సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

“సమాచార హక్కు (ఆర్.టి.ఐ) దరఖాస్తులలో దాదాపు 100 శాతం పరిష్కరించబడుతున్న క్రమంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల సంఖ్య ప్రతియేటా తగ్గుతూ వస్తుంది” అని కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు


కేంద్ర సమాచార కమీషన్ పనితీరు, పురోగతిని ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌కు వివరించిన ప్రధాన సమాచార కమీషనర్

ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం ద్వారా సుపరిపాలన అందించడమే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజన్ అన్నారు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల శాఖ సహాయ మంత్రి- డాక్టర్ సింగ్

Posted On: 03 JUL 2024 4:42PM by PIB Hyderabad

ఈరోజు ఢిల్లీలో జరిగిన కేంద్ర సమాచార కమిషన్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ “సమాచార హక్కు (ఆర్.టి.ఐ) దరఖాస్తులలో దాదాపుగా 100 శాతం పరిష్కరించబడుతున్న క్రమంలో ప్రతియేటా పెండింగ్ దరఖాస్తుల సంఖ్య తగ్గుతూ వస్తుంది” అన్నారు.

కేంద్రంలో మూడవసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత మొదటిసారిగా నిర్వహించిన ఈ సమావేశంలో ప్రధాన సమాచార కమిషనర్ కేంద్ర సమాచార కమిషన్ పనితీరును, పురోగతిని డాక్టర్ జితేంద్ర సింగ్‌కు వివరించారు. డాక్టర్ సింగ్ కూడా మూడవసారి ఈ మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సభాధ్యక్షులుగా వ్యవహరించిన, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ ఎమ్.వో.ఎస్. సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ఎర్త్ సైన్సెస్ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), పి.ఎమ్.వో., ఎమ్.వో.ఎస్. అణుశక్తి విభాగం, అంతరిక్ష విభాగం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్స్ శాఖామంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, “పెండింగ్ లో ఉన్న ఆర్.టి.ఐ. దరఖాస్తుల సంఖ్య 2019-20 కాలంలో 35718కి, 2021-22 కాలంలో 29213కి అలాగే 2023-24 కాలానికి 23087కు, 2024-25 కాలంలో 22666కు గణనీయంగా తగ్గడం విశేషం.” అన్నారు.    

పెండింగ్ దరఖాస్తుల సంఖ్యను తగ్గించుట అలాగే పౌరులకు సమాచారం అందించడాన్ని సులభతరం చేయుట విషయంలో సమాచార కమిషన్ కృషిని మంత్రి ప్రశంసించారు. మరింత త్వరగా సమాచారం అందించడం అలాగే దరఖాస్తులను వేగంగా పరిష్కరించడానికి కమిషన్‌కు డాక్టర్ సింగ్ మార్గదర్శనం చేశారు. ఈ ఘనత సాధించడంలో సమాచార కమిషన్, దాని నాయకత్వం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో కమిషన్‌కు మరియు పౌర కేంద్రీకృత పాలనకు తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చిన డాక్టర్ జితేంద్ర సింగ్, తమ ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం ద్వారా సుపరిపాలనను తీసుకురావడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్ అని తెలిపారు.  

కోవిడ్ మహమ్మారి సమయంలో దేశమంతటా సి.ఐ.సి చేసిన కృషిని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రధానంగా ప్రస్తావించారు. జమ్మూ & కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో సమాచార కమిషన్ శాఖను ప్రారంభించడం ద్వారా కాశ్మీర్ ప్రజలకు అది ఎంతో సౌకర్యంగా మారిందని మంత్రి పేర్కొన్నారు.

 

కమిషన్‌కు మద్దతు అందించే విషయంలో మంత్రి కృషికి ప్రధాన సమాచార కమిషనర్ శ్రీ హీరాలాల్ సమారియా కృతజ్ఞతలు తెలిపారు. 2014 వరకు అద్దె భవనంలో కొనసాగిన సి.ఐ.సి కార్యకలాపాలు ఆ  సంవత్సరం ఏర్పడిన కొత్త ప్రభుత్వ హయాంలో స్వతంత్ర ఆఫీస్ కాంప్లెక్స్ నుండి పనిచేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. కమిషన్ యొక్క స్థిరమైన పురోగతిని గురించి మంత్రికి వివరించిన ఆయన, సి.ఐ.సి.కి వస్తున్న దరఖాస్తులలో ప్రతియేటా సుమారు 17000 దరఖాస్తులను పరిష్కరిస్తున్నట్లు ఆయన వివరించారు.

నోడల్ అధికారులు, సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ (సి.పి.ఐ.వో) మరియు మొదటి అప్పిలేట్ అధికారులకు సమాచార కమిషన్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సి.ఐ.సి. పేర్కొన్నది. విజ్ఞప్తులకు సమాధానాన్ని రూపొందించడం, నిబంధనలు మరియు చట్టాలకు అనుగుణంగా సమాచారాన్ని అందించే విషయంలో సమాచార అధికారుల భాగస్వామ్యాన్ని, వారి సామర్థ్యాన్ని పెంపొందించిన కారణంగా ఈ కార్యక్రమానికి భారీ స్పందన లభించినట్లు వివరించారు.

***


(Release ID: 2030673) Visitor Counter : 270