వ్యవసాయ మంత్రిత్వ శాఖ
నేడు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ 96 వ వ్యవస్థాపక, సాంకేతిక దినోత్సవాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
వ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థకు ఆత్మ, రైతులే వెన్నెముక: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను రూపొందించాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పాన్ని నెరవేర్చడంలో వ్యవసాయం, సంబంధిత రంగాలు కీలక పాత్ర పోషిస్తాయి: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ .
భారత్ పాల ఎగుమతిలో ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని చేరుకోవడమే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్ష్యం, అందుకోసం కృషి చేయండి: శ్రీ రాజీవ్ రంజన్ సింగ్
Posted On:
16 JUL 2024 5:55PM by PIB Hyderabad
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ 96వ వ్యవస్థాపక దినోత్సవం, టెక్నాలజీ డే 2024 ను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ నేడు దిల్లీలో ప్రారంభించారు. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రులు శ్రీ భగీరథ్ చౌదరి, శ్రీ రామ్‌నాథ్ ఠాకూర్, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ జార్జ్ కురియన్, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, పంచాయితీరాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి.సింగ్ బఘేల్, వ్యవసాయ పరిశోధన, విద్యా శాఖ కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ (ఐసీఏఆర్) శ్రీ హిమాన్షు పాఠక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ 96వ వ్యవస్థాపక, సాంకేతిక దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, ఉద్యోగులతో కలిసి మొక్కను నాటారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ 96వ వ్యవస్థాపక, సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు 25 పంట రకాలను విడుదల చేసి, కొన్నింటిని రైతులకు అంకితం చేశారు. పశువులు, చేపల పెంపకానికి టీకా కిట్లను విడుదల చేశారు. పంట వ్యర్థాలతో తయారు చేసిన వివిధ ఉత్పత్తులను కూడా విడుదల చేశారు.
ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను కేంద్ర మంత్రులు సన్మానించడంతో పాటు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ కు చెందిన పలు ప్రచురణలను కూడా విడుదల చేశారు.
కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, దేశంలో చిన్న, సన్నకారు రైతుల కోసం మోడల్ ఫామ్(సాగు నమూనా) లను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయమే భారత ఆర్థిక వ్యవస్థకు ఆత్మ అని, రైతులే వెన్నెముక అని శ్రీ చౌహాన్ అన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నది ప్రధాని మోదీ లక్ష్యమని తెలిపారు. రైతాంగానికి, అన్నదాతలకు ప్రధానమంత్రి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. వైవిధ్యభరితంగా వ్యవసాయాన్ని సాగు చేయడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం సాధ్యమవుతుందని, ఆ సంకల్పంతోనే తాము పనిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. శాస్త్రవేత్తలు నాలుగేళ్లకు లక్ష్యాలను నిర్దేశించుకుని, నాలుగేళ్ల అనంతరం లక్ష్యాలు సాధించామని చెప్పాలని శాస్త్రవేత్తలకు శ్రీ చౌహాన్ ఉద్బోదించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తయారు చేయాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పంలో, వ్యవసాయం, అనుబంధ రంగాలు ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. పశుపోషణ, చేపల పెంపకం, గోధుమల ఉత్పత్తి, పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేయాల్సిందిగా శాస్త్రవేత్తలకు కేంద్రమంత్రి పిలుపునిచ్చారు.
