ఆర్థిక మంత్రిత్వ శాఖ

మదింపు సంవత్సరం 2024-25కుగాను 2024 జులై 31దాకా రికార్డు స్థాయిలో 7.28 కోట్ల ‘ఐటిఆర్’లు దాఖలు


‘ఎవై’ 2024-25లో కొత్త పన్ను విధానం కింద దాఖలైనవి 5.27 కోట్లు;

2024 జూలై 31న ఒక్కరోజులో 69.92 లక్షలకుపైగా రిటర్నుల దాఖలు;

2024 జూలై 31 నాటికి తొలి రిటర్న్ దాఖలు చేసినవారి సంఖ్య 58.57 లక్షలు;

Posted On: 02 AUG 2024 2:59PM by PIB Hyderabad

   న్ను చెల్లింపుదారులు, పన్ను సంబంధ వృత్తి నిపుణులు సకాలంలో తమ బాధ్యతను నిర్వర్తించడంతో మదింపు సంవత్సరం (ఎవై) 2024-25కుగాను ఆదాయపు పన్ను రిటర్ను (ఐటిఆర్)లు గరిష్ఠ స్థాయిలో దాఖలయ్యాయి. ఈ మేరకు 2024 జులై 31నాటికి  7.28 కోట్లకుపైగా ‘ఐటిఆర్’ల దాఖలుతో కొత్త రికార్డు నమోదైంది. ఇది ‘ఎవై’ 2023-24లో ఇదే తేదీనాటికి అందిన (6.77 కోట్ల) రిటర్నులతో పోలిస్తే 7.5 శాతం అధికం కావడం గమనార్హం.

   ఈసారి కొత్త పన్ను విధానంవైపు మొగ్గుచూపిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య గణనీయంగా ఉంది. ముఖ్యంగా ‘ఎవై’ 2024-25లో మొత్తం 7.28 కోట్ల ‘ఐటిఆర్’లకుగాను పాత విధానం కింద 2.01 కోట్లు దాఖలుగా, 5.27 కోట్లు కొత్త విధానం ప్రకారం సమర్పించినవే కావడం విశేషం. అంటే- పన్ను చెల్లింపుదారులలో దాదాపు 72 శాతం కొత్త విధానాన్ని ఎంచుకోగా, మిగిలిన 28 శాతం పాత పద్ధతినే పాటించారు.

   ఇక ఒక్కరోజులో దాఖలైన రిటర్నుల సంఖ్య రీత్యా 2024 జులై 31న అత్యధికంగా అందాయి. సాధారణంగా జీతభత్యాలపై ఆధారపడిన చెల్లింపుదారులతోపాటు ఇతరత్రా తనిఖీ రహిత రిటర్నుల దాఖలుకూ 2024 జులై 31 తుది గడువుగా ఉంది. తదనుగుణంగా ఆ ఒక్కరోజున అత్యధికంగా 69.92 లక్షలకుపైగా ‘ఐటిఆర్’లు దాఖలయ్యాయి. ఇందులో భాగంగా ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా అత్యధికంగా గంటకు 5.07 లక్షలు దాఖలయ్యాయి. ఇవన్నీ 2024 జులై 31న రాత్రి 7-8 గంటల మధ్య సమర్పించినవే. కాగా, ఒక్క సెకనులో దాఖలైన అత్యధిక రిటర్నుల రీత్యా 2024 జులై 17న 8గం:13ని:54 సెకను వేళ 917 అందాయి. అలాగే నిమిషానికి దాఖలైన అత్యధిక రిటర్నుల సంఖ్య రీత్యా 2024 జులై 31న రాత్రి 8గం:13నిమిషంలో 9,367 దాఖలయ్యాయి. అదేవిధంగా తొలిసారి ‘ఐటిఆర్’ సమర్పించిన వారినుంచి 31.07.2024నాటికి 58.57 లక్షలు అందాయి. దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య విస్తరణకు ఇదొక నిదర్శనం.

