నౌకారవాణా మంత్రిత్వ శాఖ

రేవులు-నౌకాయానం-జలమార్గాల భాగస్వాములతో నిర్మాణాత్మక బడ్జెట్ పూర్వ సమావేశం నిర్వహించిన శ్రీ సర్బానంద సోనోవాల్


దేశం ప్రగతి దిశగా సూచనలు-సలహాలు ఇవ్వాలని కోరిన మంత్రి;

‘‘వివిధ భాగస్వాములతో ఈ చర్చలలో ప్రతిష్టాత్మక ‘ఎంఐవి-2030’ సహా అమృతకాల సంకల్పం-2047 దిశగా మరింత సమగ్ర.. వృద్ధి-చోదక బడ్జెట్‌ తయారీకి దోహదం చేసే విలువైన సలహాలు-సూచనలు రేవులు-నౌకాయానం-జలమార్గాల శాఖకు లభించాయి’’;

‘‘ఆర్థిక వృద్ధి.. పర్యావరణ సుస్థిరతలను పెంచే బలమైన సముద్ర
పర్యావరణ వ్యవస్థ రూపకల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది’’;

‘‘వడావన్ మెగా ట్రాన్షిప్‌మెంట్ పోర్ట్’... ‘క్రూజ్ ఇండియా మిషన్’ వంటి కార్యక్రమాలతో దేశాన్ని ప్రపంచ సముద్ర కూడలిగా రూపుదిద్దాలని మా శాఖ లక్ష్య నిర్దేశం చేసుకుంది’’

Posted On: 01 JUL 2024 6:11PM by PIB Hyderabad

   కేంద్ర బడ్జెట్‌ తయారీ సన్నాహకాల్లో భాగంగా ఓడరేవులు-నౌకాయానం-జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఇవాళ న్యూఢిల్లీలో ఈ రంగం సంబంధిత వివిధ భాగస్వాములతో నిర్మాణాత్మక బడ్జెట్ పూర్వ సమావేశం నిర్వహించారు. దేశంలోని పలు రంగాల నిపుణులు, భాగస్వాముల నుంచి విలువైన సూచనలు-సలహాలు స్వీకరించడం లక్ష్యంగా సార్వత్రిక చర్చకు  సౌలభ్యం కల్పిస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది.

   దేశాభివృద్ధి ప్రధానంగా సహకారపూరిత వాతావరణం ఏర్పరచడంతోపాటు సూచనలు-సలహాలను పంచుకునేలా భాగస్వాములను ప్రోత్సహించడంలో ప్రభుత్వ నిబద్ధతను ఈ సందర్భంగా శ్రీ సర్బానంద సోనోవాల్ విశదీకరించారు. అలాగే ఎగుమతి-దిగుమతి (ఎగ్జిమ్) వాణిజ్యం పెంచడంసహా ఆర్థిక వృద్ధికి తోడ్పడే సుస్థిర, అంతర్జాతీయ స్థాయి సముద్ర-అంతర్గత జలమార్గాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి తమ శాఖ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.

   భారత సముద్ర రంగ బలోపేతంలో భాగంగా సుస్థిర, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తూ అనేక వ్యూహాత్మక కార్యక్రమాలకు కేంద్ర ఓడరేవులు-నౌకాయానం-జలమార్గాల మంత్రిత్వ శాఖ నేతృత్వం వహిస్తోంది. ఈ దిశగా చేపట్టిన ప్రధాన కార్యక్రమాల్లో 5100 కోట్ల విలువైన ‘సాగరమాల ప్రాజెక్ట్’, నౌకా నిర్మాణ కేంద్రాల (షిప్‌యార్డ్‌)కు చేయూతనిచ్చే ‘షిప్‌బిల్డింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పాలసీ’ వంటివి ఉన్నాయి. అలాగే ‘హరిత నౌక’ కార్యక్రమం పేరిట అంతర్గత జలమార్గాలలో హరిత ఇంధన రవాణాను ప్రోత్సహిస్తోంది. మరోవైపు సముద్ర రంగ అభివృద్ధి నిధి (మారిటైమ్ డెవలప్‌మెంట్ ఫండ్-ఎండిఎఫ్), ‘షిప్ ఓనింగ్ అండ్ లీజింగ్ ఎంటిటీ (ఎస్ఒఎల్ఇ-సోల్) కింద ఓడల కొనుగోలు-భారతీయ యాజమాన్యం పెంపు నిమిత్తం ఆర్థిక సహాయం అందిస్తోంది. అదేవిధంగా గణనీయ ఉపాధి సృష్టితోపాటు నిర్వహణ సామర్థ్యం పెంపు లక్ష్యంగా ‘వడావన్ మెగా ట్రాన్షిప్‌మెంట్ పోర్ట్’, ‘గలాథియా బే ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్’ వంటి ప్రధాన ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. నౌకాయానాన్ని మూడు రెట్లు పెంచడం ధ్యేయంగా ‘క్రూజ్ ఇండియా మిషన్’, ‘ఒడిషా వాటర్‌వే డెవలప్‌మెంట్’ కింద జాతీయ జలమార్గం-5 (ఎన్‌డ‌బ్ల్యు-5) ద్వారా సరకు రవాణా అవకాశాలను అన్వేషిస్తోంది. వీటన్నిటితోపాటు పన్నులు-జీఎస్టీలో విధాన సంస్కరణలు, నౌకానిర్మాణానికి మద్దతు, హరిత కార్యక్రమాలు వంటివి ఆర్థిక వృద్ధి, పర్యావరణ సుస్థిరతపై మంత్రిత్వ శాఖ నిబద్ధతను చాటడంతోపాటు సముద్ర రంగంలో భారత్ పోటీతత్వాన్ని మెరుగుపరుస్తుంది.

