ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
‘పిఎంకెఎస్‌వై’ కింద పలు ప్రాజెక్టులకు ఆహార తయారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆమోదం
మొత్తం 41 మెగా ఫుడ్ పార్కులు.. 399 శీతల గిడ్డంగులు.. 76 ఆగ్రో-ప్రాసెసింగ్ సముదాయాలు.. 588 ఆహార తయారీ పరిశ్రమలకు ‘ఎంఒఎఫ్‌పిఐ’ ఆమోదం
Posted On:
25 JUL 2024 4:56PM by PIB Hyderabad
భారత ఆర్థిక వ్యవస్థలో ఆహార తయారీ పరిశ్రమల రంగం కీలక భాగంగా మారింది. స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో వాటా సహా ఉపాధి సృష్టి, ఎగుమతులు తదితరాల రీత్యా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు 2022-23తో ముగిసిన గత ఎనిమిదేళ్లలో ఆహార తయారీ పరిశ్రమల రంగం దాదాపు 5.35 శాతం సగటు వార్షిక వృద్ధి (ఎఎజిఆర్)ని నమోదు చేసింది. ఇక స్థూల విలువ జోడింపు (జివిఎ) 2015-16లో రూ.1.61 లక్షల కోట్లు కాగా, (గణాంక-కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ తొలి సవరణ అంచనాల ప్రకారం) 2022-23నాటికి రూ.1.92 లక్షల కోట్లకు పెరిగింది. మరోవైపు పరిశ్రమలపై వార్షిక అధ్యయనం (ఎఎస్ఐ) తాజా నివేదిక ప్రకారం ఆహార తయారీ రంగంలో ఉపాధి అవకాశాలు 2014-15లో 17.73 లక్షలు కాగా, 2021-22నాటికి 20.68 లక్షలకు పెరిగింది. దీంతోపాటు వ్యవసాయ-ఆహార ఎగుమతులలో ఆహార తయారీ రంగం వాటా 2014-15లో 13.7 శాతం కాగా, 2023-24 నాటికి 23.4 శాతం స్థాయికి దూసుకెళ్లింది.
ఆహార తయారీ రంగం సర్వతోముఖాభివృద్ధితోపాటు సవాళ్లను అధిగమించడంలో తోడ్పాటు దిశగా కేంద్ర ఆహార తయారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఒఎఫ్‌పిఐ) కేంద్ర రంగ ‘సాముదాయక పథకం’ (అంబ్రెల్లా స్కీమ్) అమలు చేస్తోంది. ‘ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన’ (పిఎంకెఎస్‌వై), ‘ఆహార తయారీ పరిశ్రమల కోసం ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకం’ (పిఎల్ఐఎస్ఎఫ్‌పిఐ), ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార తయారీ సంస్థల అధికారికీకరణ పథకం (పిఎంఎఫ్ఎంఇ) ఈ సాముదాయక పథంలో అంతర్భాగంగా ఉంటాయి.
‘పిఎంకెఎస్‌వై’ అమలులో భాగంగా మంత్రిత్వశాఖ దేశమంతటా ఆధునిక మౌలిక సదుపాయాల సృష్టితోపాటు పొలాల నుంచి చిల్లర విక్రయ కేంద్రాల దాకా ప్రభావశీల సరఫరా శ్రేణిని ప్రోత్సహిస్తుంది. అలాగే ఆహార తయారీ పరిశ్రమల ప్రగతి, సర్వతోముఖాభివృద్ధి దిశగా ఉపాధి అవకాశాలను సృష్టికి దోహదపడుతుంది. వ్యవసాయ ఉత్పాదకతలో వ్యర్థాలను అరికట్టడం, తయారీ స్థాయుల పెంపు, ఆహారోత్పత్తుల ఎగుమతులను పెంపులో చేయూతనిస్తుంది. అంతేగాక దేశంలో కొత్త ఆహార తయారీ పరిశ్రమలు/యూనిట్లు/ప్రాజెక్టుల ఏర్పాటుసహా ఇప్పటికే నడుస్తున్న సంస్థల విస్తరణకు ‘పిఎంకెఎస్‌వై’లో అంతర్భాగమైన వివిధ పథకాల కింద మూలధన రాయితీ రూపంలోనూ మంత్రిత్వ శాఖ ఆర్థిక సహాయం (జిఐఎ) చేస్తుంది. ఇందులో భాగంగా 2024 జూన్ 30నాటికి మొత్తం 41 మెగా ఫుడ్ పార్కులు, 399 శీతల గిడ్డంగుల శ్రేణి ప్రాజెక్టులు, 76 ఆగ్రో-ప్రాసెసింగ్ సముదాయాలు, 588 ఆహార తయారీ యూనిట్లు, 61 సరఫరా-వినియోగ సంధాన సృష్టి ప్రాజెక్టులు, 52 ఆపరేషన్ గ్రీన్ ప్రాజెక్టులకు మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
సూక్ష్మ ఆహార తయారీ సంస్థల ఏర్పాటు/ఉన్నతీకరణ కోసం ‘పిఎంఎఫ్ఎంఇ’ పథకం కింద ఆర్థిక-సాంకేతిక తోడ్పాటుసహా వ్యాపార మద్దతు కూడా ఇస్తుంది. ఈ పథకం రూ.10,000 కోట్ల అంచనా వ్యయంతో 2020-21లో ప్రారంభం కాగా, 2024-25 వరకు ఐదేళ్లపాటు కొనసాగుతుంది. దీనికింద 2024 జూన్ 30 నాటికి 92,549 సూక్ష్మ ఆహార తయారీ సంస్థల ఏర్పాటుకు మంత్రిత్వశాఖ ఆమోదముద్ర వేసింది.
ఇక ఆహారోత్పత్తుల తయారీలో అంతర్జాతీయ స్థాయి అగ్రగామి సంస్థల సృష్టి, విదేశాల్లో బ్రాండింగ్- మార్కెటింగ్, ప్రపంచ విపణిలో భారత ఆహారోత్పత్తుల బ్రాండ్లకు మద్దతు దిశగా ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకం’ (పిఎల్ఐఎస్ఎఫ్‌పిఐ) అమలవుతోంది. ఇది రూ.10,900 కోట్లతో 2021-22లో ప్రారంభం కాగా, 2026-27 వరకు ఆరేళ్లపాటు అమలవుతుంది. ఈ పథకం కింద సహాయం దిశగా 2024 జూన్ 30 నాటికి 172 ఆహార తయారీ కంపెనీలకు మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది.
లోక్‌సభలో ఇవాళ ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ- కేంద్ర ఆహార తయారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ రవ్‌నీత్ సింగ్ ఈ సమాచారం వెల్లడించారు.
***
(Release ID: 2037229)
Visitor Counter : 93