బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు స్థానాన్ని భర్తీ చేసేందుకు పరిశోధన, అభివృద్ధి
Posted On:
24 JUL 2024 4:43PM by PIB Hyderabad
5% నుండి 10% బయోమాస్‌ను థర్మల్ విద్యుత్ కేంద్రాలలో(టీపీపీ) బొగ్గుతో పాటుగా సురక్షితంగా ఉపయోగించొచ్చని అధ్యయనాల తరువాత నిర్ధారణ అయింది.
నూతన, పునరుత్పాదక శక్తికి సంబంధించిన విస్తృత అనువర్తనాలను సమర్థంగా, తక్కువ ఖర్చుతో ఉపయోగించేందుకు దేశీయ సాంకేతికతల అభివృద్ధి, తయారీ కోసం నూతన, పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ వివిధ పరిశోధనా సంస్థలు, పరిశ్రమలతో కలిసి "పునరుత్పాదక శక్తి పరిశోధన,సాంకేతిక అభివృద్ధి కార్యక్రమాన్ని (ఆర్ఈ-ఆర్‌టీడీ)” నిర్వహిస్తోంది. ఇది ప్రభుత్వ లేదా లాభాపేక్షలేని పరిశోధన సంస్థలకు 100% వరకు.. పరిశ్రమలు, అంకురాలు, ప్రైవేటు సంస్థలు, వ్యవస్థాపకులు, తయారీ యూనిట్లకు 70% వరకు ఆర్థిక మద్దతును అందిస్తోంది.
బొగ్గును శక్తి వనరుగా ఉపయోగించడం వల్ల పర్యావరణంలో కలిగే ప్రతికూల ప్రభావాన్ని పరిశీలించేందుకు ఈ క్రింది ప్రయత్నాలు జరుగుతున్నాయి:
బొగ్గు కంపెనీలు తీసుకుంటున్న చర్యలు -
* ఉపరితల గనులు, పేలుడు రహిత ఓవర్ బర్డెన్ తొలగింపు కోసం రిప్పర్లు, భూగర్భ గనుల్లో నిరంతర మైనర్లు, పేలుడు రహిత బొగ్గు తవ్వకాల కోసం హై వాల్ మైనింగ్ వంటి పర్యావరణ అనుకూలమైన ఆధునిక పరికరాలను బొగ్గు కంపెనీలు మోహరిస్తున్నాయి.
* రోడ్డు రవాణాను తగ్గించేందుకు 'ఫస్ట్ మైల్ కనెక్టివిటీ' ప్రాజెక్టుల కింద యాంత్రిక బొగ్గు రవాణా, లోడింగ్ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేసేందుకు బొగ్గు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.
* గని లీజు ప్రాంతంలో ఫిక్స్‌డ్ స్ప్రింక్లర్లు, మొక్కల పెంపకం ద్వారా దుమ్మును మూలం వద్దే నియంత్రిస్తున్నాయి.
* ధూళి, మట్టి ఉత్పత్తిని తగ్గించడం కొరకు నియంత్రిత బ్లాస్టింగ్ సాంకేతితలను ఉపయోగిస్తున్నాయి.
పేలుడు సమయంలో వైబ్రేషన్
* రోడ్లు కాంక్రీట్/ నల్ల తారుతో వేస్తున్నారు. బొగ్గు రవాణా చేసే ట్రక్కులను సమర్థంగా లోడ్ చేయటంతో పాటు టార్పాలిన్ కవర్లతో కప్పుతున్నారు. బొగ్గు రవాణా కోసం ప్రత్యేకించిన కోల్ కారిడార్లను అభివృద్ధి చేశారు.
* నికర సున్నా ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడం, విద్యుదుత్పత్తికి బొగ్గును పూర్తిగా తగ్గించే లక్ష్యంతో సౌర, పవన విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి.
థర్మల్ విద్యుత్ కేంద్రాలు తీసుకుంటున్న చర్యలు -
*బొగ్గుతో పాటు బయోమాస్ మండించటం: బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో బొగ్గుతో పాటుగా బయోమాస్‌ను వినియోగించటంపై విద్యుత్ మంత్రిత్వ శాఖ ఒక విధానాన్ని జారీ చేసింది. సాంకేతికంగా సాధ్యాసాధ్యాలను అంచనా వేసిన తర్వాత బయోమాస్‌ను ప్రధానంగా బొగ్గుతో 5-7% మండించాలని ఈ విధానం నిర్దేశిస్తుంది. ఇది బొగ్గుపై థర్మల్ విద్యుతుత్పత్తి కేంద్రాలు ఆధారపడటాన్ని తగ్గించేందుకు, పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కలిగే వాయు కాలుష్యాన్ని కొంతవరకు తగ్గించడానికి సహాయపడింది. జూన్ 2024 నాటికి, దేశవ్యాప్తంగా కలిపి 8.14 లక్షల టన్నుల బయోమాస్ ఉపయోగించారు. దీని ఫలితంగా బొగ్గు మండించటం ద్వారా వచ్చే సుమారు 0.97 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గాయి.
