బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘అమ్మ పేరిట ఒక మొక్క’ పేరిట ధన్‌బాద్‌లోని బిసిసిఎల్‌లో మొక్కలు నాటే కార్యక్రమం-2024కు బొగ్గుశాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి శ్రీకారం

Posted On: 25 JUL 2024 4:34PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘అమ్మ పేరిట ఒక మొక్క’ నినాదంతో చేపట్టిన దార్శనిక ఉద్యమంలో భాగంగా కేంద్ర బొగ్గు-గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఇవాళ (25.07.2024) ధన్‌బాద్‌లోని భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బిసిసిఎల్- కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ) ప్రాంగణంలో ‘మొక్కలు నాటే కార్యక్రమం (విఎ)-2024’ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 47 జిల్లాల పరిధిలోగల దాదాపు 300 బొగ్గు/లిగ్నైట్ క్షేత్రాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏకకాలంలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో ‘విఎ-2024’లో భాగంగా బొగ్గు మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ రంగ బొగ్గు/లిగ్నైట్ సంస్థలు వివిధ క్షేత్రాల్లో దాదాపు 10 లక్షల మొక్కలు నాటడం-పంపిణీలో పాలుపంచుకోవడాన్ని మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఈ సందర్భంగా అభినందించారు. కాగా, ధ‌న్‌బాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎంపీ శ్రీ దులు మహతో, బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అమృత్ లాల్ మీనా, కోల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ సహా బొగ్గు కంపెనీల సీనియర్ అధికారులు తదితరులు కూడా పాల్గొన్నారు.

 

   దేశీయ ఇంధన అవసరాలు తీర్చే దిశగా ప్రభుత్వరంగ బొగ్గు/లిగ్నైట్ సంస్థలు బొగ్గు ఉత్పత్తిని గణనీయంగా పెంచాయి. దీంతోపాటు వివిధ ఇతర కార్యక్రమాల ద్వారా పర్యావరణ సుస్థిరత్వంపైనా  తమ నిబద్ధతను నిలకడగా చాటుకుంటున్నాయి. ఈ మేరకు గడచిన ఐదేళ్లలో తమ పరిధిలోని బొగ్గు క్షేత్రాలు, పరిసరాల్లో 10,942 హెక్టార్ల మేర 2.40 కోట్ల మొక్కలు నాటాయి. తద్వారా వాతావరణ మార్పుల నుంచి ఉపశమనం, కర్బన ఉద్గారాల తగ్గింపు, భవిష్యత్తరాలకు ఆరోగ్యకర పర్యావరణ సృష్టి తదితర ఆదర్శాలపై సంపూర్ణ అంకితభావం ప్రదర్శించాయి. ఈ నేపథ్యంలో భారీస్థాయిన నిర్వహిస్తున్న ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని మన పర్యావరణ లక్ష్యాల సాధన దిశగా ఓ కీలక ముందడుగుగా పరిగణించవచ్చు. మరోవైపు రాబోయే ఐదేళ్లకుగాను ప్రభుత్వరంగ బొగ్గు సంస్థలు  ప్రతిష్టాత్మక లక్ష్యనిర్దేశం చేసుకున్నాయి. ఇందులో భాగంగా మొత్తం 15,350 హెక్టార్లలో పచ్చదనం నింపాలని నిర్ణయించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోగా 2,600 హెక్టార్లలో మొక్కలు నాటాలని నిశ్చయించుకున్నాయి. ఇందుకోసం మియావాకీ పద్ధతి, విత్తన గోళాలు (సీడ్ బాల్స్), డ్రోన్ సాంకేతికత వంటి వినూత్న విధానాలను చేపడుతున్నాయి. అడవుల పునరుద్ధరణ సామర్థ్యం,  ప్రభావం మెరుగుతోపాటు వనరుల సద్వినియోగానికి ఇవన్నీ దోహదం చేస్తాయి.

   పర్యావరణ స్థిరత్వం-జీవావరణ పునరుద్ధరణ దిశగా ప్రభుత్వరంగ బొగ్గు/లిగ్నైట్ సంస్థల పయనంలో మొక్కలు నాటే కార్యక్రమం-2024 (వృక్షారోపణ్ అభియాన్) మరో కీలక మైలురాయిగా నిలుస్తుంది. విస్తృత అటవీకరణ, వినూత్న భూ పునరుద్ధరణ పద్ధతులతో బంజరు భూములను పచ్చదనంతో నింపడంలో ప్రభుత్వరంగ సంస్థల కృషి ప్రశంసనీయం. దేశంలో 2070 నాటికి నికరశూన్య ఉద్గార లక్ష్యం సాధించే దిశగా బొగ్గు మంత్రిత్వ శాఖ తనవంతు తోడ్పాటునిస్తోంది. ఈ మేరకు భారీస్థాయిలో మొక్కలు నాటడం ద్వారా కర్బన సంగ్రహణ ప్రదేశ సృష్టిపై దృష్టి సారించింది. దీనివల్ల సమాజ శ్రేయస్సు మెరుగు దిశగా గాలి, నీటి నాణ్యత కూడా మెరుగవుతుంది.

   పర్యావరణ నిర్వహణ, సుస్థిర ప్రగతిపై ‘వృక్షారోపణ్ అభియాన్-2024’ సమష్టి నిబద్ధతను ప్రదర్శిస్తుంది. మొక్కలు నాటుతూ పర్యావరణ సంరక్షణ బాధ్యత చేపట్టిన బొగ్గు కంపెనీలు ప్రకృతితో సామరస్యం, స్థిరత్వానికి అనువైన వారసత్వాన్ని సృష్టిస్తున్నాయి. తద్వారా జీవావరణ పరిరక్షణతో  ఆర్థిక వృద్ధి సరిజోడుగా సాగే భవిష్యత్తుకు దేశాన్ని చేరువ చేస్తున్నాయి. కర్బన సంగ్రహణ సామర్థ్యం పెంపు, జీవ వైవిధ్యానికి ప్రోత్సాహం ద్వారా నికరశూన్య ఉద్గార లక్ష్యాల సాధనలో ఈ కార్యక్రమం సంపూర్ణంగా మద్దతిస్తుంది.

***


(Release ID: 2037080) Visitor Counter : 82