రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

పరిశోధన & శిక్షణ కోసం 'ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ సర్వీసెస్‌' - IIT హైదరాబాద్‌ మధ్య ఒప్పందం

Posted On: 30 MAY 2024 4:34PM by PIB Hyderabad

పరిశోధన & శిక్షణలో పరస్పరం సహకరించుకోవడానికి 'ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్' (ఏఎఫ్‌ఎంఎస్‌) - 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ' (IIT) హైదరాబాద్‌ మధ్య ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. ఏఎఫ్‌ఎంఎస్‌ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ దల్జీత్ సింగ్, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

వినూత్న వైద్య పరికరాలను అభివృద్ధి చేసేలా ఆవిష్కరణలు & పరిశోధనలను పెంచడం, విభిన్న వాతావరణ పరిస్థితుల్లో సేవలందిస్తున్న సైనికుల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడం ఒప్పందం లక్ష్యం. ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజినీరింగ్, బయోఇన్ఫర్మేటిక్స్ విభాగాలు దీనికోసం పని చేస్తాయి, విభిన్న అనారోగ్య సవాళ్లను పరిష్కరించడానికి సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తాయి.

డ్రోన్‌ ద్వారా రోగి రవాణా, టెలిమెడిసిన్ ఆవిష్కరణలు, వైద్యం కోసం కృత్రిమ మేధను ఉపయోగించడం, అధునాతన సూక్ష్మ సాంకేతికతల్లో సహకారం వంటివి ఒప్పందంలో ముఖ్యాంశాలు. దీంతోపాటు, విద్యార్థులు & అధ్యాపకుల మార్పిడి కార్యక్రమాలు, డిగ్రీ విద్యార్థుల కోసం స్వల్పకాలిక కోర్సులు కూడా ఇందులో ఉంటాయి.

సైనికులకు సమగ్ర వైద్య సంరక్షణ అందించడంలో ఏఎఫ్‌ఎంఎస్‌ నిబద్ధతకు ఈ ఒప్పందం నిదర్శనమని లెఫ్టినెంట్ జనరల్ దల్జీత్ సింగ్‌ స్పష్టం చేశారు. పరిశోధన & శిక్షణ పెంచుకోవడం, సైనికులు & వారి కుటుంబాల జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు అత్యాధునిక సాంకేతికతకు పేరుగాంచిన ఐఐటీ హైదరాబాద్ వంటి సంస్థతో భాగస్వామ్యం కావడం కీలక అడుగని చెప్పారు.

సాయుధ బలగాలు సమర్పించిన సమస్యల నివేదికను పరిష్కరించడానికి, అనారోగ్య సమస్యలకు సత్వరం & సమర్థవంతమైన పరిష్కారాలను అందించడానికి IIT హైదరాబాద్ అంకితభావంతో పని చేస్తుందని ప్రొ ఫెసర్ బి.ఎస్‌. మూర్తి చెప్పారు.

సైనికులు, వారి కుటుంబాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు అధునిక సాంకేతికత & పరిశోధనలను ఉపయోగించుకోవడంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా ఈ ఒప్పందం నిలుస్తుంది.

 

***


(Release ID: 2022288) Visitor Counter : 134