విద్యుత్ కేంద్రాలు
* స్టాక్ ఉద్గారాల తగ్గింపు- 07.12.2015 నాటి నోటిఫికేషన్ ద్వారా, దాని తదుపరి సవరణల ద్వారా బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి సస్పెన్డెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్(ఎస్‌పీఎం), సల్ఫర్ ఆక్సైడ్(ఎస్ఓఎక్స్), నైట్రోజన్ ఆక్సైడ్(ఎన్ఓఎస్) లాంటి స్టాక్ ఉద్గారాలను తగ్గించడానికి సంబంధించిన నిబంధనలను పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ప్రమాణాలను అందుకోవటానికి ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ (ఈఎస్‌పీ), ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ (ఎఫ్‌జీడీ), ఎన్ఓఎక్స్ కంబషన్ మోడిఫికేషన్ మొదలైన పద్ధతులను థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉపయోగిస్తున్నాయి.
* సమర్థవంతమైన అల్ట్రా సూపర్ క్రిటికల్/సూపర్ క్రిటికల్ యూనిట్ల ఏర్పాటు- సబ్ క్రిటికల్ థర్మల్ యూనిట్ల బదులు సమర్థవంతమైన అల్ట్రా సూపర్ క్రిటికల్/సూపర్ క్రిటికల్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాయి. ఎందుకంటే ఈ యూనిట్లు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి, యూనిట్ విద్యుత్ ఉత్పత్తి వల్ల వచ్చే ఉద్గారాలు సబ్ క్రిటికల్ యూనిట్ల కంటే ఇందులో తక్కువగా ఉంటాయి. 30.06.2024 వరకు 65,290 మెగావాట్ల (94 యూనిట్లు)సూపర్ క్రిటికల్ యూనిట్లు, 4,240 మెగావాట్ల (06 యూనిట్లు) అల్ట్రా సూపర్ క్రిటికల్ యూనిట్లు ప్రారంభమయ్యాయి.
* అసమర్థ, పాత థర్మల్ విద్యుత్ కేంద్రాలలో 18,802.24 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 267 యూనిట్‌లు 30.06.2024 నాటికి మూతపడ్డాయి.
* వింధ్యాచల్‌లో రోజుకు 20 టన్నుల (టీపీడీ) సామర్థ్యం గల ప్రయోగాత్మక కార్బన్ సేకరణ ప్రాజెక్టును ఎన్‌టీపీసీ లిమిటెడ్ ప్రారంభించింది.
కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం(డీఎస్‌టీ) తీసుకుంటున్న చర్యలు-
* ఉద్గారాల తీవ్రతను తగ్గించడానికి, బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సామర్థ్యాన్ని పెంచడానికి, అధునాతన అల్ట్రా సూపర్ క్రిటికల్ (ఏయూఎస్‌సీ) టెక్నాలజీ అభివృద్ధిని చేపట్టింది. ప్రస్తుతం ఈ సాంకేతిక అభివృద్ధి దశలో ఉంది. విద్య, పరిశోధన సంస్థలతో కలిసి కన్సార్టియం విధానంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో శుద్ధ బొగ్గు సాంకేతికతల కోసం అధునాతక పదార్థాల అభివృద్ధి, తయారీకి సంబంధించి రెండు జాతీయ కేంద్రాలను శాస్త్ర, సాంకేతిక విభాగం(డీఎస్‌టీ) ఏర్పాటు చేసింది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉపయోగించే క్రిటికల్ పదార్థాల జీవితకాలాన్ని మెరుగుపరచడం.. అలాగే అధునాతన పూత, తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్రిటికల్ పదార్థాల సమర్థవంతమైన ఫ్యాబ్రికేషన్ పద్ధతుల దిశగా పరిశోధన, అభివృద్ధి ప్రధానంగా దృష్టి సారించనుంది.
లోక్‌సభలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు ఉన్నాయి.
***
(Release ID: 2036711)