వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఆధ్యర్యంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం సమస్యలకు వినూత్నమైన పరిష్కారాలను కనుగొనాలి: శ్రీ గోయల్
ఆయా విభాగాల మధ్యన సరైన సమన్వయంతో పని చేయాలని, పిపిపి మోడల్ పాలనను బలోపేతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేసిన శ్రీ గోయల్
గతంలో సాధించిన పిఎల్ ఐ, ఈ మధ్యనే సాధించిన ఎఫ్ టి ఏలలాంటి విజయాల మీద ఆధారపడి నిర్మాణం సాగాలి: శ్రీ గోయల్
భారతదేశ ప్రగతికోసం నాణ్యతే మంత్రంగా పని చేయాలని మంత్రిత్వశాఖ అధికారులకు సూచించిన శ్రీ గోయల్.
Posted On:
11 JUN 2024 8:18PM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా నియమితులైన శ్రీ పీయూష్ గోయల్ న్యూఢిల్లీలోని మంత్రిత్వశాఖ కార్యాలయంలో మొదటి అధికార సమావేశం నిర్వహించారు. అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వాణిజ్యశాఖ కార్యదర్శి, డిపిఐఐటి కార్యదర్శి తమ మంత్రిత్వశాఖలో కొనసాగుతున్న ప్రతిపాదనల్ని, కార్యాచరణ పనులను వివరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్రమంత్రి శ్రీ గోయల్ అధికారులు అందరి మధ్యన నిరాటంకంగా సహకారం కొనసాగాలని కోరారు. రాబోయే రోజుల్లో వరుసగా పలు సమావేశాలు నిర్వహించాలని, వివిధ విధానాల గురించి, కార్యాచరణకోసం ఎంపిక చేసిన పనుల గురించి చర్చించి అమల్లోకి తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు.
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ మంత్రివర్గంలో భాగమైనందుకు సంతోషంగా వుందని మంత్రి శ్రీ గోయల్ అన్నారు. ఎంపీగా ఎన్నుకున్నందుకు తూర్పు ముంబాయి నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేవారు. భారతదేశ ప్రగతికి సంబంధించిన వినూత్నమైన ఆలోచనలతో మంత్రిత్వశాఖ బాధ్యతలు చేపట్టినట్టు ఆయన స్పష్టం చేశారు.
అందరూ ఆత్మపరిశీలన చేసుకొని ఆయా విభాగాల మద్యన సరైన సహకారంతో పని చేయాలని అధికారులకు సూచించారు. పరిశోధన, అభివృద్ధి ( ఆర్ అండ్ డి) ప్రాధాన్యతను ప్రత్యేకంగా పేర్కొని, పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పిపిపి) మోడల్ పాలన ను బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు.
అధికారులు నిజాయితీగా, వేగంగా, నైపుణ్యంతో పనిచేయాలని కోరారు. స్కేల్, పిఎల్ ఐ పథకాల మీద వేసిన స్టీరింగ్ కమిటీని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని ఎగుమతులను, దేశీయ ఉత్పత్తిని పెంచాలని కోరారు.
కేంద్ర వాణిజ్యశాఖ మంత్రిగా గత టెర్మ్‌లో పని చేసినప్పుడు సాధించిన కీలకమైన విజయాల గురించి శ్రీ పీయూష్ గోయల్ ప్రస్తావించారు. దేశాన్నించి ఎగుమతులు పెరిగాయని, పలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపైన సంతకాలు జరిగాయని, గణనీయమైన స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను తేవడం జరిగిందని గుర్తు చేశారు.
భారతదేశ ప్రగతికోసం నాణ్యతకు పెద్దపీట వేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు శ్రీ పీయూష్ గోయల్. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుబాటులోకి తెస్తే తద్వారా దేశంలో పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు నమ్మకంగా ముందుకు వస్తారని అన్నారు. ప్రస్తుతం దేశం సరైన స్థానంలో వుందని, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అవకాశాలుగా మార్చడానికి ఇదే సరైన సమయమని ఆయన అన్నారు.
...
(Release ID: 2024487)
Visitor Counter : 70