సహకార మంత్రిత్వ శాఖ
జాతీయ సహకార విధానం
Posted On:
24 JUL 2024 5:30PM by PIB Hyderabad
నూతన జాతీయ సహకార విధానాన్ని రూపొందించడానికి శ్రీ సురేష్ ప్రభాకర్ ప్రభు అధ్యక్షతన, సహకార రంగ నిపుణులు, జాతీయ, రాష్ట్ర, జిల్లా, ప్రాథమిక స్థాయి సహకార సంఘాల ప్రతినిధులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కార్యదర్శులు (సహకారం) ఆర్‌సీఎస్ లు, కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో 48 మంది సభ్యుల జాతీయ స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి జాతీయ స్థాయి కమిటీ దేశవ్యాప్తంగా 17 సమావేశాలు, 4 ప్రాంతీయ వర్క్‌షాప్ లు నిర్వహించి సలహాలు, సూచనలు స్వీకరించారు. నూతన జాతీయ సహకార విధానంపై జాతీయ స్థాయి కమిటీ రూపొందించిన ముసాయిదా నివేదిక అందింది. ప్రస్తుతం ముసాయిదా విధానాన్ని రూపొందించి ఖరారు చేస్తున్నారు.
ఆయా రాష్ట్రాల సహకార సంఘాల చట్టాల కింద నమోదైన రాష్ట్రస్థాయి సహకార సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. సహకార సమాఖ్య స్ఫూర్తితో- దేశంలో సహకార రంగం అభివృద్ధికి సహకార మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోంది.
సహకార మంత్రిత్వ శాఖ దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఆచరణయోగ్యమైన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డిసిసిబి) ఆచరణయోగ్యమైన జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘంతో ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకుంటోంది. సహకార బ్యాంకుల పూర్తి కవరేజీ కోసం ఉమ్మడి జిల్లాల్లో కొత్త డీసీసీబీలను ప్రారంభించేందుకు ఒక పథకం,కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని నాబార్డును మంత్రిత్వ శాఖ కోరింది.
ప్రభుత్వం 15.02.2023వ తేదీన దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి దాని పరిధిని క్షేత్రస్థాయిలో విస్తరించడానికి రూపొందించిన ప్రణాళికను ఆమోదించింది. ఈ ప్రణాళిక ప్రకారం, వచ్చే ఐదేళ్లలో డెయిరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (డిఐడిఎఫ్), నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డెయిరీ డెవలప్‌మెంట్ (ఎన్పిడిడి), పిఎం మత్స్య సంపద యోజన (పిఎంఎంఎస్వై), ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎఫ్ఐడిఎఫ్) సహకారంతో సహా వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలను సమన్వయం చేయడం ద్వారా వచ్చే ఐదేళ్లలో దేశంలోని అన్ని మారుమూల పంచాయితీలు, గ్రామాలను కలుపుతూ నూతన బహుళార్థ సాధక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు లేదా ప్రాథమిక డెయిరీ/ మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రణాళిక యోచిస్తోంది.
ఈ వివరాలను కేంద్ర సహకార మంత్రి శ్రీ అమిత్ షా, రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానాన్ని ఇవ్వడం జరిగింది.
***
(Release ID: 2036728)