సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
వికలాంగుల సాధికారత శాఖ ఆధ్వర్యంలో భువనేశ్వర్‌లో 2024 జూలై 5 నుండి 11 వరకు దివ్య కళా మేళా, దివ్య కళా శక్తి, దివ్యాంగుల రోజ్‌గార్ మేళా నిర్వహణ
రేపు ప్రారంభం కానున్న ప్రసిద్ధి చెందిన దివ్య కళా మేళా, దివ్య కళా శక్తి మేళా
దివ్యాంగుల ప్రతిభ, సామర్థ్యాలను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ప్రాధాన్యత ఇస్తుంది.
Posted On:
04 JUL 2024 5:36PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగ పారిశ్రామికవేత్తలు, చేతివృత్తి నిపుణులు తమ ప్రతిభ, హస్తకళా నైపుణ్యాన్ని ప్రదర్శించే అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించడానికి జాతీయ దివ్యాంగుల ఫైనాన్స్, డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్‌డిఎఫ్‌డిసి) సహకారంతో, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వానికి చెందిన వికలాంగుల (దివ్యాంగులు) సాధికారత విభాగం సిద్ధంగా ఉంది. ఒడిశాలోని భువనేశ్వర్‌లోని కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటీ) ప్రాంగణంలో, 2024 జూలై 5 నుంచి 11 వరకు దివ్య కళా మేళా, దివ్య కళా శక్తి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సహాయమంత్రి శ్రీ బిఎల్ వర్మ, ఈ కార్యక్రమాన్ని 5 జూలై 2024 మధ్యాహ్నం 1:00 గంటలకు ప్రారంభించనున్నారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఒడిశా రాష్ట్రాలలో దివ్యాంగుల కోసం పనిచేస్తున్న ప్రముఖ ఎన్‌జీఓ లతో పాటు ఇతర ప్రముఖులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
పైన పేర్కొన్న ఆరు రాష్ట్రాల్లోని దివ్యాంగ కళాకారులచే ప్రసిద్ధి చెందిన సాంస్కృతిక కార్యక్రమం 'దివ్య కళా శక్తి' నిర్వహించనున్నారు. కేఐఐటీ విశ్వవిద్యాలయం సమావేశ మందిరం వేదికగా నిర్వహించనున్న 'దివ్య కళా శక్తి' దివ్యాంగుల ప్రతిభను, సామర్థ్యాలను వెలికితీసి.., కళలు, సంస్కృతి ద్వారా సమాజంలో వారి భాగస్వామ్యాన్ని ఉద్ఘటిస్తుంది.
'దివ్య కళా మేళా'లో 190 మందికి పైగా దివ్యాంగ కళాకారులు, చేతివృత్తిదారులు, పారిశ్రామికవేత్తలు రూపొందించిన శక్తివంతమైన ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. సందర్శకులు ఇంటి అలంకరణ, దుస్తులు, స్టేషనరీ, పర్యావరణ అనుకూల ఉత్పత్తులు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, సేంద్రీయ ఉత్పత్తులు, బొమ్మలు, బహుమతులు, ఆభరణాలు & క్లచ్ బ్యాగులు, పెయింటింగ్స్ వంటి వ్యక్తిగత ఉపకరణాలతో సహా అనేక రకాల వస్తువులను అన్వేషించవచ్చు.
ఈ మేళా, సందర్శకులను దివ్యాంగ కళాకారులు అపారమైన సంకల్పంతో తయారు చేసిన ప్రత్యేక వస్తువులను కొనుగోలు చేసేలా చేసి, "వోకల్ ఫర్ లోకల్" చొరవను ప్రోత్సహిస్తుంది.
ప్రాంగణం-6లో జూలై 5 నుంచి 11 వరకు ఉదయం 9.00 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో దివ్యాంగుల కళాకారులు, ప్రముఖ నిపుణుల ప్రదర్శనలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. సందర్శకులు అదనంగా, ఈ కార్యక్రమంలో వివిధ రకాల ప్రాంతీయ వంటకాలను ఆస్వాదించవచ్చు.
దివ్యాంగులకు అవసరమైన పలు పరికరాలు, ఉపకరణాల కోసం ఒడిశాలోని స్వామి వివేకానంద నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (ఎస్‌విఎన్‌ఐఆర్‌టిఎఆర్), కృత్రిమ అవయవాల తయారీ సంస్థ (అలిమ్కో) సహకారంతో, ప్రత్యేక మదింపు శిబిరాలను నిర్వహించనున్నారు.
సమ్మిళిత సమాజాన్ని నిర్మించే దిశగా, దివ్యాంగులకు సాధికారత కల్పించేందుకు దివ్య కళా మేళా, దివ్య కళా శక్తి కార్యక్రమాలతో పాటు, దివ్యాంగుల రోజ్‌గార్ మేళా నిర్వహించనున్నారు. దివ్యాంగులను గౌరవించే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన వికలాంగుల సాధికారత విభాగం ఖచ్చితమైన ప్రణాళికతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా దివ్యాంగుల సాధికారత భావనను ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.
***
(Release ID: 2031020)
Visitor Counter : 54