రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఐఎన్ఎస్ చిల్కాను సందర్శించి అగ్నివీర్ శిక్షణను పర్యవేక్షించిన సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్

Posted On: 02 JUN 2024 6:49PM by PIB Hyderabad

భారత త్రివిధ దళాల అధిపతి (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్  భారత నౌకాదళానికి చెందిన ప్రధాన ప్రాథమిక శిక్షణ సముదాయం  ఐఎన్ఎస్ చిల్కాను  ఈ రోజు సందర్శించారు. భారత నౌకాదళానికి భవిష్యత్తు సముద్ర యోధులను రూపొందించడంలో ఐఎన్ఎస్ చిల్కా పోషిస్తున్న ప్రధాన పాత్ర గురించి అక్కడి అధికారులు సీడీఎస్ కు వివరించారు. అగ్నివీర్ శిక్షణ కార్యకలాపాలు, ఇప్పటి వరకు శిక్షణ పొందిన బ్యాచ్‌ల సమగ్ర వివరాలను కూడా సీడీఎస్ తెలుసుకున్నారు. 

 

ఈ సందర్భంగా  అగ్నివీరులను ఉద్దేశిస్తూ సీడీఎస్ తన ప్రసంగంలో నైపుణ్యం, క్రమశిక్షణ,  ప్రేరణతో కూడిన యువతను అందించడం ద్వారా  సైన్యం, దేశ నిర్మాణంలో యువతను భాగం చేసేందుకు అమలు చేసిన ప్రధాన సంస్కరణల్లో  ‘అగ్నిపత్ పథకం’  ఒకటి అని అభిప్రాయపడ్డారు. సాంకేతికంగా నైపుణ్యం కలిగిన సముద్ర యోధులుగా మారేందుకు శిక్షణపై దృష్టి సారించాలని అగ్నివీరులకు సూచించారు. చర్చాగోష్టి సందర్భంగా  అగ్నివీరుల నుంచి పలు ప్రశ్నలు స్వీకరించిన సీడీఎస్ వాటిని నివృత్తి చేశారు. 

 

నౌకాదళంలో అగ్నివీర్ శిక్షణ గురించి పూర్తి అంతర్దృష్టిని పొందడానికి  శిక్షణ సముదాయంలో సీడీఎస్ కొద్దిసేపు పర్యటించారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన శిక్షణ అందిస్తూ తర్వాతి తరం సముద్ర యోధులను తీర్చిదిద్దుతున్న శిక్షణ అధ్యాపకులను ఆయన అభినందించారు.

 



(Release ID: 2022594) Visitor Counter : 79