మంత్రిమండలి
ఢిల్లీ మెట్రో ఫేజ్-IV ప్రాజెక్ట్ పరిధిలోని లజపత్ నగర్-సాకేత్ జి బ్లాక్.. ఇంద్రప్రస్థ-ఇందర్‌లోక్ కారిడార్లకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం
Posted On:
13 MAR 2024 3:25PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర మంత్రిమండలి సమావేశమైంది. ఈ సందర్భంగా ఢిల్లీ మెట్రో ఫేజ్-IV ప్రాజెక్ట్ పరిధిలోని రెండు కొత్త కారిడార్లకు ఆమోద ముద్ర వేసింది. దీంతో దేశ రాజధానిలో మెట్రో అనుసంధానం మరింత మెరుగుపడనుంది.
ఈ రెండు కారిడార్ల వివరాలు:
(ఎ) ఇంద్రప్రస్థ-ఇందర్‌లోక్ 12.377 కిలోమీటర్లు
(బి) లజపత్ నగర్-సాకేత్ జి బ్లాక్ 8.385 కిలోమీటర్లు
ప్రాజెక్టు వ్యయం - నిధుల సమీకరణ
ఢిల్లీ మెట్రో ఫేజ్-IV ప్రాజెక్ట్ పరిధిలోని ఈ రెండు కారిడార్ల మొత్తం వ్యయం రూ.8,399 కోట్లు కాగా, ఈ నిధులను కేంద్ర/ఢిల్లీ ప్రభుత్వాలతోపాటు అంతర్జాతీయ సంస్థల నుంచి సమీకరిస్తారు.
ఈ రెండు మార్గాల పొడవు 20.762 కిలోమీటర్లు కాగా, వీటిలో ఇందర్‌లోక్-ఇంద్రప్రస్థ కారిడార్ గ్రీన్ లైన్‌కు పొడిగింపుగా ఉంటుంది. అంతేకాకుండా ఎరుపు, పసుపు, ఎయిర్‌పోర్ట్ లైన్, మెజెంటా, వైలెట్, బ్లూ లైన్‌లతో పరస్పర మార్పిడికి వీలు కల్పిస్తుంది. ఇక లజ్‌పత్ నగర్-సాకేత్ జి బ్లాక్ కారిడార్ సిల్వర్, మెజెంటా, పింక్, వైలెట్ లైన్లను కలుపుతుంది.
లజపత్ నగర్-సాకేత్ జి బ్లాక్ కారిడార్ పూర్తిగా ఎత్తుగా నిర్మించబడుతుంది. దీని పరిధిలో మొత్తం 8 స్టేషన్లుంటాయి. అయితే, ఇందర్‌లోక్-ఇంద్రప్రస్థ కారిడార్‌లో 11.349 కిలోమీటర్ల మేర భూగర్భ మార్గంలో 10 స్టేషన్లు ఉండగా, 1.028 కిలోమీటర్ల మార్గం ఎత్తుగా నిర్మితమవుతుంది.
ఇందర్‌లోక్-ఇంద్రప్రస్థ మార్గంతో హర్యానాలోని బహదూర్‌గఢ్ ప్రాంతానికి అనుసంధానం మెరుగవుతుంది. ఈ ప్రాంతాల నుంచి వచ్చేవారు నేరుగా ఇంద్రప్రస్థతోపాటు సెంట్రల్, ఈస్ట్ ఢిల్లీలోని అనేక ప్రాంతాలకు చేరుకునేలా గ్రీన్ లైన్‌లో ప్రయాణించగలుగుతారు.
ఈ కారిడార్ల పరిధిలో ఇందర్‌లోక్, నబీ కరీం, న్యూఢిల్లీ, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, లజ్‌పత్ నగర్, చిరాగ్ డిల్లీ సహా సాకేత్ జి బ్లాక్‌లోని 8 కొత్త పరస్పర మార్పిడి స్టేషన్లు ఏర్పాటవుతాయి. వీటన్నిటిద్వారా ఢిల్లీ మెట్రో నెట్‌వర్క్‌లోని అన్ని మార్గాల మధ్య అంతర అనుసంధానం గణనీయంగా మెరుగవుతుంది.
ఢిల్లీ మెట్రో ఫేజ్-IV ప్రాజెక్ట్ విస్తరణలో భాగంగా ఇప్పటికే 65 కిలోమీటర్ల నెట్‌వర్క్ నిర్మాణంలో ఉంది. వీటితోపాటు ఈ కొత్త కారిడార్లను 2026 మార్చి నాటికి దశలవారీగా పూర్తిచేస్తారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (డిఎంఆర్‌సి) ప్రస్తుతం 286 స్టేషన్లతో 391 కిలోమీటర్ల మేర మెట్రో నెట్‌వర్క్‌ను నిర్వహిస్తుండగా, ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిలో ఒకటిగా గుర్తంపు పొందింది. ఈ నేపథ్యంలో తాజా కారిడార్ల నిర్మాణానికి సంబంధించి ‘డిఎంఆర్‌సి’ ఇప్పటికే ప్రీ-బిడ్ కార్యకలాపాలు ప్రారంభించడంతోపాటు టెండర్ పత్రాలను సిద్ధం చేస్తోంది.
***
(Release ID: 2014324)
Visitor Counter : 97
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam