వ్యవసాయ మంత్రిత్వ శాఖ
పిఎమ్-కిసాన్ సమ్మాన్ నిధి
Posted On:
30 JUL 2024 6:29PM by PIB Hyderabad
పిఎమ్-కిసాన్ పథకం కేంద్రీయ రంగం లో అమలయ్యే పథకం. భూమిని కలిగివున్న రైతుల ఆర్థిక అవసరాలను తీర్చడం కోసం గౌరవనీయ ప్రధాన మంత్రి ఈ పథకాన్ని 2019 ఫిబ్రవరి లో ఆరంభించారు. ఈ పథకంలో భాగంగా, ప్రతి ఏటా 6,000 రూపాయల ఆర్థిక ప్రయోజనాన్ని మూడు సమాన వాయిదాలలో ప్రత్యక్ష ప్రయోజనం బదలాయింపు (డిబిటి) పద్ధతిలో దేశవ్యాప్తంగా రైతుల కుటుంబాలకు చెందిన బ్యాంకు ఖాతాలలోకి బదలాయించడం జరుగుతున్నది. ప్రపంచంలో అతి పెద్ద డిబిటి పథకాల్లో పిఎమ్-కిసాన్ పథకం ఒకటి.
రైతును కేంద్ర స్థానంలో నిలుపుతూ రూపొందించిన డిజిటల్ మాధ్యమ ప్రధాన మౌలిక సదుపాయాల వ్యవస్థ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పథకం ప్రయోజనాలను దేశమంతటా రైతులకు అందించడానికి తోడ్పడింది. లబ్ధిదారుల నమోదులో, ఆ వివరాల తనిఖీలో అత్యంత పారదర్శకత్వాన్ని పాటిస్తూ, భారత ప్రభుత్వం ఇంతవరకు 11 కోట్ల మందికి పైగా రైతులకు 3.24 లక్షల కోట్ల రూపాయలకు పైచిలుకు నగదును 17 వాయిదాలలో పంపిణీ చేసింది. రైతులకు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ ఉపకరణాల వంటి వ్యావసాయిక అవసరాలను నెరవేర్చుకోవడంలో తోడ్పడాలన్న ఉద్దేశ్యంతో 6,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వారికి అందించడం జరుగుతోంది.
ఈ సమాచారాన్ని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్ నాథ్ ఠాకుర్ లోక్ సభలో మంగళవారం ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలియజేశారు.
***
(Release ID: 2039562)
Visitor Counter : 105