కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2024 మే నెలలో కొత్తగా 19.50 లక్షల నికర సభ్యుల చేరికతో రికార్డు సృష్టించిన ఇ.పి.ఎఫ్.ఓ.


2024 మే నెలలో ఇ.పి.ఎఫ్.ఓ.లో చేరిన 9.85 లక్షల కొత్త సభ్యులు

2024 మే నెలలో కొత్తగా చేరిన సభ్యులలో 18-25 వయస్సు గలవారు 58 శాతం మంది

Posted On: 20 JUL 2024 5:32PM by PIB Hyderabad

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇ.పి.ఎఫ్.ఓ.)లో 19.50 లక్షల సభ్యులు 2024 మే నెలలో కొత్తగా చేరారు. 2018 ఏప్రిల్ మాసంలో జారీ చేయబడిన మొదటి పేరోల్ డేటా నుండి ఇప్పటి వరకు ఒక నెలలో చేరిన వారి సంఖ్య పరంగా ఇదే అత్యధికం.  

పైగా, సంవత్సరంవారీ విశ్లేషణలో 2023 మే నెలతో పోల్చితే ఈసారి చేరిన నికర సభ్యుల సంఖ్యలో 19.62% వృద్ధి నమోదైంది. మెరుగైన ఉపాధి అవకాశాలు, ఉద్యోగికి కలిగే ప్రయోజనాల గురించి అవగాహన పెరగడం, ఇ.పి.ఎఫ్.ఓ. ఔట్‌రీచ్ కార్యక్రమాలు ప్రభావవంతంగా ఉండడం సహా అనేక కారణాలు ఈ సభ్యత్వాల పెరుగుదలకు దోహదం చేశాయని చెప్పవచ్చు.

2024 మే నెలలో దాదాపు 9.85 లక్షల మంది కొత్త సభ్యులు చేరినట్లు డేటా సూచిస్తుంది. అంతకుముందు నెల 2024 ఏప్రిల్‌తో పోలిస్తే కొత్త సభ్యులలో 10.96% వృద్ధి అలాగే గత సంవత్సరం 2023 మే నెలతో పోలిస్తే 11.5% వృద్ధి నమోదైంది.

డేటాలో గమనించదగిన అంశం ఏమిటంటే, 2024 మే నెలలో జోడించబడిన మొత్తం కొత్త సభ్యులలో గణనీయంగా 58.37% మంది 18-25 ఏళ్ల వయస్సు గల వారే ఉండడం విశేషం. సంఘటిత రంగంలో కొత్తగా ఉద్యోగాలలో చేరే వారిలో చాలామంది యువత, మొదటిసారి ఉద్యోగం పొందినవారే కావడం మునుపటి ధోరణికి అనుగుణంగా ఉంది.

పైగా, మొదటి పేరోల్ ప్రచురించబడినప్పటి నుండి ఇప్పటివరకు 18-25 వయస్సు గల వారి కోసం 2024 మే నెలలోనే నికర పేరోల్ డేటా అత్యధికంగా ఉంది.

సుమారు 14.09 లక్షల మంది సభ్యులు నిష్క్రమించి, తిరిగి ఇ.పి.ఎఫ్.ఓ.లో చేరిన విషయాన్ని పేరోల్ డేటా ప్రధానంగా సూచిస్తుంది. ఈ సంఖ్య మే 2023తో పోల్చితే సంవత్సరానికి 23.47% వృద్ధిని చూపుతుంది. ఈ సభ్యులు తమ ఉద్యోగాలను మార్చుకుని, తిరిగి ఇ.పి.ఎఫ్.ఓ. పరిధిలోకి వచ్చే సంస్థల్లో చేరారు అలాగే వారు ఫైనల్ సెటిల్‌మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి బదులుగా వారి జమ చేయబడిన మొత్తాన్ని బదిలీ చేయడాన్ని ఎంచుకున్నారు తద్వారా వారి దీర్ఘకాలిక ఆర్థిక శ్రేయస్సు, వారి సామాజిక భద్రతకు భరోసాను పొందారు.  

