Posted On:
13 JUL 2024 9:55AM by PIB Hyderabad
కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గ మంత్రిత్వశాఖ 2024 జూలై 16 వ తేదీ ఉదయం 10గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రాష్ట్ర సముద్రయాన, జలమార్గ రవాణా కమిటీ (ఎస్.ఎం.డబ్ల్యుటిసి) సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి కేంద్ర పోర్టులు, షిప్పింగ్ జలమార్గ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ టి.కె. రామచంద్రన్ అధ్యక్షత వహిస్తారు.
దేశవ్యాప్తంగా సముద్రయాన, జలమార్గ రవాణా రంగ సమగ్ర అభివృద్ధికి కృషి చేయడం ఈ కమిటీ లక్ష్యం. అలాగే మిగిలిన రాష్ట్రాలను కూడా తన కార్యకలాపాలను విస్తరించడం దీని లక్ష్యం. ఈ సమావేశం ప్రధానంగా ఆయా రాష్ట్రాలకు ప్రత్యేకమైన సముద్రయాన, జలమార్గాల రవాణా మాస్టర్ ప్లాన్ను సిద్ధంచేయడం,సముద్రయాన రంగంపై విధానాల రూపకల్పన, హరిత కార్యక్రమాలు, జలమార్గాల అభివృద్ధి, క్రూయిజ్ టూరిజం, నగర జలమార్గ రవాణా, లైట్ హౌస్ ల అభివృద్ధి వంటి వాటిపై దృష్టిపెడుతుంది.
జలమార్గ రవాణా రంగ నిర్వహణ, సమీకృత కార్యకలాపాల నిర్వహణకు ఏకీకృత విధానం అవసరాన్ని గుర్తిస్తూ ఈ మంత్రిత్వశాఖ ఎస్.ఎం.డబ్ల్యు.టి.సి లను ఏర్పాటు చేసింది. ఆయా రాష్ట్రాలలో చేపట్టే వివిధ కార్యకలాపాలు, పథకాల అమలును సమన్వయం చేయడానికి దీనిని ఏర్పాటు చేశారు.
సముద్రయాన, జలమార్గ రంగంలో తగిన నాయకత్వం అందించడానికి, ఈ రంగంలో జరుగుతున్న కృషిని మరింత పటిష్టం చేయడానికి ఈ కమిటీలు కీలకంగా ఉండనున్నాయి. ప్రతి ఎస్.ఎం.డబ్ల్యు.టి.సి కి ఛీఫ్ సెక్రటరీ, లేదా అడిషన్ ఛీఫ్ సెక్రటరీ నాయకత్వం వహిస్తారు. వివిధ పోర్టులు, సముద్రయాన బోర్డులు, రాష్ట్ర పిడబ్ల్యుడి, అంతర్గత జలమార్గాలు, పర్యాటక అభివృద్ధి, ఫిషరీస్ విభాగం, రైల్వేలు, జాతీయ రహదారుల, కస్టమ్స్ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
ప్రస్తుతం ఎస్.ఎం.డబ్ల్యుటిసిలు 13 రాష్ట్రాలలో ఏర్పాటయ్యాయి. అవి ఆంద్రప్రదేశ్, మిజోరం, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, పుదుచ్చేరి, రాజస్థాన్, బీహార్, అస్సాం, గోవా, కేరళ, ఉత్తరప్రదేశ్ , మహారాష్ట్ర, లక్షద్వీప్. ఈ కమిటీలను దేశంలోని 30 కోస్తా , జలమార్గ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నింటిలో ఏర్పాటు చేయనున్నారు.
ఈ సమావేశ అజెండాలో ఇప్పటికే ఏర్పడిన ఎస్.ఎం.డబ్ల్యు.టి.సిలు సాధించిన ప్రగతిని సమీక్షించడంతోపాటు, వివిధ రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చిస్తారు. అలాగే సాగరమాల కార్యక్రమం అమలు, జాతీయ సముద్రయాన వారసత్వ భవన సముదాయం( ఎన్.ఎం.హెచ్.సి)ని లోథల్లో అభివృద్ధి చేయడం, ఆర్.ఒ–ఆర్.ఒ, ఆర్.ఒ– పాక్స్, ఫెర్రీ, నగర జలమార్గ రవాణా, సాగరమాల షిప్ బిల్డింగ్ క్లస్లర్లు, దేశీయ జల మార్గాలకు హరిత నౌక, కార్గో ప్రోత్సాహక పథకం, కోస్తా ప్రాంతంలో, నదులలో క్రూయిజ్ టూరిజంకు సంబంధించి అవగాహనా ఒప్పందాలు, రాష్ట్రాలలో దేశీయ జలమార్గ రవాణాను ప్రోత్సహించడం వంటి వాటిని కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు.
ఎస్.ఎం. డబ్ల్యుటిసిల ఛైర్పర్సన్లుగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు , అదనపు ప్రధాన కార్యదర్శులు తమ తమ రాష్ట్రాలలో పురోగతిని వివరిస్తారు. ఈ సందర్భంగా వారు ఎస్.ఎం.డబ్ల్యు.టి.సి తీసుకున్న చర్యలు, ఆయా రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేకమైన అంశాలు, కేంద్ర మంత్రిత్వశాఖనుంచి అవసరమైన మద్దతు వంటి అంశాలను ప్రస్తావించనున్నారు. సముద్రయాన , జలమార్గ రవాణా రంగంలో పురోగతి, ఈ రంగం లోని సమస్యలను పరిష్కరించడం, సముద్ర మార్గ రవాణా,జల మార్గ రవాణాను దేశంలో మరింతగా ప్రోత్సహించేందుకు సమిష్టి పరిష్కారాలు కనుగొనడం వంటి వాటిపై ఈ సమావేశం దృష్ఙిపెడుతుంది.
***