ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

రాజ్యసభ 264 వ సదస్సు ముగిసిన సందర్భంలో సభాధ్యక్షుడి ముగింపు ఉపన్యాస ప్రసంగ పాఠం

Posted On: 03 JUL 2024 3:43PM by PIB Hyderabad

గౌరవనీయ సభ్యులారా, రాజ్యసభ 264 వ సమావేశం ముగిసింది. ఇరుసభలనుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ విధానాల గురించి తెలియచేస్తూ, సమావేశాలకు చక్కని నాందీ వాక్యంగా నిలిచే సంప్రదాయమిది. 

ఆరు దశాబ్దాల అనంతరం జరిగిన విశేషం, భారతదేశంలో ఒక ప్రధానమంత్రి వరసగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేయడం. ప్రమాణ స్వీకారం అనంతరం గౌరవనీయ ప్రధానమంత్రి తన మంత్రివర్గ సభ్యులను సభకు పరిచయం చేశారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో,  76 మందికి పైగా సభ్యులు 21 గంటల పాటు ఉత్సాహంగా పాల్గొన్నారు. సభకు కొత్తగా ఎన్నికైన 19 మంది నూతన సభ్యులు కూడా తమ  తొలి ప్రసంగాలని సభకు వినిపించారు.

చర్చలో పాల్గొన్న గౌరవనీయ ప్రధానమంత్రి చురుకైన ప్రసంగం ద్వారా తమ వాణిని బలంగా వినిపించారు. 

తప్పని పరిస్థితుల్లో జరిగిన వాయిదాల వల్ల సభాకాలం 43 నిమిషాల పాటు వృధా అయినప్పటికీ, భోజన విరామ సమయంలో, నిర్దేశిత కాలవ్యవధికి అతీతంగానూ సభను కొనసాగించడం ద్వారా ఆ లోటుని భర్తీ చేసుకోగలిగాం. దాంతో సభాకాలం అనుకున్న దానికంటే మూడు గంటలు ఎక్కువ సేపు నడిచింది. వందశాతానికి పైగా ఉత్పాదకతను సాధించాం.

అటు అధికారపక్షం ఇటు విపక్షాలు కూడా సభ కార్యకలాపాల్లో  చురుకుగా  పాల్గొన్నప్పటికీ,  కార్యకలాపాలకు జరిగిన అంతరాయాలు నా మనసుపై భారంగా నిలిచి కొన్ని అనివార్య/బాధాకర  నిర్ధారణలు  చేసేందుకు నన్ను పురిగొల్పాయి. 

సభలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన వారు కూడా  బాధ్యత రాహిత్యంతో ప్రవర్తించడం నన్ను బాధించింది. సభ కార్యకలాపాలకు అడ్డు రావడం అంటే కేవలం సభ చేపట్టవలసిన అంశాలకు అవరోధమే కాక, సభా మర్యాదను కూడా కించపరిచినట్లే.

చివరికి విపక్ష నేత కూడా సభ మధ్యకు దూసుకు రావడం నన్ను వేదనకు గురిచేసింది.  అటువంటి ప్రవర్తన పార్లమెంటరీ వ్యవహార శైలికి మాయని మచ్చవంటిదే .

తమ ప్రవర్తన ద్వారా సభ్యులు ఈ సభ గౌరవ మర్యాదల్ని మరింత పెంపొందించేలా, సభ ను లోతైన చర్చలు, ఆలోచనలు, వాగ్వాదాలు జరిగే వేదికగా ఆలయంగా తీర్చిదిద్దాలన్నది నా అభిమతం .

ఆరు దశాబ్దాల అనంతరం వరసగా మూడవసారి ఒక ప్రధానమంత్రి ప్రభుత్వ పగ్గాలను చేపట్టే చారిత్రిక సందర్భంలో సైతం విపక్ష సభ్యులు వాకౌట్ చేయడం నన్ను తీవ్రంగా కలిచివేసింది .

రాజ్యాంగం వారికి అప్పగించిన బాధ్యత నుండి చేసిన ఈ వాకౌట్ ప్రమాదకరమైన ఉదాహరణగా ఉండి,  ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా నిలిచింది.

గౌరవనీయ ఉపాధ్యక్షులు శ్రీ హరి వన్ష్ జీ కి   నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.  సభా నిర్వహణలో నాకు వెన్నుదన్నుగా నిలిచి తమ అమూల్యమైన సలహాలు సూచనలతో నాకు బాసటగా నిలిచి, సచివాలయంలో అనేక వినూత్నమైన ఆలోచనలకు తెరతీశారు.

సభాపతుల పానెల్ సభ్యులందరికీ కూడా సభా నిర్వహణ లో నాకు తోడ్పాటుని  అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను; వీరిలో 50% మంది ఈ సభకు చెందిన మహిళలే కావడం విశేషం.

సభ అధినేతకు,  విపక్ష నేతకు,  వివిధ పార్టీల నేతలకు మిగతా సభ్యులందరికీ వారి సహకారానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఈ దఫా సమావేశాలు  సజావుగా సాగేందుకు సహకరించిన సెక్రటరీ జనరల్ , అలుపన్న మాట లేకుండా కష్టించిన వారి టీం లోని ఇతర సభ్యుల శ్రమ ఎంతటిదో నాకు తెలుసు.  ధన్యవాదాలు.

***



(Release ID: 2030619) Visitor Counter : 45