సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

"ఉధంపూర్ జిల్లా యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్"


"ప్రజలకు సత్వరం, సాధ్యమైనంత ఉత్తమ సదుపాయాలు కల్పించాలి": అధికారులను ఆదేశించిన డాక్టర్ సింగ్

జన్-భాగిదారి, సంకల్ప్ సే సిద్ధి స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తుందన్న డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 14 JUL 2024 7:28PM by PIB Hyderabad

ఉధంపూర్ పరిపాలన, స్థానిక సంస్థల సిబ్బంది ప్రజలకు సకాలంలో, సజావుగా సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించవద్దని” కేంద్ర సైన్స్ & టెక్నాలజీ; సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) పీ.ఎం.ఓ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆదేశించారు.

 

డిప్యూటీ కమీషనర్ సలోని రాయ్, జిల్లా పరిపాలన విభాగం సీనియర్ అధికారులు, డజన్‌కు పైగా పంచాయితీరాజ్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, నీటి కొరత, విద్యుత్ కోతలు, శిథిలమైన రహదారులు, అనధికారిక పార్కింగ్ వంటి పలు ప్రధాన సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవాలని సూచించిన ఆయన, ప్రభుత్వం ప్రజాసేవకు కట్టుబడి ఉందని, సమాజంలోని అన్ని వర్గాల ప్రజల జీవన సౌలభ్యం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పునరుద్ఘాటించారు.

‘దేశమే ముందు’ నినాదంతోమోదీ ప్రభుత్వ పాలనా విధానం జన్-భాగిదారీ, సంకల్ప్ సే సిద్ధ్ స్ఫూర్తితో ముందుకు సాగుతుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ప్రజల ఫిర్యాదులు, డిమాండ్లను పరిష్కరించడంలో తమ వంతు పాత్ర పోషించాలని కేంద్ర మంత్రి డి.డి.సి.లను కోరారు. నేటి సమావేశంలో చర్చించిన సమస్యల పరిష్కారం కోసం కౌన్సిలర్లు తక్షణ చర్యలు తీసుకోవాలి” అని ఆదేశించారు.

 తరచూ సంభవిస్తున్న విద్యుత్ కోతలపై జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు మంత్రికి నివేదించగా, విద్యుత్ శాఖ అధికారులు తప్పనిసరిగా ఆయా ప్రాంతాలలో పర్యటించి క్షేత్రస్థాయి సమస్యలను అంచనా వేసి సమస్యను పరిష్కరించాలని డాక్టర్ జితేంద్రసింగ్ ఆదేశించారు. "అధిక వేడి గల వాతావరణ పరిస్థితులలో ప్రజలకు విద్యుత్ కోతల వల్ల ఇబ్బంది కలగకుండా చర్యలను చేపట్టాలి” అని మంత్రి ఆదేశించారు.

అదేవిధంగా, గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు, ప్రమాదాల నివారణకు గాను శిథిలమైన రహదారుల మరమ్మతులు చేయడంతో పాటు అవసరమైన చోట కొత్త రహదారులు నిర్మించాలని మంత్రి పేర్కొన్నారు. పౌరులకు మెరుగైన సేవలందించడం కోసం స్థానిక పంచాయితీలతో పాటు సంబంధీకులందరితో కలిసి పని చేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రభావిత ప్రాంతాలను క్రమం తప్పకుండా సందర్శించాలని, మారుమూల గ్రామాల్లో పారిశుద్ధ్యం, గృహనిర్మాణం మరియు విద్యా సంబంధ పథకాల ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కలిగించేందుకు అవగాన కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

సమీక్షా సమావేశంలో, జిల్లాలో పెద్ద ఎత్తున లావెండర్ సాగును ప్రోత్సహించాలని డాక్టర్ జితేంద్రసింగ్ సూచించారు. ఈ నూతన రంగంలో పనిచేస్తున్న స్టార్టప్‌లు స్థానిక యువతకు ఉపాధి మార్గాలుగా మారాయన్నారు. అందరికీ ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వం వల్ల సాధ్యం కాదని ఆయన పునరుద్ఘాటించారు. అందువల్ల యువత జీవనోపాధి పొందేందుకు ఇతర లాభదాయకమైన ఉపాధి మార్గాలను అన్వేషించాలని మంత్రి సూచించారు.

***



(Release ID: 2033541) Visitor Counter : 12