రైల్వే మంత్రిత్వ శాఖ
దేశీయంగా అభివృద్ధి పరచిన స్వయంచాలక రైలు సంరక్షణ (ఎటిపి) వ్యవస్థ ‘కవచ్’ ను దక్షిణ మధ్య రైల్వేలో 1465 కిలో మీటర్ ల మార్గంలో ఏర్పాటు చేయడమైంది; ఈ వ్యవస్థను 144 రైలుబళ్లలోనూ అమర్చడమైంది
‘కవచ్’ పథకంలో భాగంగా ఇంతవరకు 1216.77 కోట్ల రూపాయలను ఉపయోగించడమైంది; 2024-25 సంవత్సరంలో కేటాయించింది 1112.57 కోట్ల రూపాయలు
Posted On:
24 JUL 2024 7:08PM by PIB Hyderabad
దేశీయంగా అభివృద్ధిపరచిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ఎటిపి) వ్యవస్థ యే ‘కవచ్’; ఇది అత్యున్నత సురక్ష ధ్రువీకరణ తో కూడిన ఒక అత్యంత అధునాతన సాంకేతిక ఆధారిత వ్యవస్థ.
రైలుబండిని నడిపే లోకో పైలట్ బ్రేకులను స్వయంగా వేయలేకపోయిన సందర్భాలలో ‘కవచ్’ తనంతట తాను బ్రేకు వేసి నిర్ధిష్ట వేగ పరిమితుల లోపల రైలు నడిచేటట్లుగా లోకో పైలట్ కు సాయపడుతుంది. అంతేకాకుండా, అననుకూల వాతావరణ స్థితిలో రైలుబండి సురక్షితంగా నడవడంలో కూడా ఈ వ్యవస్థ సహాయకారిగా ఉంటుంది.
స్వతంత్ర సురక్ష మదింపుదారు ‘కవచ్’ కు అత్యున్నత స్థాయి భద్రత -ఎస్ఐఎల్4 (Safety Integrity Level - SIL4) సంబంధ ధ్రువపత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ వ్యవస్థ దీనిలోని ఎస్ఐఎల్ యేతర ప్రత్యేక సదుపాయాల మాధ్యమం ద్వారా బ్లాక్ సెక్షన్ లలోను, రైలు మార్గాల లోను రైళ్ళు ఒకదానితో మరొకటి డీకొట్టే సంభావ్యతను తగ్గించి వేస్తుంది; అంతేకాదు, ఇతర దేశాలు కూడా ‘కవచ్’ ను అమలు చేసేందుకు మొగ్గు చూపేటటువంటి శక్తి సామర్థ్యాలు దీనికి ఉన్నాయి.
‘కవచ్’ అమలులో భాగంగా అనేక కార్యకలాపాలను పూర్తి చేయవలసి ఉంటుంది; అవి ఏ తరహావి అంటే వాటిలో:
ఎ. ప్రతి స్టేషన్ లో స్టేషన్ ‘కవచ్’ ను ఏర్పాటు చేయడం.
బి. రైలు పట్టాల పొడవునా ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ లను ఏర్పాటు చేయడం.
సి. సెక్షన్ అంతటా టెలికం టవర్ లను నెలకొల్పడం.
డి. రైలు పట్టాల వెంబడి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ను ఏర్పాటు చేయడం.
ఇ. భారతీయ రైల్వేలపై నడిచే ప్రతి ఒక్క రైలు బండిలో లోకో కవచ్ ను స్థాపించడం.
కవచ్ వ్యవస్థ ను ఇంతవరకు దక్షిణ మధ్య రైల్వే లోని 1465 రూట్ కిలో మీటర్ లు (ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రేక్స్ కలుపుకొని) తో పాటు 144 రైలుబండ్లలో ఏర్పాటు చేయడమైంది.
ప్రస్తుతం, దిల్లీ - ముంబయి & దిల్లీ - హౌరా కారిడార్ లలో (దాదాపుగా 3000 రూట్ కిలో మీటర్ ల మేర) కవచ్ కు సంబంధించిన ప్రధాన అంశాల పురోగతి ఈ క్రింది విధంగా ఉంది:
(i) 4275 కిలో మీటర్ ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ పనులు పూర్తి అయ్యాయి.
(ii) 364 టెలికం టవర్ లను ఏర్పాటు చేయడమైంది.
(iii) 285 స్టేషన్ లలో ‘కవచ్’ పరికరాలను అమర్చడమైంది.
(iv) 319 రైలుబండ్లలో ‘కవచ్’ సామగ్రి కి స్థానం కల్పించడమైంది.
(v) రైలు పట్టాల వెంబడి ‘కవచ్’ సంబంధ ఉపకరణాల ను 1384 రూట్ కి.మీ. మేర నెలకొల్పడమైంది.
దీనికి తోడు, భారతీయ రైల్వేలలో డీటేల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డిపిఆర్) కు, దానితో పాటు మరో 6000 రూట్ కిమీ మార్గాలలో డీటేల్డ్ ఎస్టిమేట్ లకు ఆమోదం తెలపడమైంది. సామర్థ్యాన్ని పెంచడానికి, కార్యాచరణను విస్తృతపరచడానికి మరిన్ని ఒఇఎమ్ లు చేపడుతున్న ప్రయోగాలు వివిధ దశలలో ఉన్నాయి.
కవచ్ 4.0
‘కవచ్ 4.0’ ప్రత్యేక వివరణలను రిసర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఆర్ డిఎస్ఒ) ఈ నెల 16న ఆమోదించింది. విభిన్నమైన రైల్వే నెట్ వర్క్ లకు అవసరమైన ప్రధాన లక్షణాలు అన్నింటిని ఈ వర్షన్ తనలో ఇముడ్చుకుంటుంది. ఇది భారతీయ రైల్వేల సురక్షలో ఒక ప్రముఖమైన మైలురాయి అని చెప్పాలి. చాలా తక్కువ కాలంలోనే, భారతీయ రైల్వేలు ఒక స్వయంచాలిత రైలుబండి సంరక్షక వ్యవస్థ ను అభివృద్ధి పరచడం, పరీక్షలను పూర్తి చేయడంతో పాటు ఆ వ్యవస్థను లక్షిత కార్యక్షేత్రంలో మోహరించడాన్ని మొదలుపెట్టింది.
‘కవచ్’ పనుల కోసం ఇంతవరకు వినియోగించిన నిధులు 1216.77 కోట్ల రూపాయలు; 2024-25 సంవత్సరానికి కేటాయించిన నిధులు 1112.57 కోట్ల రూపాయలు. ‘కవచ్’ కోసం మంజూరు చేసిన నిధులను కేవలం ‘కవచ్’ కే వినియోగించడం జరుగుతోంది.
ఈ సమాచారాన్ని కేంద్ర రైల్వేలు, సమాచార - ప్రసారం; ఎలక్ట్రానిక్-ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ లోక్ సభలో బుధవారం ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో తెలియజేశారు.
***
(Release ID: 2036889)
Visitor Counter : 52