   చరిత్రలో ప్రప్రథమంగా ఈ ఆర్థిక సంవత్సరం తొలిరోజు... 2024 ఏప్రిల్ 1న ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా వివిధ రకాల ‘ఐటిఆర్’ల (ఐటిఆర్-1, 2, 4, 6) దాఖలు సదుపాయాన్ని ఆదాయపు పన్ను విభాగం అందుబాటులోకి తెచ్చింది. మునుపటి ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే ఐటిఆర్-3, 5లను కూడా ఎంతో ముందుగా ఆవిష్కరించారు. పాత, కొత్త పన్ను విధానాలపై చెల్లింపుదారులలో అవగాహన కల్పన దిశగా ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. ఇందులో భాగంగా తరచూ అడిగే ప్రశ్నల (ఎఫ్ఎక్యు) విభాగంలో సంబంధిత వీడియోలను ఇ-ఫైలింగ్ పోర్ట‌ల్‌లో అందుబాటులో ఉంచారు.

   నిర్దిష్ట గడువుకు ముందే ‘ఐటిఆర్’ దాఖలు చేసేలా చెల్లింపుదారులను ప్రోత్సహిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా చైతన్యకల్పన ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. దీంతోపాటు వేర్వేరు వేదికలలోనూ ప్రత్యేక సృజనాత్మక ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించారు. హిందీ, ఆంగ్లంసహా 12 భారతీయ భాషలలో సమాచార ప్రదాన వీడియోలను డిజిటల్ వేదికలలో ఉంచారు. అంతేకాకుండా బహిరంగ ప్రచార కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ కృషి ఫలితంగా ‘ఐటిఆర్’ల సమర్పణ సంఖ్య ఆశించినదానికన్నా ఎక్కువగానే పెరిగింది. కింది పట్టికలోని కొన్నేళ్ల ‘ఐటిఆర్’ దాఖలు సంబంధిత సమాచారం ఈ వాస్తవాన్ని రుజువు చేస్తోంది:

మదింపు సంవత్సరం

గడువు తేదీ

దాఖలైన రిటర్నులు

2020-21

10/01/2021

5,78,45,678

2021-22

31/12/2021

5,77,39,682

2022-23

31/07/2022

5,82,88,692

2023-24

31/07/2023

6,77,42,303

2024-25

31/07/2024

7,28,80,318

 

 

 

   ప్రస్తుత ‘ఎవై’ 2024-25లో దాఖలైన 7.28 కోట్ల రిటర్నులలో 45.77 శాతం (3.34 కోట్లు) ఐటిఆర్-1 కిందకు వస్తాయి. అలాగే ఐటిఆర్-2 కింద 14.93 శాతం (1.09 కోట్లు); ఐటిఆర్-3 కింద 12.50 శాతం (91.10 లక్షలు); ఐటిఆర్-4 కింద 25.77 శాతం (1.88 కోట్లు), ఐటిఆర్-5 నుంచి ఐటిఆర్-7 వరకూ 1.03 శాతం (7.48 లక్షలు)గా ఉన్నాయి. వీటిలో 43.82 శాతం ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా అందుబాటులోగల ఆన్‌లైన్‌ సదుపాయంతో దాఖలయ్యాయి. మిగిలినవన్నీ ఆఫ్‌లైన్‌ సౌకర్యంతో దాఖలు చేశారు.

   రిటర్నుల దాఖలు గరిష్ఠ స్థాయిలో వెల్లువెత్తినప్పటికీ ఇ-ఫైలింగ్ పోర్టల్ దీటుగా ప్రతిస్పందిస్తూ చెల్లిపుదారులు సకాలంలో ఎలాంటి అంతరాయం లేకుండా దాఖలు చేసేందుకు తోడ్పడింది. కాబట్టే, 2024 జులై 31 ఒక్కరోజునే 3.2 కోట్ల ‘లాగిన్’లు సఫలమయ్యాయి.

