమం: గుజరాత్; ప్రతినిధి డాక్టర్ పంకజ్ శర్మ

ప్రజాదరణ ప్రాతిపదికగా విజేతలు:

  • ఉత్తరం: చండీగఢ్; ప్రతినిధులు శ్రీమతి మేఘా కులకర్ణి, శ్రీమతి సీమా గెరా
  • దక్షిణం: తమిళనాడు; ప్రతినిధి ఎన్.సుందరరాజన్
  • తూర్పు: ఛత్తీస్‌గఢ్; ప్రతినిధి వివేక్ ఆచార్య
  • ఈశాన్యం: మణిపూర్; ప్రతినిధి శ్రీమతి మృణశ్రీ మైరాంబం
  • పశ్చిమం: రాజస్థాన్; ప్రతినిధి పంకజ్ ధీరేంద్ర

   వీటితోపాటు వివిధ విశ్వవిద్యాలయాల ప్రదర్శనల నుంచి విజేతలను ప్రకటించారు. ఈ మేరకు జ్యూరీ ఎంపిక విభాగంలో ఇందిరా కళా సంగీత విశ్వవిద్యాలయం (ఛత్తీస్‌గఢ్‌); ప్రజాదరణ ప్రాతిపదికన యూనివర్సిటీ ఆఫ్ డిజిటల్ సైన్సెస్, ఇన్నొవేషన్ అండ్ టెక్నాలజీ (కేరళ) ఎంపికయ్యాయి.

   ‘యుగయుగేఁ భారత్ మ్యూజియం’ నిర్మాణంలో సంభావ్య సంస్థల భాగస్వామ్యం లక్ష్యంతో చేపట్టిన కృషిలో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ సదస్సు నిర్వహించింది. కేంద్ర-రాష్ట్రాల మధ్య మధ్య గణనీయ సహకార విస్తృతిద్వారా ప్రభుత్వ మ్యూజియాల వ్యవస్థలో మార్పులకుగల మార్గాన్వేషణ కోసం ఈ సదస్సు ఒక ప్రత్యేక అవకాశంగా ఉపయోగపడింది.

******


(Release ID: 2041566) Visitor Counter : 70