నౌకారవాణా మంత్రిత్వ శాఖ
భారత నౌకారవాణా రంగం అభివృద్ధి
Posted On:
02 AUG 2024 2:03PM by PIB Hyderabad
భారత రవాణా నౌకల సామర్థ్యం, పోటీతత్వం పెంపు, విదేశీ నౌకా కంపెనీలపై పరాధీనత తగ్గింపు, పెరిగే సరకు రవాణా వ్యయం సమస్య పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు కింద పేర్కొన్న పలు కీలక చర్యలు చేపట్టింది:
(i) తొలి తిరస్కరణ హక్కు (ఆర్ఒఎఫ్ఆర్)
ఈ హక్కు ద్వారా విదేశీ నౌకల నుంచి అతి తక్కువ బిడ్‌ను పోల్చి చూసుకునే ప్రాధాన్యం భారత నౌకలకు ఉంటుంది. తద్వారా భారత నౌకలకు డిమాండ్ పెరుగుతుంది. నౌకల టన్నేజ్, నౌకా నిర్మాణ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఈ రంగంలో భారత్‌ను స్వయం సమృద్ధి/స్వావలంబితం చేసే దృష్టితో టెండర్ ప్రక్రియ ద్వారా తొలి తిరస్కరణ హక్కు మంజూరు అర్హతను సవరించారు. దీని ప్రకారం- ‘ఆర్ఒఎఫ్ఆర్’ ప్రాధాన్య క్రమం కిందివిధంగా ఉంటుంది:
- భారతీయ నిర్మాణం-జెండా-యాజమాన్యం
- భారతీయ నిర్మాణం-భారత జెండా, భారత ఐఎఫ్‌ఎస్‌సిఎ(ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ) యాజమాన్యం
- విదేశీ నిర్మాణం-భారత జెండా-యాజమాన్యం
- విదేశీ నిర్మాణం-భారతీయ జెండా-ఐఎఫ్‌ఎస్‌సీఏ యాజమాన్యం
- భారతీయ నిర్మాణం-విదేశీ జెండా-విదేశీ యాజమాన్యం
(ii) భారత షిప్పింగ్ కంపెనీలకు రాయితీ మద్దతు
దేశంలో వాణిజ్య నౌకలకు ప్రోత్సాహం దిశగా ఐదేళ్ల కాలానికిగాను రూ.1,624 కోట్లతో 2021లో రాయితీ పథకాన్ని ప్రారంభించారు. ముడిచమురు, వంటగ్యాస్ (ఎల్‌పిజి), బొగ్గు, ఎరువులు వంటి ప్రభుత్వ దిగుమతులకు సంబంధించి మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సిపిఎస్ఇ)లు జారీచేసే గ్లోబల్ టెండర్లలో పాల్గొనే భారత నౌకా రవాణా కంపెనీలకు రాయితీల మద్దతు లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
(iii) నౌకా నిర్మాణ ఆర్థిక సహాయ విధానం - 2016-2026:
భారత నౌకా నిర్మాణ కేంద్రాలకు ఆర్థిక సహాయం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2015 డిసెంబర్ 9న ఆర్థిక సహాయ విధానానికి ఆమోదం తెలిపింది. చెల్లుబాటయ్యే ఒప్పందాలపై సంతకాల తర్వాత నౌకా నిర్మాణం ప్రారంభిస్తేనే ఈ సహాయం పొందే అర్హత ఉంటుంది. ఆ మేరకు ఒప్పందం తేదీ నుంచి మూడేళ్ల వ్యవధిలో నౌకలను నిర్మించి అందజేయాలి. ప్రత్యేక తరహా నౌకల విషయంలో ఈ వ్యవధిని ఆరేళ్ల దాకా పొడిగించవచ్చు. కాంట్రాక్ట్ ధర, వాస్తవ వ్యయం, సముచిత ధర(ఫెయిర్ ప్రైస్)లలో ఏది తక్కువైతే అందులో 20 శాతం దాకా భారత నౌక నిర్మాణ కేంద్రాలకు ఆర్థిక సహాయంగా అందుతుంది. కాగా, ఈ సాయం మూడేళ్లకొకసారి 3 శాతం వంతున తగ్గుతుంది.
ఈ చర్యల ఫలితంగా భారత ఆర్థిక వృద్ధిలో నౌకా రవాణా రంగం వాటా పెరిగింది. గత దశాబ్ద కాలంలో భారత నౌకల టన్నేజ్ కూడా స్థిరంగా పెరుగుతూ వస్తోంది. ఈ మేరకు 2024 జూన్ నాటికి 11.95 మిలియన్ స్థూల టన్నేజ్ (జిటి-గ్రాస్ టన్నేజ్)తో 485 భారత నౌకలు విదేశీ వాణిజ్యంలో, మరోవైపు 1.7 మిలియన్ ‘జిటి’తో 1041 నౌకలు తీరప్రాంత వాణిజ్యంలో నిమగ్నమయ్యాయి. అలాగే 45,604 ‘జిటి’ల 4 నౌకలను భారత నియంత్రిత టన్నేజీలో భాగంగా కొనుగోలు చేశారు. మొత్తంమీద 13.7 మిలియన్ ‘జిటి’ సామర్థ్యంగల 1,530 నౌకలు భారత జెండా కలిగి ఉన్నాయి. భారత నౌకల టన్నేజ్ పెరగడంతో విదేశీ నౌకలకన్నా వీటికి వాణిజ్య ప్రాధాన్యం ఇనుమడించింది.
కేంద్ర ఓడరేవులు-షిప్పింగ్-జల రవాణాశాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఇవాళ లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక జవాబు ద్వారా ఈ సమాచారం వెల్లడించారు.
***
(Release ID: 2041198)
Visitor Counter : 66