రక్షణ మంత్రిత్వ శాఖ
ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌లో రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పర్యటన, భద్రత పరిస్థితిపై సమీక్ష
క్లిష్టమైన వాతావరణం & కఠినమైన ప్రాంతంలో అత్యంత ధైర్యసాహసాలతో దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు ప్రశంస
"మంచుతో నిండిన సియాచిన్‌లో మన సైనికుల ధైర్యసాహసాలు, ఉక్కు సంకల్పం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తాయి"
Posted On:
22 APR 2024 1:55PM by PIB Hyderabad
భారత రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌ను సందర్శించారు, అక్కడి భద్రత పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షించారు. క్లిష్టమైన వాతావరణం, కఠినమైన ప్రాంతంలో దేశ సరిహద్దులను పహారా కాస్తున్న సైనికులతో రక్షణ మంత్రి సంభాషించారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే, జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్, నార్తర్న్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ ఎంవీ సుచీంద్ర కుమార్, జనరల్ ఆఫీసర్ కమాండింగ్, 14 కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ రషీమ్ బాలి కూడా రక్షణ మంత్రితో పాటు సియాచిన్ వెళ్లారు.
సియాచిన్‌లో సైనికుల మోహరింపును గగనమార్గం ద్వారా పరిశీలించిన శ్రీ రాజ్‌నాథ్ సింగ్, సముద్ర మట్టానికి 15,100 అడుగుల ఎత్తులో ఉన్న సైనిక స్థావరంలో దిగారు. సియాచిన్‌లో బలగాల సంసిద్ధత, భద్రత పరిస్థితులపై రక్షణ మంత్రికి సైనిక అధికార్లు క్లుప్తంగా వివరించారు. క్షేత్ర స్థాయి సవాళ్లకు సంబంధించిన అంశాలను కూడా శ్రీ రాజ్‌నాథ్ సింగ్ చర్చించారు.
సైనికులను ఉద్దేశించి మాట్లాడిన రక్షణ మంత్రి, సియాచిన్‌లో విధులు నిర్వహిస్తున్న సైనికులను కొనియాడారు. తీవ్రమైన పరిస్థితుల్లోనూ పరాక్రమం, దృఢ సంకల్పంతో మాతృభూమిని రక్షించే ధర్మమార్గంలో నడుస్తున్నారంటూ అభినందించారు. సాయుధ దళాల సిబ్బందికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని, వారి త్యాగాల వల్లే ప్రతి పౌరుడు సురక్షితంగా ఉన్నాడని అన్నారు. "మన వీర సైనికులు సరిహద్దుల వద్ద దృఢంగా, అడ్డుగోడలా నిలబడ్డారనే భరోసాతో మేమంతా ప్రశాంతంగా జీవిస్తున్నాం. భవిష్యత్‌లో, మన దేశ భద్రత గురించి రాస్తున్నప్పుడు, మంచుతో నిండిన ఈ చల్లని హిమానీనదంలో మన సైనికుల ధైర్యసాహసాలు, ఉక్కు సంకల్పాన్ని సగర్వంగా గుర్తు చేసుకుంటాం. భవిష్యత్ తరాలకు అది ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది" అని చెప్పారు.
సియాచిన్ సాధారణ భూమి కాదని, భారతదేశ సార్వభౌమాధికారం & సంకల్పానికి చిహ్నమని రక్షణ మంత్రి అభివర్ణించారు. భారతదేశానికి జాతీయ రాజధాని దిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై, సాంకేతిక రాజధాని బెంగళూరు అయినట్లే, ధైర్యం, దృఢ సంకల్పానికి రాజధాని సియాచిన్ అని అన్నారు.
'ఆపరేషన్ మేఘ్‌దూత్' 40వ వార్షికోత్సవాన్ని భారతదేశం ఇటీవల జరుపుకుంది. 1984 ఏప్రిల్ 13న సియాచిన్‌లో భారత సైన్యం ప్రారంభించిన ఈ ఆపరేషన్ దేశ సైనిక చరిత్రలో సువర్ణ అధ్యాయమని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. "ఆపరేషన్ మేఘ్‌దూత్ విజయం మనందరికీ గర్వకారణం" అని అన్నారు.
సియాచిన్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచిన రక్షణ మంత్రి, దేశ సేవలో ప్రాణాలు అర్పించిన అమర సైనికులకు నివాళులు అర్పించారు.
గత నెల 24న లేహ్‌ను సందర్శించిన శ్రీ రాజ్‌నాథ్ సింగ్, సైనికులతో కలిసి హోలీ జరుపుకున్నారు. అప్పుడే ఆయన సియాచిన్‌ను కూడా సందర్శించాల్సి ఉన్నా ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పర్యటన వాయిదా పడింది. సియాచిన్‌లోని సైనికులతో లేహ్ నుంచి ఫోన్‌లో మాట్లాడిన రక్షణ మంత్రి, తాను త్వరలోనే అక్కడి వస్తానని, వారితో ప్రత్యక్షంగా మాట్లాడతానని చెప్పారు. తీరిక లేని పనులు ఉన్నప్పటికీ సియాచిన్‌ను సందర్శించిన శ్రీ రాజ్‌నాథ్ సింగ్, తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
***
(Release ID: 2018454)
Visitor Counter : 143