మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సంపూర్ణ క్రియాశీల అక్షరాస్యత సాధించిన లద్దాక్

Posted On: 25 JUN 2024 1:16PM by PIB Hyderabad

నవభారత్ సాక్షరత కార్యక్రమం - "ఉల్లాస్" కింద 97% అక్షరాస్యత సాధించిన లద్దాక్ ను సంపూర్ణ క్రియాశీల అక్షరాస్యత సాధించిన పరిపాలన యూనిట్ గా గుర్తిస్తున్నట్లు లద్దాక్ లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్  బీ.డీ. మిశ్రా జూన్ 24, 2024న ప్రకటించారు.

పౌరులు మౌలిక అక్షరాస్యత, అంకెల గణితం, అత్యవసర జీవన నైపుణ్యాలను సొంతం చేసుకొని సాధికారత సాధించాలన్న లద్దాక్ నిబద్ధతకు ఇది మైలురాయిగా నిలుస్తోంది.

లేహ్ లోని సింధు సాంస్కృతిక కేంద్ర – ఎస్.ఎస్.కె.  వేడుకల్లో డా. మిశ్రా ఈ విషయాన్ని వెల్లడించారు.‌

భారత ప్రభుత్వ విద్యాశాఖకు చెందిన పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగ కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్, సంయుక్త కార్యదర్శి శ్రీమతి అర్చన శర్మ అవస్థి, కార్గిల్ ఎల్.ఎ.హెచ్.డి.సి. ‌సంస్థ చైర్మన్ డాక్టర్ మహమ్మద్ జఫర్ అఖూన్, లద్దాక్ పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి శ్రీ సంజీవ్ ఖిర్వార్,  500 మంది నూతన అక్షరాస్యులు, స్వచ్చంద సేవకుల సమక్షంలో ఈ ప్రకటన వెలువరించారు.

కొత్తగా అక్షరాస్యులు అయిన వారికి, స్వచ్ఛందంగా విద్యాదానం చేసిన గురువులకు సన్మానాలు, విద్యా విభాగం 2023 సంవత్సరపు వార్షిక అభివృద్ధి నివేదిక విడుదల వేడుకల్లో భాగమయ్యాయి.‌ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు ‘ఉల్లాస్’ మేళాను సందర్శించారు.

కార్యక్రమంలో భాగంగా నూతన అక్షరాస్యులని, స్వచ్ఛంద సేవకుల్ని ఉద్దేశించి ప్రసంగించిన డాక్టర్ మిశ్రా,  జీవితాంతం జ్ఞాన సముపార్జన మార్గంపై కొనసాగాలని ఉద్బోధించారు. పిల్లల్ని బడికి పంపవలసిన బాధ్యత తల్లిదండ్రులదేనని అన్నారు.  విద్యార్థులు కేవలం ఉద్యోగాన్వేషణతో పాటూ ఉద్యోగ కల్పన దిశగా ఆలోచించాలని అన్నారు.

ఈ సందర్భంగా ఆయన 2020 నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కొనియాడుతూ నూతన విధానం దేశాభివృద్ధికి బాటలు వేస్తోందని అన్నారు.

సభను ఉద్దేశించి ప్రసంగించిన శ్రీ సంజయ్ కుమార్ ఇటువంటి ఘనత సాధించిన లద్దాక్  ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, లద్దాక్ లో  పాఠశాల విద్యను మరింత అభివృద్ధి చేయడానికి కేంద్ర విద్యా శాఖ అన్ని రకాల సహాయాలను అందిస్తుందని హామీ ఇచ్చారు.  ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యకు ఉందని  ఆయన అన్నారు.  పేరుకు తగ్గట్టుగానే ఉల్లాస్ పథకం కొత్తగా చదువు నేర్చుకున్న వారికి ఎంతో సంతోషాన్ని తెచ్చిపెడుతుందని అన్నారు.

ఉల్లాస్ కార్యక్రమం మొత్తంగా స్వచ్ఛంద స్ఫూర్తి పై ఆధారపడ్డ కార్యక్రమమని, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేని స్వచ్ఛంద సేవకులు కేవలం నిరక్షరాస్యులకు చదువు చెప్పడమే ధ్యేయంగా ఉల్లాస్ మొబైల్ యాప్ లో  తమ పేర్లు నమోదు చేసుకుంటారని, లాభాపేక్ష లేని ఆదర్శమే ఈ కార్యక్రమం సిసలైన గొప్పతనమని అన్నారు.  దట్టమైన మంచు కురుస్తున్న పరిస్థితుల్లో సైతం విద్యార్థులు పరీక్షలు రాయడం వారి పట్టుదలకి సూచన అంటూ స్ఫూర్తిని కలిగించే విషయాలను చెబుతూ, అక్షరాస్యత పట్ల, లద్దాక్ తపనకు ఇది  నిదర్శనమని అన్నారు. నేడు సాధించిన ఘనత లద్దాక్ లో  సకారాత్మక మార్పుకి అంతులేని అవకాశాలకి నాంది పలుకుతుందని శ్రీ సంజయ్ కుమార్ అన్నారు.

ఉల్లాస్ -  నవభారత్ సాక్షరత కార్యక్రమం లేదా న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం(NILP) అనేది 2022 నుంచి 2027 పాటు కొనసాగుతున్న కేంద్ర ప్రయోజిత కార్యక్రమం.

2020 నూతన విద్యా విధానానికి అనుగుణంగా నడిచే ఉల్లాస్ పథకం, నేపథ్యానికి సంబంధం లేకుండా, 15 ఏళ్లకు పైబడిన పాఠశాల విద్యకు నోచుకోని వారికి విద్యను అందించి వారిని ప్రధాన జనజీవన స్రవంతిలో మమేకం చేస్తూ, అటువంటి వారు సైతం దేశాభివృద్ధిలో భాగస్వాములు కాగలిగే అవకాశాన్ని కల్పిస్తోంది.  కార్యక్రమంలో ఐదు ప్రధాన భాగాలు ఉన్నాయి – మౌలిక అక్షరాస్యత మరియు అంకెల గణన; అత్యవసర జీవన నైపుణ్యాలు; ప్రాథమిక విద్య;  వృత్తి నైపుణ్యాలు, కొనసాగే విద్య.  ఉల్లాస్ పథకం ముఖ్య ఉద్దేశం భారత్ -   జనజన్  సాక్షర్  అనే లక్ష్యాన్ని అందుకోవడం. ఇది కర్తవ్య బోధ అన్న సూత్రాన్ని అనుసరించి స్వచ్ఛంద సేవపై ఆధారపడుతుంది.  ఈ పథకం ఇప్పటికే దేశంలోని 77 లక్షల మందికి లబ్ధి చేకూర్చింది.  ఉల్లాస్ మొబైల్ యాప్ 1.29 కోట్ల మంది విద్యార్థులు,  35 లక్షల మంది అధ్యాపకులను కలిగి ఉంది.

***


(Release ID: 2028684) Visitor Counter : 123