సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అక్రమ మైనింగ్ మాదకద్రవ్య విక్రయాలకు పాల్పడితే ఎంతటివారైనా వదిలేది లేదు: డాక్టర్ జితేంద్ర సింగ్


‘వికసిత భారత్ దిశగా యువతకు సాధికారత’ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రసంగం;

మాదకద్రవ్యాలు.. పశువుల అక్రమ తరలింపు అక్రమ
మైనింగ్‌ తదితరాలపై పోరుకు డాక్టర్ సింగ్ పిలుపు;

కేంద్ర మంత్రి బహిరంగ సమావేశం: పౌర సమస్యలు.. ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం

Posted On: 03 AUG 2024 5:35PM by PIB Hyderabad

   దేశంలో అక్రమ మైనింగ్, పశువుల తరలింపు, మాదక ద్రవ్యాల విక్రయం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణచివేయడానికి కేంద్ర  ప్రభుత్వ పాలన యంత్రాంగం, పోలీసు శాఖ ఒక సంయుక్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఈ మేరకు కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ, ప్రధాని కార్యాలయం, ప్రజా ఫిర్యాదులు-పెన్షన్లు, అణుశక్తి-అంతరిక్ష శాఖల (స్వతంత్ర బాధ్యతగల) సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ ఇవాళ వెల్లడించారు. మాదక ద్రవ్యాల వాడకం, పశువుల విచ్చలవిడి రవాణా, అక్రమ మైనింగ్‌ వగైరాలను అరికట్టేందుకు చేస్తున్న కృషికి అండగా నిలవాలని సమాజంలోని అన్ని వర్గాలకూ ఆయన పిలుపునిచ్చారు.

   ‘‘వికసిత భారత్ కోసం యువతకు సాధికారత’’పై జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలోగల హీరానగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రసంగించారు. అక్రమ కార్యకలాపాల సవాళ్లను ఎదుర్కోవడంలో స్థానిక యంత్రాంగం, పోలీసులు అన్నివిధాలా కృషి చేస్తున్నారని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ‘‘స్మగ్లర్లు, గనుల అక్రమ తవ్వకందారులు, ఉగ్రవాదులకు సహకరించేవారిని ఉపేక్షించేది లేదు. అలాంటి వ్యక్తులు ఎంతటివారైనా రాజకీయ రాగద్వేషాలతో నిమిత్తం లేకుండా కఠినంగా వ్యవహరిస్తాం.. ఏ ఒక్కర్నీ వదలబోం’’ అని హెచ్చరించారు.

   అలాగే ‘‘ఇతరుల పిల్లలను మాదకద్రవ్యాల ఊబిలోకి తోసేవారు తామూ ఈ సమాజంలో భాగమేనని, తమ పిల్లలు కూడా ఈ వ్యసనం బారినపడే ముప్పు ఉన్నదనే వాస్తవాన్ని గుర్తించాలి’’ అని డాక్టర్ జితేంద్ర సింగ్ హితవు పలికారు. మాదకద్రవ్యాల వాడకం వల్ల విద్యార్థులు, యువతలో దుష్ప్రభావాలను స్పష్టం చేస్తూ ప్రత్యేక తరగతులు నిర్వహించాల్సిందిగా కళాశాల యాజమాన్యానికి కేంద్ర మంత్రి సూచించారు. రాబోయే కాలంలో వికసిత భారత్‌ రూపకర్తలైన యువత భవిష్యత్తుకు రక్షణ కల్పించాలన్నారు. ‘‘ఈ నేరాల బలిపీఠానికి వారి శక్తిసామర్థ్యాలను, ప్రతిభను మనం బలి చేయరాదు’’ అని డాక్టర్ సింగ్ ఉద్ఘాటించారు.

   ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాలపై పోరులో సమాజంలోని అన్ని వర్గాలూ తమవంతు పాత్ర పోషించడం అవశ్యమని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవడానికి ప్రతినబూనాలని, తద్వారా మరింత పారదర్శక, నిజాయితీ సహిత పాలనకు ఉద్దేశించిన ప్రభుత్వ చర్యలకు మనస్ఫూర్తిగా గట్టి మద్దతివ్వాలని ప్రజలను కోరారు.

   ఉగ్రవాదులు, మాదకద్రవ్యాల వ్యాపరుల మధ్య బంధాన్ని ఛేదించాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉగ్రవాద దుశ్చర్యలను నిరోధిచడంలో చేపట్టిన చర్యలను వివరిస్తూ- గ్రామ రక్షక దళాల (విడిజి)ను బలోపేతం చేశామని, వారికి అత్యాధునిక ఆయుధాలు కూడా సమకూర్చామని డాక్టర్ సింగ్ తెలిపారు. ‘‘ఉగ్రవాదుల సవాళ్లను మరింత దీటుగా తిప్పికొట్టడంలో రక్షణ దళాలు, ఇతర చట్టబద్ధ సంస్థలు కూడా తమ వ్యూహాలకు పదునుపెట్టాయి’’ అని డాక్టర్ సింగ్ చెప్పారు.

   గత 10 సంవత్సరాల మోదీ ప్రభుత్వ పాలనలో కథువా జిల్లా వేగంగా పురోమించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ‘‘ఉత్తర భారతంలో తొలి జీవ-సాంకేతిక పార్క్ వంటి జాతీయ ప్రాజెక్టు ఇక్కడ ఏర్పాటు కావడం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది’’ అని గుర్తుచేశారు. ఇది నేడు స్థానిక యువత స్వయం ఉపాధికి బాటలు వేస్తున్నదని చెప్పారు.

   ఈ కార్యక్రమం అనంతరం కేంద్ర మంత్రి రెండు గంటలకుపైగా ప్రజా దర్బార్ నిర్వహించారు. ఇందులో భాగంగా డిప్యూటీ కమిషనర్ రాకేష్ మిన్హాస్ కూడా డాక్టర్ సింగ్‌తో కలిసి ప్రజల సమస్యలు, వినతులను స్వీకరించారు. అంతేకాకుండా అనేక ఫిర్యాదులు, సమస్యలను వారు తక్షణం పరిష్కరించారు. ప్రజా భాగస్వామ్య స్ఫూర్తితో పౌరుల డిమాండ్లను సకాలంలో తీర్చాలని జిల్లా యంత్రాంగాన్ని మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు.

***


(Release ID: 2041361) Visitor Counter : 49