ఐసిఎఆర్ ఇప్పటివరకు 6 వేల పంటల రకాలను అందించిందని, అందులో ఎన్ని రకాలు పరిశోధనా కేంద్రం నుంచి వ్యవసాయ క్షేత్రానికి చేరాయని ప్రశ్నించారు. విజ్ఞానాన్ని ఆచరణాత్మకంగా ఉపయోగించుకోవాలంటే రైతుకు, శాస్త్రవేత్తకు దగ్గరి సంబంధం ఉండాలని మంత్రి అన్నారు. ఇలా చేస్తే తప్ప రైతుకు ప్రయోజనం చేకూరదన్నారు. రైతుకు, కృషి విజ్ఞాన కేంద్రానికి ఎంతవరకు సంబంధం ఉందో విశ్లేషించుకోవాలి. దేశంలో ఉన్న 731 కృషి విజ్ఞాన కేంద్రాలలో, ఒక్కో కేంద్రానికి ఇద్దరు చొప్పున శాస్త్రవేత్తలను పంపి, వారు అక్కడ అధ్యయనం, పరిశోధనలు చేయాలని, అప్పుడే రైతులకు మేలు జరుగుతుందని, వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. పప్పుధాన్యాలు, నూనెగింజల్లో కూడా భారత్ స్వయం సమృద్ధి సాధిస్తుందని నేడు దీని కోసం ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. దీనికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. పప్పుధాన్యాల కోసం సమృద్ధి పోర్టల్ ను రూపొందించారు. రైతుల కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. శాస్త్రవేత్తలందరూ ఏడాదిలో నెల రోజుల పాటు పొలాలకు వెళ్లి రైతులకు అవగాహన కల్పించాలి. అన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు రైతాంగ అభివృద్ధి కోసం పాటుపడాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ క్షేత్రాలను అనుసంధానం చేయాలి. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంతో పాటు, పరిశోధనల ఫలితంగా మానవుల శరీరంపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందనే దానిపై దృష్టి పెట్టడం కూడా ప్రధానమని మంత్రి అన్నారు. ప్రకృతి వ్యవసాయంపై కూడా పరిశోధనలు చేయాలని మంత్రి అన్నారు. శ్రీఅన్న ఉత్పత్తిని ఎలా పెంచాలనే దానిపై కూడా ప్రధాన మంత్రి ఆందోళన వ్యక్తం చేసినట్లు మంత్రి తెలిపారు. శ్రీ అన్న ఉత్పత్తిని పెంచడం కోసం పని చేయాల్సిందిగా శాస్త్రవేత్తలకు సూచించారు. స్వదేశీ జాతుల గుర్రాలు, కుక్కలను అభివృద్ధి చేయడంపై కూడా దృష్టి పెట్టాలన్నారు. దీన్ని సాంకేతికతతో ఎలా అనుసంధానం చేయవచ్చు అనే దానిపై కూడా కసరత్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వాతావరణ మార్పుల దృష్ట్యా కూడా పనిచేయాల్సిన అవసరాన్ని మంత్రి ప్రస్తావించారు
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్ కార్యక్రమంలో ప్రసంగించారు. ఐసిఎఆర్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు వీలైనంత త్వరగా వాటిని అమలు చేస్తాయని, తద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. స్థూల దేశీయోత్పత్తిలో పశుసంపద, చేపల పెంపకం 35 శాతం వాటాను అందిస్తున్నాయని, దీనిపై మరింత దృష్టి సారించకపోతే ఆ విలువ పడిపోతుందన్నారు. మనం ఈ రంగంపై దృష్టి పెడితే, 50 శాతానికి పైగా సాధించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. చేపల పెంపకంలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరుకున్న అంశాన్ని ప్రస్తావించారు. నేడు రూ.63 వేల కోట్ల విలువైన వస్తు ఎగుమతి చేస్తున్నాం. పశుసంపద, చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. పశువుల్లో సంభవించే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ (ఎఫ్ఎండీ) నిర్మూలనలో పశుసంవర్ధక శాఖ నిమగ్నమైంది. ఈ వ్యాధి నుంచి విముక్తం చేయడంలో పరిశోధించాల్సిందిగా శాస్త్రవేత్తలను కోరారు. అనేక రాష్ట్రాలలో వ్యాధి తీవ్రతను, వ్యాప్తిని తగ్గించడానికి, భారతదేశంలో పశువులను ఎఫ్‌ఎండీ నుండి ఎలా విముక్తం చేయాలనే దానిపై పరిశోధిస్తున్నారు. వీర్య వర్గీకరణ, ఐవీఎఫ్ టెక్నాలజీపై కూడా పరిశోధన చేపట్టాలని, ఐవీఎఫ్‌ను చౌక ధరకు తీసుకురావడానికి ఐసీఏఆర్ కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. దీనివల్ల రోడ్లపై వీధి జంతువుల నుండి విముక్తి చేయడంతో పాటు, పాల ఉత్పత్తి కూడా పెరుగుతుందని తెలిపారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా పాడి పరిశ్రమలో కూడా చాలా పనులు జరిగాయి. పాడి పరిశ్రమ పూర్తిగా అసంఘటిత రంగమని, దీన్ని సంఘటిత రంగంలోకి తీసుకువస్తేనే పాడి పరిశ్రమను అభివృద్ధి చేయగలమని అన్నారు. పాల ఎగుమతుల్లో ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరుకోవాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని, అందుకు కృషి చేయాలన్నారు. చేపల పెంపకం, వివిధ జాతుల చేపల ఎగుమతులను ఎలా పెంచాలో శాస్త్రవేత్తలు పనిచేయాలన్నారు. జలాంతర్గత చేపల వేట చేస్తే తప్ప ఎగుమతులను పెంచలేమన్నారు. వార్షిక ఎగుమతి లక్ష్యం రూ.63 వేల కోట్లకు పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
వ్యవసాయ రంగ అభివృద్ధి, పంటల ఉత్పత్తి కోసం శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేశారు. కానీ ఉత్పత్తి చేసిన ధాన్యాలకు నిల్వ సామర్థ్యాలు సరిగా లేవని, నిల్వ సామర్థ్యాలపై దృష్టిసారించాలని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్‌నాథ్ ఠాకూర్ అన్నారు. పంటల్లో విషపూరిత ఎరువుల వాడకాన్ని మానేసి, మనుషులకు ఆరోగ్యకరమైన ఆహారం అందిచాలని మంత్రి అన్నారు. ఇందుకోసం శాస్త్రవేత్తలు విషరహిత ఎరువులపై పరిశోధనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎరువుల వాడకాన్ని దాదాపు వాడకుండా ఉండే దిశగా పరిశోధనలు ఉండాలని అన్నారు.
ఐసీఏఆర్ ప్రయోగశాల్లోనే కాకుండా పంటపొలాల్లో కూడా అనేక విధులను నిర్వర్తిస్తోందని, నేడు మనం దానిని మనం చూడగలుగుతున్నామని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, పంచాయితీరాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి.సింగ్ బఘేల్ అన్నారు. ఐసీఏఆర్ కృషి ఫలితం మనకు ప్రతి ప్రతి రంగంలోనూ కనిపిస్తోందని మంత్రి అన్నారు. నానో యూరియా తయారీ ద్వారా రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు దోహదపడుతుందన్నారు. రైతులకు ప్రయోజనం చేకూర్చే అనేక వ్యవసాయ విధానాలను ఐసీఏఆర్ తీసుకువచ్చింది. వీర్యం వర్గీకరణపై పరిశోధనల ద్వారా జన్మించే దూడలలో 90 శాతం ఆడ దూడలు ఉంటాయని బఘేల్ చెప్పారు.
140 కోట్ల మందికి అన్నం పెట్టే దేశంలోని రైతులను మనం పట్టించుకోకపోతే భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందని, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ భగీరథ్ చౌదరి అన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ వ్యవసాయ రంగంలో ఎంతో పురోగతి సాధించింది. ఈ రంగంలో అభివృద్ధి సాధించడం ముఖ్యమే అయినప్పటికీ, దీని పర్యవసనాల ద్వారా మానవులకు ఎటువంటి సమస్య రాకూడదనేది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. నేడు డిజిటల్ విప్లవానికి పెద్దపీట వేయాల్సిన ఆవశ్యకత ఉంది. దేశంలో నూనెగింజలు, ఉత్పత్తి పెరిగినప్పటికీ దాన్ని మరింత పెంచాల్సిన అవసరాన్ని మంత్రి ఉద్ఘాటించారు. ప్రస్తుతం నీటి కొరత ఉందని, ఉత్పాదకతపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. వీటన్నింటి పట్ల రైతుల్లో అవగాహన కల్పించేందుకు కృషి విజ్ఞాన కేంద్రం చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
భారత్ చేపల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందని కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ అన్నారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా భారత్ ప్రపంచ వ్యవసాయ ఎగుమతిదారుగా మారేందుకు ఐసిఎఆర్ సహాయపడిందని డాక్టర్ హిమాన్షు పాఠక్ అన్నారు.
***
(Release ID: 2033928)
Visitor Counter : 74