భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం
प्रविष्टि तिथि:
30 JUL 2024 3:54PM by PIB Hyderabad
భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీ) ప్రోత్సహించడానికి ఈ క్రింది పథకాలను అమలు చేస్తోంది:-
1. ఎలక్ట్రిక్ రవాణా ప్రోత్సాహక పథకం(ఈఎంపీఎస్)-2024ను 2024 ఏప్రిల్ 1 నుంచి 2024 జూలై 31 వరకు 4 నెలల కాలానికి రూ.500 కోట్ల వ్యయ అంచనాతో అమలు చేస్తోంది. ఇందులో ఎలక్ట్రిక్ దిచక్ర, త్రిచక్ర వాహన(ఈ-2డబ్ల్యూ, ఈ-3డబ్ల్యూ) కొనుగోలుదారులకు ప్రోత్సాహకాలను అందిస్తోంది.
2. రూ.25,938 కోట్ల బడ్జెట్ వ్యయంతో వాహనాలు, వాహన విడిభాగాలు పరిశ్రమ(పీఎల్ఐ-ఏఏటీ)కు సంబంధించి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని(ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్) తీసుకొచ్చింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలు(ఈ-2డబ్ల్యూ, ఈ-3డబ్ల్యూ, ఈ-4 డబ్ల్యూ).. ఈ-బస్సులు, ఈ-ట్రక్కులతో సహా వివిధ విభాగాల ఎలక్ట్రిక్ వాహనాలను ఈ పథకం ప్రోత్సహిస్తుంది.
3. రూ. 18,100 కోట్ల బడ్జెట్ వ్యయంతో దేశంలో అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్(పీఎల్ ఐ-ఏసీసీ) బ్యాటరీల తయారీకి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని అమలు చేస్తోంది.
4. ప్రపంచంలోని ఈవీ తయారీదారుల పెట్టుబడులను ఆకర్షించడానికి, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ గమ్యస్థానంగా భారతదేశాన్ని రూపుదిద్దేందుకు భారతదేశంలో ఎలక్ట్రిక్ ప్రయాణ కార్ల తయారీని ప్రోత్సహించే పథకాన్ని అమలు చేస్తోంది.
ఇవే కాకుండా, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ క్రింది కార్యక్రమాలను కూడా చేపట్టింది: -
1. ఎలక్ట్రిక్ వాహనాలు, చార్జర్లు, ఛార్జింగ్ స్టేషన్లపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు.
2. బ్యాటరీతో నడిచే వాహనాలకు గ్రీన్ లైసెన్స్ ప్లేట్లు, పర్మిట్ నిబంధనల నుంచి మినహాయింపును రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్‌టీహెచ్) ప్రకటించింది.
3. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు ఖర్చును తగ్గించడంలో సహాయపడేందుకు ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్ ట్యాక్స్‌ను మాఫీ చేయాలని రాష్ట్రాలకు సూచిస్తూ ఎంఓఆర్‌టీహెచ్ నోటిఫికేషన్ జారీ చేసింది.
భారతదేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వాడకాన్ని వేగంగా పెంచేందుకు ఫేమ్(ఫాస్టర్ ఆడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్ఛరింగి ఆఫ్ ఎలక్ట్రిక్&హైబ్రిడ్ వెహికిల్స్) పథకం మొదటి, రెండో దశ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు సబ్సిడీలను అందిస్తోంది. ఎలక్ట్రిక్ రవాణా ప్రోత్సాహక పథకం (ఈఎంపీఎస్)-2024 ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు ధర ముందస్తు తగ్గింపు రూపంలో ఈ-2డబ్ల్యూ, ఈ-3డబ్ల్యూ కొనుగోలుదారులకు ప్రోత్సాహకాలు/సబ్సిడీ అందుతోంది.
ఈ మేరకు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ లోక్ సభకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
****
(रिलीज़ आईडी: 2039554)
आगंतुक पटल : 125