వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

భారత లాజిస్టిక్స్ ని మరింత విస్తరించే లక్ష్యంతో రాష్ట్రాలను ఒక వేదికపైకి తెచ్చిన యులిప్

Posted On: 20 MAY 2024 6:31PM by PIB Hyderabad

భారతదేశ లాజిస్టిక్స్ రంగాన్ని మార్చడంలో యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్‌ఫేస్ ప్లాట్‌ఫారమ్ (యులిప్) అగ్రగామిగా కొనసాగుతోంది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డిపిఐఐటీ) కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్ అధ్యక్షతన ఈరోజు(మంగళవారం) వర్క్ షాప్ జరిగింది. వాణిజ్య భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ, కేరళ, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, రాజస్థాన్‌తో సహా వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. పలు పారిశ్రామిక సంఘాలు, సంస్థలు, స్టార్టప్‌లు వర్క్‌షాప్‌లో పాల్గొన్నాయి.

ఈ సందర్భంగా శ్రీ రాజేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, ఏకీకృత లాజిస్టిక్స్ పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి రాష్ట్రాల మధ్య సహకారం, ఏకీకరణను పెంపొందించడంలో యులిప్ కీలక పాత్రను వివరించారు. "రాష్ట్రాలు తమ లాజిస్టిక్స్ ఫ్రేమ్‌వర్క్‌లను మెరుగుపరచుకోవడానికి యులిప్ ఒక అపూర్వమైన అవకాశాన్ని అందిస్తుంది.  యులిప్ ని క్రియాశీలంగా ఉపయోగించుకోవాలని, భారతదేశం అంతటా నిరంతరాయమైన, సమర్థవంతమైన, సమ్మిళిత లాజిస్టిక్స్ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను అన్ని రాష్ట్రాలను ప్రోత్సహిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.

 

వర్క్‌షాప్ సందర్భంగా, శ్రీ రాజేష్ కుమార్ సింగ్ యులిప్ బుక్‌లెట్‌ను కూడా ప్రారంభించారు. వివిధ ప్రైవేట్ రంగ కంపెనీలు, స్టార్టప్‌లు యులిప్ ఏపిఐలను ఎలా ఉపయోగించుకుంటున్నాయి, లాజిస్టిక్స్ రంగంపై ఈ వేదిక తెచ్చే పరివర్తన ప్రభావాన్ని దీనిలో పేర్కొన్నారు. ఈ బుక్‌లెట్  యులిప్  ద్వారా అభివృద్ధి చేసిన వినూత్న అప్లికేషన్‌లను, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో వారి ముఖ్యమైన సహకారాన్ని ప్రదర్శించే సమగ్ర గైడ్‌గా పనిచేస్తుంది.

నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఐసిడిసి) సీఈఓ, ఎండీ, నేషనల్ లాజిస్టిక్స్ డేటా సర్వీసెస్ లిమిటెడ్ (ఎన్ఎల్డిఎస్ఎస్ఎల్) చైర్మన్ శ్రీ రజత్ కుమార్ సైనీ,  యులిప్ ప్రాముఖ్యతను వివరించారు.స్టార్ట్-అప్‌లు తమ వినూత్న ప్రయత్నాలను కొనసాగించాలని, కొత్త ఆలోచనలను అన్వేషించాలని కోరారు. “ఈ రోజు ప్రదర్శించిన అప్లికేషన్లు, లాజిస్టిక్స్ రూపురేఖలనే మార్చడంలో  యులిప్ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. మనం పరిధులను ఇంకా విస్తరించాలి, సామర్థ్యం, వృద్ధికి కొత్త అవకాశాలను అన్వేషించాలి." అని అన్నారు. 

 

ఈ కార్యక్రమం, పరిశ్రమ దిగ్గజాలు, వాటాదారులకు వారి అనుభవాలను, అంతర్దృష్టులను పంచుకోవడానికి ఒక వేదికను అందించింది. వర్క్‌షాప్‌లో సూపర్ ప్రొక్యూర్, కార్గో శక్తి, షిప్‌రోకెట్, ఎన్‌మోవిల్ వంటి స్టార్టప్‌ల నుండి యులిప్ డేటాబేస్‌లను ఉపయోగించి అభివృద్ధి చేసిన అత్యాధునిక అప్లికేషన్‌లను ప్రదర్శించారు. షిప్రోకెట్, దాని క్రాస్-బోర్డర్ లాజిస్టిక్స్ ప్లాట్‌ఫారమ్‌తో,  యులిప్ ఏపిఐల ద్వారా సులభతరం చేయబడిన, ప్రభావవంతమైన ధృవీకరణ ద్వారా వారు ఎలా సజావుగా అమ్మకందారులను ఆన్‌బోర్డ్ చేయగలరో ప్రముఖంగా ప్రస్తావించారు. 

యులిప్  గురించి:

యులిప్ అనేది ఏపిఐ -ఆధారిత ఇంటిగ్రేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ వ్యవస్థల నుండి లాజిస్టిక్స్-సంబంధిత డేటాసెట్‌లను యాక్సెస్ చేయడానికి పరిశ్రమ ఆటగాళ్లను అనుమతించే డిజిటల్ గేట్‌వే. ప్రస్తుతం, ప్లాట్‌ఫారమ్ 118 ఏపిఐ ల ద్వారా 10 మంత్రిత్వ శాఖల నుండి 37 సిస్టమ్‌లతో 1800 డేటా ఫీల్డ్‌లను కవర్ చేస్తుంది.  యులిప్  పోర్టల్ (www.goulip.in)లో 900కు పైగా కంపెనీలు నమోదు చేసుకోవడంతో,  యులిప్ లో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం దాని ప్రభావాన్ని విస్తరించడంలో కీలకపాత్ర పోషించింది. అదనంగా, ఈ కంపెనీలు 90కి పైగా అప్లికేషన్‌లను అభివృద్ధి చేశాయి, ఇది 35 కోట్లకు పైగా ఏపిఐ లావాదేవీలకు అవకాశం ఇచ్చింది.

***



(Release ID: 2021285) Visitor Counter : 63