   సమావేశం అనంతర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ- ‘‘మా భాగస్వాములు ఇందులో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. వారినుంచి ఎన్నో విలువైన సూచనలు-సలహాలు అందడం అభినందనీయం. ఈ స్వేచ్ఛాపూర్వక చర్చలు ఓడరేవులు-నౌకాయానం-జలమార్గాల మంత్రిత్వ శాఖకు ఇతోధికంగా తోడ్పడే భిన్న దృక్కోణాలను ఆవిష్కరించాయి. గౌరవనీయ ప్రధానమంత్రి లక్షించిన ‘ఎంఐవి-2030’, అమృతకాల సంకల్పం-2047’ దిశగా మరింత సమగ్ర, వృద్ధి-చోదక బడ్జెట్‌ రూపకల్పనకు ఈ కసరత్తు దోహదం చేస్తుందనడంలో సందేహం లేదు’’ అని వివరించారు.

   అలాగే ‘‘ఆర్థిక వృద్ధి.. పర్యావరణ సుస్థిరతలను పెంచే బలమైన సముద్ర పర్యావరణ వ్యవస్థ రూపకల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేర‌కు ‘వడావన్ మెగా ట్రాన్షిప్‌మెంట్ పోర్ట్’, ‘క్రూజ్ ఇండియా మిషన్’ వంటి కార్యక్రమాలతో దేశాన్ని ప్రపంచ సముద్ర కూడలిగా రూపుదిద్దాలని మా శాఖ లక్ష్య నిర్దేశం చేసుకుంది’’ అని మంత్రి తెలిపారు. అంతేకాకుండా వృద్ధికిగల అవకాశాల గుర్తింపు, సవాళ్ల పరిష్కారం, దేశ ప్రగతికి వినూత్న మార్గాన్వేషణ తదితరాలపైనా చర్చల సందర్భంగా దృష్టి  కేంద్రీకరించారు. భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతోపాటు ‘ఎంఐవి-2030’, అమృతకాల సంకల్పం-2047’లకు అనుగుణంగా ఈ చర్చలు సాగాయి. ఈ మేరకు బలమైన ఆర్థిక వ్యవస్థ, ఉజ్వల సంస్కృతి, విశేష అంతర్జాతీయ ప్రాచుర్యం, వర్ధమాన నౌకాయాన రంగం తదితరాలతో కూడిన శక్తిమంతమైన భారతదేశానికి రూపమివ్వడంపై చర్చల సందర్భంగా భాగస్వాములు దృష్టి పెట్టారు.

   ఈ సమావేశంలో (ఆన్‌లైన్‌ సహా) 150 భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు చురుగ్గా పాల్గొన్నారు. వీరిలో ప్రధాన ఓడరేవులు, నౌకాయాన రంగం, అంతర్గత జలమార్గాల ప్రాధికార సంస్థ (ఐడబ్ల్యుఎఐ), నౌకాయాన డైరెక్టరేట్ జనరల్ (డిజి షిప్పింగ్), ఫిక్కి (ఎఫ్ఐసిసిఐ), సిఐఐ, భారత జాతీయ నావికా సిబ్బంది సంఘం, అసోచామ్, భారత నౌకానిర్మాణ కేంద్రాల సంఘం, మియాస్క్, డిపి వరల్డ్, జెఎం బక్షి, టిసిఐ సీవేస్, ఎంఎస్‌సి తదితర సంస్థలకు చెందిన వారున్నారు. దేశ ఆర్థిక వృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి అనేక కీలకాంశాలపై వీరంతా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకున్నారు.

   దేశ బడ్జెట్ రూపకల్పనలో ప్రభుత్వ చిత్తశుద్ధిని ఇలాంటి బడ్జెట్ పూర్వ సమావేశాలు ప్రతిబింబిస్తాయి. విభిన్న సమూహాల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరించడంలో ప్రభుత్వ నిబద్ధతను నొక్కిచెబుతాయి. కొత్త బడ్జెట్‌ తయారీలో ఈ విధంగా అందే విస్తృత సమాచారం ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. దేశ ప్రగతి, శ్రేయస్సు దిశగా దూరదృష్టితో కూడిన మన లక్ష్య సాధన కృషిలో ఎంతగానో తోడ్పడుతుంది.

***



(Release ID: 2030197) Visitor Counter : 57