వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
రైట్ టు రిపేర్ పోర్టల్ ఇండియాపై ఆటోమొబైల్ అసోసియేషన్, భాగస్వామ్య కంపెనీలతో సమావేశమైన వినియోగదారుల వ్యవహారాల శాఖ
రిపేర్ మాన్యువల్స్/వీడియోలను ప్రజాస్వామీకరించేందుకు, థర్డ్ పార్టీ రిపేర్ సర్వీసుల వ్యవస్థ బలోపేతం చేయడానికి, ప్రమాణాలు నిర్దేశించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాల్సి ఉంది : కార్యదర్శి, వినియోగదారుల వ్యవహారాల శాఖ
Posted On:
06 JUL 2024 1:17PM by PIB Hyderabad
వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన వినియోగదారుల వ్యవహారాల శాఖ (డిఓసిఏ) రైట్ టు రిపేర్ పోర్టల్ ను (https://righttorepairindia.gov.in/)ప్రారంభించింది. వినియోగదారులకు తమ వద్ద ఉన్న ఉత్పత్తులు మరమ్మత్తు చేయించుకుని, తిరిగి వినియోగించుకునేందుకు, తద్వారా సర్కులర్ ఎకానమీకి తమ వంతు సేవలందించేందుకు, ఎలక్ర్టానిక్ వ్యర్థాలను తగ్గించేందుకు ఇది వీలు కల్పిస్తుంది.
తమ ఉత్పత్తులకు ఎలాంటి అవరోధాలు లేకుండా రిపేరింగ్ చేయించుకోవాలన్న వినియోగదారుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని వారి హక్కులు పరిరక్షించడం లక్ష్యంగా వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి (డిఒసిఏ) కార్యదర్శి శ్రీమతి నిధి ఖారే అధ్యక్షతన ఆటోమొబైల్ అసోసియేషన్లు, వారి భాగస్వాములతో సమావేశం నిర్వహించారు. రైట్ టు రిపేర్ ఇండియా పోర్టల్ లో వివిధ కంపెనీలు నమోదయ్యేలా చూడాలన్నది ఈ సమావేశం లక్ష్యం.
పరిమిత జీవన కాలం మాత్రమే పని చేసేలా తయారుచేసిన ఉత్పత్తులు ఎలక్ర్టానిక్ వ్యర్ధాలకు కారణమవుతున్నాయి. రిపేర్ అవకాశం లేకపోయినా లేక తిరిగి వినియోగంలోకి తెచ్చేలా వాటిని రిపేర్ చేయాలన్నా చాలా ఖర్చవుతుందని భావించినా వాటి స్థానంలో వినియోగదారులు కొత్త ఉత్పత్తుల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తారు. అలాంటి పరిమిత కాల వినియోగం వంటి అవరోధాలను తొలగించి వినియోగదారునికి వాటిపై సంపూర్ణ యాజమాన్య హక్కు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
సర్వీసింగ్ లో విపరీతమైన జాప్యాలు, వాహనాల రిపేర్ కు సంబంంబంధించిన పత్రాలు లేకపోవడం వంటి అంశాల కారణంగా రిపేర్ సర్వీసుల్లో అవరోధాలు ఏర్పడుతున్నట్టు కొంత కాలంగా గమనించడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఉత్పత్తుల రిపేరింగ్ వ్యయాలు చాలా అధికంగా ఉంటున్నాయి. ఇవన్నీ వినియోగదారుల అసంతృప్తికి కారణమవుతున్నాయి. పైగా అందుబాటు ధరల్లో నాణ్యమైన విడిభాగాలు లభించకపోవడం కూడా ఒక పెద్ద అవరోధంగా ఉంది. ఈ కారణంగా వినియోగదారులు నకిలీ విడిభాగాలు కొనుగోలు చేయవలసివస్తోంది. చిన్న చిన్న రిపేర్లు ఎలా చేసుకోవచ్చునో తెలియచేసే లేదా మీకు మీరే చేసుకోవచ్చు అని తెలియచేసే మార్గదర్శక పత్రాలు లేకపోవడం వల్ల కూడా వినియోగదారులపై ఆర్థిక భారం పడి వారిలో అసంతృప్తి పెరిగిపోతోంది.
