హోం మంత్రిత్వ శాఖ
నకిలీ సైట్ల ద్వారా సైబర్ నేరాలు
Posted On:
24 JUL 2024 5:04PM by PIB Hyderabad
భారత రాజ్యాంగంలోని ఏడో అధికరణం ప్రకారం “పోలీసు”, “సమాజ శాంతి” రాష్ర్టాల పరిధిలోకి వచ్చే అంశాలు. నకిలీ వెబ్ సైట్ల ద్వారా చేసే మోసాలు సహా అన్ని రకాల సైబర్ నేరాల నిరోధం, గుర్తింపు, దర్యాప్తు, ప్రాసిక్యూషన్ బాధ్యత ప్రాథమికంగా రాష్ర్టాలు/ కేంద్రపాలిత ప్రాంతాలదే. ఆయా రాష్ర్టాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన చట్టాలను అమలుపరిచే సంస్థలు (ఎల్ఇఏ) ఈ చర్యలు తీసుకోవలసి ఉంటుంది.
జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్ సిఆర్ బి) దేశంలో నేరాలకు సంబంధించి గణాంకాలన్నింటినీ సంపుటీకరించి ‘‘క్రైమ్ ఇన్ ఇండియా’’ పత్రికలో ప్రచురిస్తుంది. 2022 సంవత్సరంలో ప్రచురించినదే తాజా సంచిక. ఎన్ సిఆర్ బి ప్రచురించిన గణాంకాల ప్రకారం దేశంలో నమోదైన సైబర్ నేరాల సంఖ్య 2020లో 10395; 2021లో 14007; 2022లో 17470 ఉన్నాయి. నకిలీ వెబ్ సైట్ల ద్వారా జరిగిన మోసాలకు సంబంధించి ఎన్ సిఆర్ బి ప్రత్యేకంగా ఎలాంటి డేటా నిర్వహించడంలేదు.
ఎల్ఇఏ సామర్థ్యాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద రాష్ర్టాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేక సహాయం అందచేస్తుంది.
సమన్వయపూర్వకంగా, సమగ్ర వైఖరితో సైబర్ నేరాలను నిరోధించే యంత్రాంగాన్ని పటిష్ఠం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం సైబర్ నేరాలకు సంబంధించిన చైతన్య కల్పన, అలర్ట్ లు/సలహాల జారీ, చట్టాల అమలు సిబ్బంది/ప్రాసిక్యూటర్లు/జ్యుడిషియల్ అధికారుల సామర్థ్యాల నిర్మాణం/శిక్షణ, సైబర్ ఫోరెన్సిక్ సదుపాయాల మెరుగుదల వంటి చర్యలు చేపట్టింది. దేశంలో అన్ని రకాల సైబర్ నేరాలను సమన్వయపూర్వకంగా, సమగ్ర వైఖరితో ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఒక అనుబంధ విభాగంగా ‘‘ఇండియన్ సైబర్ క్రైమ్ సమన్వయ కేంద్రం’’ (I4C) ఏర్పాటు చేసింది.
అన్ని రకాల సైబర్ నేరాల మీద ప్రత్యేకించి మహిళలు, బాలలపై జరిగే సైబర్ నేరాల సంఘటనల పైన ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా I4Cలో భాగంగా ’’జాతీయ సైబర్ నేరాల ఫిర్యాదు పోర్టల్‘‘(https://cybercrime.gov.in) ను ఏర్పాటు చేశారు. చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఈ పోర్టల్ లో నమోదయ్యే సైబర్ నేరాల పరిశీలన, వాటిని ఎఫ్ఐఆర్ లుగా మార్చడం, తదుపరి కార్యాచరణ చేపట్టడం వంటి చర్యలను సంబంధిత రాష్ర్టాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన చట్టాల అమలు ఏజెన్సీలు చేపడతాయి.
అనుమానాస్పద యుఆర్ఎల్ లు ఉపయోగించి సైబర్ నేరాలు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను త్వరితంగా అధికారులకు నివేదించేందుకు వీలు కల్పిస్తూ 2024 జనవరి 31వ తేదీ నుంచి ఎన్ సిఆర్ పిలో ‘‘రిపోర్ట్ సస్పెక్ట్’’ ఫీచర్ ను జోడించారు. ఇప్పటివరకు దీనిపై 5252 అనుమానాస్పద యుఆర్ఎల్ లపై ఫిర్యాదులు నమోదయ్యాయి. I4C వీటిని విశ్లేషించి కాలానుగుణంగా భాగస్వామ్య వర్గాలన్నింటికీ సలహాలు జారీ చేస్తూ ఉంటుంది. ‘‘సస్పెక్ట్ డేటా’’ విభాగంలోకి వచ్చే ఏ వెబ్ సైట్ అయినా అధీకృతమైనదేనా అని ప్రజలు పరిశీలించుకునేందుకు ఎన్ సిఆర్ పిలో ఈ సదుపాయం జోడించారు.
‘‘డాట్ ఇన్’’ డొమైన్ల దుర్వినియోగాన్ని నిలువరించేందుకు నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియాతో (నిక్సి) I4C సమన్వయపూర్వకంగా కృషి చేస్తుంది. 2023 అక్టోబరు నుంచి 2024 మే మధ్య కాలంలో నిక్సి సహాయంతో 310 ‘‘నకిలీ/ఫిషింగ్’’ డొమైన్లు పని చేయకుండా చేశారు. టెక్నాలజీ ఆధారిత పరిష్కారాల ద్వారా ఇంటర్నెట్ పై ఫిషింగ్ వెబ్ సైట్లను కనుగొనేందుకు I4C పరిశ్రమతో సమన్వయపూర్వకంగా కృషి చేస్తుంది. సంబంధిత భాగస్వాముల సహాయంతో I4C 91 ఫిషింగ్/నకిలీ వెబ్ సైట్లు, 379 చట్టవిరుద్ధమైన రుణ/స్కామ్ సైట్లను నిర్వీర్యం చేసింది.
ఆర్థికపరమైన మోసాలను తక్షణం ఫిర్యాదు చేసి మోసగాళ్లు నిధులు స్వాహా చేయడాన్ని నివారించేందుకు I4C కింద ‘‘సిటిజెన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్ మెంట్ సిస్టమ్’’ను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఈ వ్యవస్థ 7.6 లక్షల ఫిర్యాదులను పరిశీలనకు తీసుకుని రూ.2400 కోట్లకు పైబడి మొత్తాన్ని మోసగాళ్ల చేతుల్లోకి పోకుండా కాపాడింది. ఆన్ లైన్ సైబర్ ఫిర్యాదుల నమోదులో సహాయం అందించేందుకు టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ ‘‘1930’’ని ఏర్పాటు చేశారు.
***
(Release ID: 2036735)
Visitor Counter : 66