నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav

అటల్ ఇన్నొవేషన్ మిషన్.. లా ఫోండేషన్ డస్సాల్ట్ సిస్టమ్స్ ఇండియా నిర్వహించిన ‘స్టూడెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ - సీడ్ ది ఫ్యూచర్ ఎంటర్‌ప్రెన్యూర్స్’ పోటీ తుది అంకంలో మెరిసిన యువ ఆవిష్కర్తలు

Posted On: 13 JUN 2024 11:34AM by PIB Hyderabad

   టల్ ఇన్నొవేషన్ మిషన్ (ఎఐఎం) ‘స్టూడెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ (ఎస్ఇపి) సీజన్-2023-24లో భాగంగా పాఠశాల విద్యార్థుల ప్రతిభ ఆవిష్కరణకు ఉద్దేశించిన ప్రతిష్టాత్మక ‘మేడ్ ఇన్ 3డి-సీడ్ ది ఫ్యూచర్ ఎంటర్‌ప్రెన్యూర్స్’ కార్యక్రమం తుది అంకాన్ని ‘లా ఫోండేషన్ డస్సాల్ట్ సిస్టమ్స్ ఇండియా’ సహకారంతో పుణే నగరంలో నిర్వహించింది. ఆవిష్కరణ-వ్యవస్థాపనలపై యువతరంలో ఆసక్తిని రగిలించడం లక్ష్యంగా నిర్వహించిన ఈ 8 నెలల యజ్ఞం దీంతో విజయవంతంగా సమాప్తమైంది.

   ఈ కార్యక్రమం సీజన్ 2023-24లో వ్యవసాయ విజ్ఞాన కేంద్రాల (కెవివై)తో విద్యార్థుల అనుసంధానంపై ప్రధానంగా దృష్టి సారించారు. దీంతో గ్రామీణ పర్యావరణ వ్యవస్థ ఇతివృత్తం ఆధారిత ప్రాజెక్టులు గణనీయ సంఖ్యలో రూపొందాయి. దేశవ్యాప్తంగా 140 పాఠశాలల నుంచి 12 అగ్రశ్రేణి విద్యార్థి జట్లు ఉత్పత్తి రూపకల్పన (ప్రాడక్ట్ డిజైన్)లో విశిష్ట ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఈ  ఆరంభ ప్రయత్నాల్లో ద్రవ్య, వ్యాపార, మార్కెటింగ్ వ్యూహాలపై వారికిగల నిశిత అవగాహన ప్రస్ఫుటమైంది.

   ఈ కార్యక్రమ విజేతలకు పురస్కార ప్రదానోత్సవంలో నీతి ఆయోగ్ పరిధిలోని అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్ డాక్టర్ చింతన్ వైష్ణవ్, డస్సాల్ట్ సిస్టమ్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.జి.దీపక్, డస్సాల్ట్ సిస్టమ్స్ సొల్యూషన్స్ ల్యాబ్ సీఈవో సుదర్శన్ మొగసాలే, పుణే నగరంలోని అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ టెక్నాలజీ అడ్వైజర్ జయేష్ రాథోడ్ సహా గౌరవనీయులైన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చింతన్ వైష్ణవ్ ప్రసంగిస్తూ- భారత విద్యారంగంలో ఆవిష్కరణల ప్రాముఖ్యం, భవిష్యత్ ఆవిష్కర్తలు-వ్యవస్థాపకులకు బీజాలు నాటడంలో భాగంగా ‘ఎఐఎం’ నిర్వహిస్తున్న కార్యక్రమ ఔచిత్యాన్ని స్ఫూర్తిదాయకంగా వివరించారు.

   ఈ పోటీలో మహారాష్ట్రలోని చిఖాలీ గ్రామంలోగల శ్రీ దాదా మహారాజ్ నటేకర్ విద్యాలయ విద్యార్థుల జట్టు ప్రతిష్టాత్మక ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. పుణెలోని ఆర్కిడ్ స్కూల్ జట్టు రెండో స్థానంలో నిలవగా, ఢిల్లీలోని ధౌలా కువాన్‌లోని స్ప్రింగ్‌డేల్స్ స్కూల్ జట్టు మూడో స్థానంలో పొందింది. భారత భవిష్యత్ ఆవిష్కర్తలు-వ్యవస్థాపకులను ప్రోత్సహించడంలో ఈ కార్యక్రమ పరివర్తనాత్మక  ప్రభావాన్ని నవతరం విజయాలు నొక్కి చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల స్థాయినుంచే ఆవిష్కరణ-వ్యవస్థాపకతపై ఆలోచనను రేకెత్తించడం లక్ష్యంగా నీతి ఆయోగ్ పరిధిలోని ఎయిమ్ (ఎఐఎం), ‘లా ఫౌండేషన్ డస్సాల్ట్ సిస్టమ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. కాగా, ‘ఎయిమ్’ ‘నిర్వహించిన ‘ఎటిఎల్‘ మారథాన్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థి బృందాలకు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించబడింది.

   ఈ కార్యక్రమం కింద ఎంపిక చేసిన పాఠశాలలు ఆరుగురు విద్యార్థులు-ఒక ఉపాధ్యాయునితో కూడిన బృందం ద్వారా ఒక మిథ్యా అంకుర సంస్థను ఏర్పాటు చేస్తాయి. నిత్యం తమ చుట్టూ కనిపించే సవాళ్లను పరిష్కరించే దిశగా సదరు బృందం తమ కలల ప్రాజెక్టుగా ఈ అంకుర సంస్థ స్వరూపాన్ని ఆవిష్కరించాలి. అనంతరం దీనికి 3డి డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో రూపునిచ్చి, ఒక ఉత్పత్తిని తయారు చేయాలి. అటుపైన ఆ ఉత్పత్తి గురించి వివరించే కరదీపిక, ప్రకటన వీడియోతోపాటు ధరల వ్యూహంతో కూడిన మార్కెటింగ్ ప్రచార కార్యక్రమాన్ని కూడా రూపొందించాలి. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక్క 2023 సీజన్‌లోనే దేశంలోని 29 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 140 పాఠశాలలు పాలు పంచుకోవడం విశేషం. మొత్తంమీద యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహంతోపాటు విద్యార్థులలో ఆవిష్కరణలపై ఆసక్తిని రగలించడంలో ఈ కార్యక్రమం విస్తృత ప్రభావం చూపిందనడంలో సందేహం లేదు.

 

 

 

 

***


(Release ID: 2025106) Visitor Counter : 131