రిపేర్ మాన్యువల్స్/ వీడియోలను అందరికీ అందుబాటులో ఉంచాలని, థర్డ్ పార్టీ రిపేర్ సర్వీసులకు ప్రమాణాలు రూపొందించడం ద్వారా అలాంటి సర్వీసులు అందుబాటులో ఉండే వాతావరణం కల్పించడం కూడా అవసరమని కార్యదర్శి శ్రీమతి ఖారే నొక్కి చెప్పారు. వినియోగదారులకు రోడ్ల పైన ప్రత్యేకించి హైవేల పైన రోడ్ సైడ్ అసిస్టెన్స్ అందించాలని కూడా ఆమె స్పష్టం చేశారు. అలాగే సంబంధిత వాహనం మరమ్మత్తు సూచీ ప్రత్యేకించి ఆ వాహన జీవన కాలపరిమితి, తేలిగ్గా మరమ్మత్తులు చేయించుకోగల వెసులుబాటు, విడిభాగాల లభ్యత, స్వయంగా రిపేర్ చేసుకునేందుకు అవసరమైన మాన్యువల్, విభిన్న విడిభాగాలపై వారెంటీ వంటి వివరాలన్నీ వారికి అందించాలని కూడా నొక్కి చెప్పారు. దీని వల్ల విక్రయానంతర సేవలపై స్పష్టమైన అవగాహనతో వినియోగదారులు నిర్ణయాలు తీసుకోవడంతో పాటు వారు ఉత్పత్తులను సంపూర్ణ సంతృప్తి మేరకు వినియోగించుకోగలుగుతారన్నారు. రైట్ టు రిపేర్ పోర్టల్ లో అన్ని కంపెనీలు చేరాలని, వినియోగదారులకు విస్తారమైన విక్రయానంతర సేవలందించే విషయంలో మరింత సమన్వయపూర్వకంగా పని చేయాలన్న అంశాలపై ఏకాభిప్రాయసాధనతో ఈ సమావేశం ముగిసింది.
విడిభాగాలకు ప్రమాణాలు నిర్దేశించడం, నిపుణులైన మానవ వనరులకు ప్రమాణాల రూపకల్పన, విక్రయానంతర సేవల సమయంలో వినియోగదారులకు ప్రయోజనం కలిగించే రీతిలో కంపెనీలు కేటలాగ్ లు తయారుచేయడం, ఉత్పత్తుల సుదీర్ఘ జీవనకాల మనుగడ, మోటార్ ఇన్సూరెన్స్ ముసుగులో రిపేర్ వర్క్స్ లో మోసాలు, ఈ కారణంగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు వంటి విభిన్న అంశాలపై చర్చలు జరిగాయి.
వినియోగదారులు, కంపెనీలకు మధ్య అవసరమైన సమాచారం అందుబాటులో ఉంచే వారధిగా నిలిచే రైట్ టు రిపేర్ పోర్టల్ లో చేరాలని కంపెనీలన్నింటికీ విజ్ఞప్తి చేశారు.
i. ఉత్పత్తి మాన్యువల్స్/ రిపేర్ వీడియోలు (కంపెనీల వెబ్ సైట్లు, యు ట్యూబ్ చానళ్లను అనుసంధానం చేయడం ద్వారా) అందుబాటులో ఉంచాలి.
ii. విడిభాగాల ధర, వారెంటీకి సంబంధించిన ఆందోళనలు తొలగించాలి.
iii. ఉత్పత్తికి ఎంత గ్యారంటీ/ వారెంటీ ఇస్తున్నారు, పొడిగించిన వారెంటీ ఎంత వంటి వివరాలన్నీ స్పష్టంగా తెలియచేయాలి.
iv. దేశవ్యాప్తంగా కంపెనీ సర్వీస్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, థర్డ్ పార్టీ సర్వీసుకు ఎవరికి గుర్తింపు ఇచ్చారు వంటి వివరాలు కూడా తెలియచేయాలి.
v. ఉత్పత్తి ఏ దేశంలో తయారయింది అన్నది కూడా స్పష్టంగా తెలియచేయాలి.
పోర్టల్ లో ఇప్పటికే చేరిన టివిఎస్ కంపెనీ వంటివి తమ అనుభవాలను తెలియచేశాయి. అలాగే టాటా మోటార్స్, టివిఎస్ కంపెనీలు జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్ నుంచి తమకు అందిన సమాచారం ఆధారంగా కీలకమైన రిపేర్ అంశాలను గుర్తించామని, దానికి అనుగుణంగా సంబంధిత వీడియోలను అధికారి యు ట్యూబ్ చానళ్ల ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంచామని తెలియచేశాయి. వేగంగా మారుతున్న ఆటోమొబైల్ మార్కెట్ ధోరణులకు అనుగుణంగా యువతలో ఆటోమోటివ్ నైపుణ్యాల శిక్షణకు మద్దతు ఇవ్వడంలో ఆటోమోటివ్ నైపుణ్యాల అభివృద్ధి మండలి పాత్ర గురించి ఆక్మా వంటి సంఘాలు వివరించాయి.
ఆక్మా, సియామ్, ఆత్మా, ఎపిక్ ఫౌండేషన్ వంటి ఆటోమొబైల్ అసోసియేషన్లు; టాటా మోటార్స్, మహీంద్రా, టివిఎస్, రాయల్ ఎన్ ఫీల్డ్, రెనో, బాష్, యమహా మోటార్స్ ఇండియా, హోండా కార్స్ ఇండియా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
***
(Release ID: 2031526)
Visitor Counter : 77