బొగ్గు మంత్రిత్వ శాఖ

అవసరానికి సరిపడా, అందుబాటు ధరల్లో బొగ్గును అందించడానికి కట్టుబడి ఉన్న బొగ్గు మంత్రిత్వ శాఖ


గతేడాదితో పోలిస్తే బొగ్గు ఉత్పత్తిలో 10.70 శాతం వృద్ధి

Posted On: 24 JUL 2024 11:24AM by PIB Hyderabad

గౌరవనీయ ప్రధాన మంత్రి నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా ‘‘దేశంతో కలిసి పనిచేస్తూ, అంతరాలను విచ్ఛిన్నం చేయడం’’ కోసం రైల్వే మంత్రిత్వ శాఖ, విద్యుత్ మంత్రిత్వ శాఖ, ఇతర సంబంధిత శాఖల సమన్వయంతో విద్యుత్, ఎరువుల రంగాలకు ప్రకటిత ధరలకు తగినంత బొగ్గు సరఫరా చేయడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది. దేశ ఆర్థిక వృద్ధికి కీలకమైన ఉక్కు, సిమెంట్, కాగితం, స్పాంజ్ ఐరన్‌ సహా అనియంత్రిత రంగాలకు కూడా ఇది వర్తిస్తుంది.

2024-25 ఆర్థిక సంవత్సరానికి 1,080 మిలియన్ టన్నుల ప్రతిష్ఠాత్మక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని మంత్రిత్వ శాఖ నిర్దేశించుకుంది. 19.07.24 నాటికి బొగ్గు ఉత్పత్తి 294.20 మిలియన్ టన్నులకు చేరింది. గతేడాది ఇదే కాలానికి జరిగిన ఉత్పత్తి 265.77 మిలియన్ టన్నులతో పోలిస్తే ఈసారి 10.70 శాతం వృద్ధిని గమనించవచ్చు. సుస్థిర ఆర్థిక అభివృద్ధిపై దృష్టి నిలుపుతూనే వివిధ రంగాల ఇంధన డిమాండ్లను తీర్చడంలో మంత్రిత్వ శాఖ నిబద్ధతను ఈ సానుకూల ధోరణి స్పష్టం చేస్తోంది.

బొగ్గు రవాణా పరంగా చూస్తే, 19.07.24 నాటికి మంత్రిత్వ శాఖ 311.48 మిలియన్ టన్నుల బొగ్గును విజయవంతంగా పంపించింది. గతేడాది నాటి 287.12 మిలియన్ టన్నులతో పోలిస్తే ఇందులో 8.49 శాతం వృద్ధిని కనబరిచింది. కీలక పరిశ్రమల నిర్వహణ అవసరాలకు దోహదపడడమే కాకుండా, ఇంధన మార్కెట్ మొత్తం స్థిరత్వానికి కూడా రవాణాలో ఈ పెరుగుదల దోహదం చేస్తుంది. ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలకు తక్కువ ధరలో, అందుబాటులో ఉన్న వనరుగా బొగ్గును చూడడానికి; తద్వారా వృద్ధి, అభివృద్ధి అంశాల్లో దేశ నిబద్ధతను బలోపేతం చేయడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ అంకితభావంతో ఉంది.

స్థిరమైన, ప్రామాణికమైన సరఫరా ద్వారా దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడం, కీలక ఆర్థిక రంగాలకు తోడ్పాటు అందించడాన్ని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఆధారిత పరిశ్రమలకు అందుబాటు ధరల్లో తగినంత బొగ్గు సరఫరా జరిగేలా చూస్తూ, ఈ వ్యూహాత్మక కార్యక్రమాల ద్వారా భారత ఆర్థిక పురోగతిని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉంది.

 

***

 



(Release ID: 2036612) Visitor Counter : 40