రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రైలు పట్టాలపై ప్రమాదకరమైన స్టంట్


యూట్యూబర్‌ను అరెస్ట్ చేసిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దు
ఎవరైనా అలా చేస్తే మాకు సమాచారమివ్వండి: ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్

Posted On: 02 AUG 2024 4:00PM by PIB Hyderabad

రైలు పట్టాలను ప్రచారంగా వాడుతూప్రజా భద్రతకు భంగం కలిగించిన యూట్యూబర్‌ను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఓ వ్యక్తి వివిధ రకాల వస్తువులను రైల్వే ట్రాక్‌పై ఉంచి తీసిన వీడియోలు సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో వైరల్ గా మారడంతో ఆర్పీఎఫ్ పోలీసులు అత్యవసర దర్యాప్తు చేపట్టారు. గుల్జార్ షేక్ తన యూట్యూబ్ ఛానెల్లో 250కి పైగా వీడియోలను పెట్టారు. అతని ఛానల్‌కు 2 లక్షలకు పైచిలుకు చందాదారులు ఉన్నారు. అతని వీడియో కార్యకలాపాలు రైల్వే భద్రత, కార్యకలాపాలు రెండింటికీ గణనీయమైన ప్రమాదాన్ని కలగజేసేవే.

ఉత్తర రైల్వేకు చెందిన, ఉంచహర్ ఆర్పీఎఫ్ నిందితుడు గుల్జార్ షేక్ యూట్యూబ్ ప్రొఫైల్, సామాజిక మాధ్యమ కార్యకలాపాలను సమగ్రంగా విశ్లేషించిన ఉత్తర రైల్వేకు చెందిన ఆర్ఫీఎఫ్ విభాగం రైల్వే చట్టంలోని వివిధ నిబంధనల కింద ఆగస్ట్ 1 న అతనిపై కేసు నమోదు చేసింది. అదే రోజు ఆర్పీఎఫ్, స్థానిక పోలీసుల బృందం ఉత్తరప్రదేశ్ లోని సోరౌన్ (అలహాబాద్) లోని ఖండ్రౌలి గ్రామంలో నివాసం ఉంటున్న సయ్యద్ అహ్మద్ కుమారుడైన గుల్జార్ షేక్ ను అతని నివాసంలో అరెస్టు చేసింది.

 

లక్నో డివిజన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చేపట్టిన ఈ సత్వర చర్యను ఆర్పీఎఫ్ డిజీ అభినందిస్తూ.. రైల్వేల భద్రత పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్న వ్యక్తులకు గుల్జార్ షేక్ అరెస్ట్ ఒక గుణపాఠంగా ఉంటుందని పేర్కొన్నారు.  రైల్వే భద్రతను దెబ్బతీసే ఎలాంటి ప్రయత్నాలనైనా, దృఢమైన సంకల్పంతో ఎదుర్కొంటామని, కఠిన, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైల్వే ఆస్తులకు భంగం కలిగించే చర్యలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.

 

రైల్వే భద్రతకు భంగం కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 139 ద్వారా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కు లేదా రైల్ మదద్ కు సమాచారం ఇవ్వాల్సిందిగా పేర్కొన్నారు.

***


(Release ID: 2041196) Visitor Counter : 54