నౌకారవాణా మంత్రిత్వ శాఖ
కొత్త భారీ ఓడరేవులు
Posted On:
02 AUG 2024 1:56PM by PIB Hyderabad
మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలోని వడవాన్ వద్ద భారీ ఓడరేవు ఏర్పాటుకు భూ సేకరణ సహా మొత్తం రూ.76,220 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు నిర్మించే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం 19.06.2024న ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ, మహారాష్ట్ర తీరప్రాంత అభివృద్ధి బోర్డు 74 శాతం, 26 శాతం వాటాతో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) కింద నిర్మాణ పనులు చేపడతాయి. ఈ మేరకు కీలక మౌలిక సదుపాయాల కల్పన టెర్మినళ్లు, ఇతర వాణిజ్య మౌలిక వసతుల నిర్మాణం చేస్తాయి. ఈ రేవు ద్వారా ఏటా 298 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటిపిఎ) రవాణా సామర్థ్యం సాధించాలన్నది లక్ష్యం. ఈ రేవుతో భారత్-మధ్యప్రాచ్య-ఐరోపా ఆర్థిక కారిడార్, అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ల ద్వారా ఎగుమతి-దిగుమతి (ఎగ్జిమ్) వాణిజ్య స్రవంతి సదుపాయాల కల్పన; దూరప్రాచ్యం, ఐరోపా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, అమెరికాలను కలిపే అంతర్జాతీయ నౌకా మార్గాల్లో ప్రయాణించే భారీ మెయిన్ లైన్ నౌకలకు వసతి కల్సన వంటి పలు ప్రయోజనాలు చేకూరుతాయి.
కేంద్ర ప్రభుత్వ (ఓడరేవులు-షిప్పింగ్-జలమార్గాల మంత్రిత్వ శాఖ) పరిధిలో చెన్నై, కొచ్చిన్, దీన్ దయాళ్ (కాండ్లా), జవహర్లాల్ నెహ్రూ (నవా షెవా), కోల్‌కతా, మోర్మగావ్, ముంబై, న్యూ మంగళూరు, పారాదీప్, వి.ఒ.చిదంబరనార్ (తూత్తుకుడి), విశాఖపట్నం, కామరాజర్ పోర్ట్ లిమిటెడ్ తదితర 12 ప్రధాన ఓడరేవులున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన రేవులలో నిర్దిష్ట కాలానికిగాను రాయితీ ఒప్పందం కింద ప్రాజెక్టులు/బెర్తులు, టెర్మినళ్ల కోసం ప్రైవేట్ రంగ భాగస్వామ్యానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ ఒప్పందం కోసం రాయితీ పొందే సంస్థ, ప్రధాన ఓడరేవు ప్రాధికార సంస్థల మధ్య రాబడి/రాయల్టీ వాటా పంపకం ప్రాతిపదికన ఈ పనుల కోసం టెండర్లు ఆహ్వానిస్తారు. అటుపైన రాయితీ కాలం ముగిశాక సదరు సదుపాయాల యాజమాన్య హక్కు సంబంధిత రేవు ప్రాధికార సంస్థకు బదిలీ అవుతుంది. ఇక మారిటైమ్ ఇండియా విజన్-2030 అంచనా ప్రకారం- ప్రధాన ఓడరేవుల సరకు రవాణా సామర్థ్యం 2030 నాటికి 2,200 ‘ఎంఎంటిపిఎ’ స్థాయికి చేరనుంది. ఈ నేపథ్యంలో వి.ఒ.చిదంబరనార్ రేవు (తూత్తుకుడి) వద్ద ‘‘పిపిపి విధానంలో ఔటర్ హార్బర్ కంటైనర్ టెర్మినల్ ప్రాజెక్టు’’కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని అంచనా వ్యయం రూ.1,950 కోట్ల మేర సంపోషక ఆర్థిక సహాయ నిధి (వయబిలిటీ గ్యాప్ ఫండింగ్) మద్దతు సహా రూ.7,056 కోట్లు. ఈ మొత్తంతో సమానంగా లేదా దీనికన్నా తక్కువ వాస్తవ ప్రతిపాదిత వ్యయంతో అందే అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటుంది.
కేంద్ర ఓడరేవులు-షిప్పింగ్-జల రవాణాశాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఇవాళ లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక జవాబు ద్వారా ఈ సమాచారం వెల్లడించారు.
***
(Release ID: 2041200)
Visitor Counter : 174