   ‘ఐటిఆర్’ల పరిశీలన ప్రారంభించి, పన్ను వాపసు ఉత్తర్వులు పొందడంలో కీలకమైన ‘ఇ-వెరిఫికేషన్’ (నిర్ధారణ) ప్రక్రియ కింద 6.21 కోట్లకుపైగా ‘ఐటిఆర్’ల తనిఖీ ముగియడం ప్రోత్సాహకర పరిణామం. వీటిలో 5.81 కోట్లకుపైగా (93.56 శాతం) రిటర్నుల నిర్ధారణ ‘ఆధార్’ ప్రాతిపదికగాగల ‘ఒన్ టైమ్ పాస్ వర్డ్’ (ఒటిపి) ద్వారా పూర్తయింది. కాగా, ‘ఎవై’ 2024-2025కుగాను 2024 జులై 31నాటికి 2.69 కోట్లకుపైగా ‘ఐటిఆర్’ల (43.34 శాతం) పరిశీలన పూర్తయింది. ఇక 91.94 లక్షలకు పైగా చలానాలను ‘టిన్ (టిఐన్) 2.0’ వ్యవస్థ ద్వారా స్వీకరించారు. ఈ మాధ్యమం ద్వారా 2024 ఏప్రిల్ 1 నుంచి (ఎవై 2024-25కు) దాఖలైన మొత్తం చలానాల సంఖ్య 1.64 కోట్లు.

   పన్ను చెల్లింపుదారులు 31.07.2024 వరకు అడిగిన దాదాపు 10.64 లక్షల ప్రశ్నలకు ఇ-ఫైలింగ్ సహాయ కేంద్రం (హెల్ప్ డెస్క్) బృందం జవాబిస్తూ గరిష్ఠ స్థాయిలో రిటర్నులు సకాలంలో దాఖలయ్యే పూర్తి సహకారం అందించింది. కాల్ స్వీకరణ, సమాధానాలివ్వడం, ప్రత్యక్ష సంభాషణ (లైవ్ చాట్), వెబెక్స్ (WebEx), కో-బ్రౌజింగ్ (co-browsing) సదుపాయల ద్వారా పన్ను చెల్లిపుదారులకు మార్గనిర్దేశం చేసింది.

   ఆదాయపు పన్ను విభాగం ‘ఎక్స్’ (ట్విటర్) హేండిల్ ద్వారా అందిన ప్రశ్నలకు కూడా ‘ఆన్‌లైన్‌ రెస్పాన్స్ మేనేజ్ మెంట్’ (ఒఆర్ఎమ్) విధానం ద్వారా తగిన పరిష్కారాలు చూపింది. తద్వారా పన్ను చెల్లింపుదారులకు, సంబంధిత వర్గాలకు తక్షణ సాయం అందించగలిగింది. మరోవైపు ఈ బృందం 2024 ఏప్రిల్ 1 నుంచి జులై 31 మధ్య 1.07 లక్షల ఇ-మెయిళ్లను కూడా  పరిశీలించి, 99.97 శాతం సందేహాలను నివృత్తి చేసింది.

   ‘ఐటిఆర్’లు, ఇతర ఫారాల దాఖలులో బాధ్యతాయుతంగా వ్యవహరించిన చెల్లింపుదారులకు, పన్ను సంబంధిత వృత్తి నిపుణులకు ఆదాయపు పన్ను విభాగం ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది. వారి ‘ఐటిఆర్’ల నిర్ధారణ ప్రక్రియ పూర్తికాని పక్షంలో దాఖలు తేదీ నుంచి 30 రోజుల్లోగా సరిచూసుకోవాల్సిందిగా సూచించింది.

   ఏదైనా కారణంతో గడువు తేదీలోగా ‘ఐటిఆర్’ దాఖలు చేయలేకపోతే వీలైనంత త్వరగా ఆ ప్రక్రియను పూర్తిచేయాలని కూడా విజ్ఞప్తి చేసింది.

***



(Release ID: 2041051) Visitor Counter : 59