ఈ నెలలో జోడించబడిన కొత్త సభ్యులలో దాదాపు 2.48 లక్షల మంది కొత్త మహిళా సభ్యులేనని పేరోల్ డేటా జెండర్ వారీ విశ్లేషణ వెల్లడించింది. ఈ సంఖ్య 2023 మే నెలతో పోలిస్తే సంవత్సరానికి 12.15% వృద్ధిని నమోదు చేసింది. అలాగే, ఈ నెలలో నికర మహిళా సభ్యుల చేరిక దాదాపు 3.69 లక్షలకు చేరుకుంది, ఇది 2023 మే నెలతో పోలిస్తే సంవత్సరానికి 17.24% వృద్ధిని సూచిస్తుంది. మహిళా సభ్యుల చేరికల్లో పెరుగుదల మరింత సమగ్రమైన, విభిన్నమైన కార్మికశక్తి పరంగా విస్తృత మార్పును సూచిస్తుంది.

రాష్ట్రాల వారీ పేరోల్ డేటా విశ్లేషణను గమనిస్తే ఐదు రాష్ట్రాలు/యూటీలలో అనగా మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, గుజరాత్ అలాగే హర్యానాలలో నికర సభ్యుల చేరిక అత్యధికంగా ఉంది. ఈ రాష్ట్రాలు దాదాపు 58.24% నికర సభ్యుల చేరికను కలిగి ఉన్నాయి అలాగే ఈ నెలలో మొత్తం 11.36 లక్షల మంది నికర సభ్యులు ఈ రాష్ట్రాల నుండి కొత్తగా చేరారు. ఈ నెలలో 18.87% నికర సభ్యులను జోడించడం ద్వారా మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉంది.

పరిశ్రమవారీగా నెలవారీ డేటాను పోల్చిచూసినప్పుడు అది నిపుణుల సేవలు, భవన, నిర్మాణ రంగం, గార్మెంట్స్ తయారీ, వస్త్ర పరిశ్రమ, ఎలక్ట్రికల్, మెకానికల్, జనరల్ ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఇంజనీర్స్ – ఇంజనీరింగ్ కాంట్రాక్టర్స్, వర్తక – వాణిజ్య సంస్థలు, బీడీల తయారీ, ఎలక్ట్రానిక్ మీడియా వంటి ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేసే సభ్యుల చేరికలో గణనీయమైన వృద్ధి కనిపించినది. మొత్తం నిరక సభ్యత్వాలలో సుమారు 42.33% చేరికలతో నిపుణుల సేవల రంగం (మ్యాన్‌పవర్ సప్లయర్స్, సాధారణ కాంట్రాక్టర్స్, సెక్యూరిటీ సర్వీసెస్, ఇతరత్రా కార్యకలాపాలు కలిగి ఉండునది) అగ్రస్థానంలో ఉంది.  

ఉద్యోగి వివరాలను నవీకరించడం నిరంతరం సాగే ప్రక్రియ కాబట్టి డేటా రూపొందించుట కూడా నిరంతంరం జరుగుతూ ఉండడం వల్ల పై పేరోల్ డేటా తాత్కాలికమైనదిగా పరిగణించబడుతుంది. మునుపటి డేటా ప్రతి నెలా నవీకరించబడుతుంది. ఇ.పి.ఎఫ్.ఓ. 2017 సెప్టెంబర్ కాలాన్ని కవర్ చేస్తూ మొదటిసారిగా 2018 ఏప్రిల్ నెల నుండి పేరోల్ డేటాను విడుదల చేయడం ప్రారంభించింది. నెలవారీ పేరోల్ డేటాలో, నికర నెలవారీ పేరోల్ పొందడానికి, ఆధార్ ధ్రువీకరణ గల యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యు.ఎ.ఎన్.) ద్వారా మొదటిసారిగా ఇ.పి.ఎఫ్.ఓ.లో చేరుతున్న సభ్యుల సంఖ్య, ప్రస్తుత సభ్యులలో ఇ.పి.ఎఫ్.ఓ. కవరేజీ నుండి నిష్క్రమించి, తిరిగి చేరిన సభ్యుల సంఖ్యను పరిగణిస్తారు. 

***

 


(Release ID: 2034819) Visitor Counter : 80