పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

రద్దయిన విమాన టిక్కెట్ల పూర్తి ధరను వాపసు చేయడానికి లేదా ప్రత్యామ్నాయ మార్గంలో టిక్కెట్లను అందించడానికి 24/7 వార్ రూమ్ ఏర్పాటు


ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణీకులను ఇబ్బంది పెట్టేలా ఛార్జీలు పెంచొద్దని అన్ని విమానయాన సంస్థలకు కేంద్ర మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు సూచన

"అన్ని విమానాశ్రయాల్లో నిర్మాణాల తనిఖీ చేపట్టేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక సర్క్యులర్ జారీ చేస్తుంది"

దిల్లీ ఐఐటీకి చెందిన ఇంజినీర్లు దిల్లీ టీ1, జబల్‌పూర్ విమానాశ్రయాల్లో జరిగిన సంఘటనలను పరిశీలిస్తారు - శ్రీ రామ్మోహన్ నాయుడు

Posted On: 28 JUN 2024 8:53PM by PIB Hyderabad

దిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్‌-1 పైకప్పు కొంతభాగం కూలిన ఘటనపై, పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు ఈ రోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శులు సమీక్షలో పాల్గొన్నారు. ప్రస్తుత ఇబ్బందులను పరిష్కరించడానికి, ప్రయాణీకుల భద్రత & సౌకర్యాల కోసం ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు:

  1. 24/7 వార్ రూమ్ ఏర్పాటు & సమర్ధవంతంగా టీ2, టీ3 నిర్వహణ - పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో 24/7 వార్ రూమ్ ఏర్పాటు చేస్తారు. రద్దయిన విమాన టిక్కెట్ల పూర్తి ధరను వాపసు చేసేందుకు లేదా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణ టిక్కెట్లను అందిచేందుకు ఈ వార్‌ రూమ్‌ పని చేస్తుంది. 7 రోజుల్లోగా వాపసులు పూర్తవుతాయి. తక్షణ సాయం కోసం ప్రయాణీకులు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లను ప్రకటించారు.
    • వార్ రూమ్ హెల్ప్‌లైన్ నంబర్లు:
      • ఇండిగో విమానయాన సంస్థ
        1. టీ2 టెర్మినల్: 7428748308
          టీ3 టెర్మినల్: 7428748310
      • స్పైస్‌జెట్
        1. టీ3 టెర్మినల్: 0124-4983410/0124-7101600
          9711209864 (రోహిత్)

టీ1ను తాత్కాలికంగా మూసివేయడం వల్ల టీ2, టీ3 టెర్మినల్స్‌పై పడే అదనపు ఒత్తిడిని నిర్వహించడానికి చర్యలు తీసుకున్నారు. ప్రయాణీకుల సౌకర్యాలకు తొలి ప్రాధాన్యత ఇచ్చారు.

2. టిక్కెట్‌ ధరలపై సలహా: ప్రస్తుత పరిస్థితులను అవకాశంగా తీసుకుని, విమాన ఛార్జీలు పెంచి ప్రయాణీకులను ఇబ్బంది పెట్టొద్దని సూచిస్తూ అన్ని విమానయాన సంస్థలకు మంత్రిత్వ శాఖ ఒక సలహా పత్రం జారీ చేసింది.

3. నిర్మాణాల తనిఖీలు: దేశంలోని అన్ని చిన్న & పెద్ద విమానాశ్రయాల్లో నిర్మాణాల గట్టిదనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసేలా ఒక సర్క్యులర్ జారీ చేయాలని మంత్రిత్వ శాఖ నుంచి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు (ఏఏఐ) ఆదేశాలు వెళ్లాయి. 2-5 రోజుల్లో తనిఖీలు పూర్తి చేసి ఆ నివేదికను పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సమర్పించాలి.

నిర్మాణాల్లో ఏవైనా ఇబ్బందులు కనుగొంటే, అక్కడ భద్రత చర్యలు పెంచడానికి & దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా నివారించడానికి దీర్ఘకాలిక విధానాల రూపకల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తారు.

4. ప్రాథమిక దర్యాప్తు బృందం: దిల్లీ ఐఐటీకి చెందిన నిర్మాణ ఇంజినీర్లు టీ1లో జరిగిన సంఘటనను తక్షణమే పరిశీలించి, నివేదిక సమర్పించాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ప్రాథమిక ఫలితాల ఆధారంగా తదుపరి పరిశీలన ఉంటుంది. జబల్‌పూర్ సంఘటనను ఏఏఐ పరిశీలిస్తుంది.

ప్రయాణీకుల భద్రత, సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రస్తుత ఇబ్బందులను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు, అన్ని విమానాశ్రయాల్లో భద్రత ప్రమాణాలను మెరుగుపరచడానికి మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది.

***



(Release ID: 2029430) Visitor Counter : 53