మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలోని అన్ని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు హాస్టళ్ళలో ఐసిటి ల్యాబ్ స్మార్ట్ క్లాస్ రూమ్లను ప్రవేశపెట్టనున్న కేంద్ర విద్యా శాఖ

Posted On: 03 JUL 2024 5:04PM by PIB Hyderabad

 ‘సమగ్ర శిక్ష’ పథక సూత్రాలను అనుసరించి దేశంలోని వివిధ ప్రాంతాలలోని ‘కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు’(కేజీబీవీ), ‘హాస్టళ్ల’లో, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసిటి) ల్యాబులను, స్మార్ట్ క్లాస్ రూమ్ లను ప్రవేశపెట్టాలని కేంద్ర విద్యా శాఖ, పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం‌ నిర్ణయించింది.

ఈ చర్య ద్వారా విద్యార్థినులను సాధికారులను చేయడం, వారికి డిజిటల్ నైపుణ్యాలను అందించడం, తద్వారా వారు విద్యలో మెరుగైన ఫలితాలను సాధించే అవకాశాలు కలిగించడం లక్ష్యాలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.  ఇది ప్రస్తుతం ఉన్న డిజిటల్ వ్యత్యాసాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. సుమారు 290 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ కార్యక్రమం కేజీబీవీల్లో  చదువుకునే సుమారు 7 లక్షల బాలికలకు ప్రయోజనాన్ని అందిస్తుంది.

సమాజంలో వెనుకబడిన వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మరియు దారిద్ర్యరేఖకు దిగువనున్న వర్గాలకు చెందిన 6 నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న బాలికల కోసం కేజీబీవీలు ఆశ్రమ పాఠశాలలను స్థాపించారు.

విద్యాపరంగా వెనుకబడ్డ ప్రాంతాల్లోని బాలికలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందుబాటులోకి తేవడం, పాఠశాలల్లో అన్ని స్థాయిల్లో లింగ అసమానత్వాన్ని తగ్గించే ఉద్దేశ్యంతో ఈ స్కూళ్లను నెలకొల్పారు. ప్రస్తుతం దేశంలోని 30 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 5116 కేజీబీవీలు పాఠశాలలు బాలికలకు విద్యను అందిస్తున్నాయి.

విద్యాభ్యాసానికి సుదూర ప్రయాణం చేయవలసి రావడం, బాలికలను విద్యకు దూరంగా ఉంచే సంప్రదాయాలు, అమ్మాయిల భద్రత వంటి సమస్యల నేపథ్యంలో అనేకమంది బాలికలు చదువుకోలేని  స్థితిలో ఉన్నారు, విద్యను అభ్యసించడం కోసం అనేక అవరోధాల్ని ఎదుర్కొంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో వారికి ఐసీటీ ల్యాబులు, స్మార్ట్ క్లాస్ రూములను అందించడం అత్యవసరం. డిజిటల్ విద్య వారి వ్యక్తిగత వృత్తిగత జీవితాల్లో అభివృద్ధికి దోహదపడుతుంది. అంతేకాక డిజిటల్ అంతరాలను తొలగిస్తుంది.

శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి, ఐసిటి మన జీవితాలు, జీవనోపాధుల్లో  అంతర్భాగమైన నేటి యుగంలో, ఎటువంటి నేపథ్యమున్న విద్యార్థులకైనా అత్యాధునిక సాంకేతికత అందడం అత్యవసరం.  ఐసిటిని  పాఠ్యాంశాల్లో ఒక భాగం చేయడం వల్ల విద్యార్థులకు అనుభవం ద్వారా నేరుగా నేర్చుకునే అవకాశం, అవగాహన పెంపొందించుకునే అవకాశాలు  కలుగుతాయి. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్ధినులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

ఐసిటి సదుపాయాలను విద్యార్థులకు అందించడం వల్ల వారికి  పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం ద్వారా లభ్యమయ్యే స్వయం,  స్వయంప్రభ జాతీయ డిజిటల్ గ్రంథాలయం,  ఈ-పాఠశాల, నేషనల్ రిపోజిట్రీ ఆఫ్ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్,  దీక్ష వంటి అనేక డిజిటల్ వేదికలు, వనరులు అందుబాటులోకి వస్తాయి.  దాంతో వారి జ్ఞానం పెరగడమే కాక మెరుగైన  ఫలితాలు సాధించే అవకాశం ఉంది.

***


(Release ID: 2030874) Visitor Counter : 68