పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొత్త విమానయాన సంస్థ ఫ్లై91 తొలి విమానాన్ని ప్రారంభించిన శ్రీ జ్యోతిరాదిత్య సింధియా


ఉడాన్ పథకం టైర్ 2 & టైర్‌ 3 నగరాలకు విస్తరించింది, 2030 నాటికి దేశీయ విమాన ప్రయాణీకుల సంఖ్యను 30 కోట్లకు పెంచాలన్నది లక్ష్యం: శ్రీ సింధియా

షెడ్యూల్డ్ విమానాలను మార్చి 18 నుంచి ప్రారంభించనున్న విమానయాన సంస్థ

Posted On: 12 MAR 2024 4:31PM by PIB Hyderabad

కొత్త విమానయాన సంస్థ ఫ్లై91కు చెందిన మొట్టమొదటి విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా ఈ రోజు ప్రారంభించారు. గోవాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం - లక్షద్వీప్‌లోని అగట్టి దీవుల మధ్య ఈ సంస్థ తొలి విమానం ఎగిరింది.

విమానయాన సంస్థలు మూతపడటం, దివాళా తీయడం లాంటివి వార్తలే మన దేశంలో గతంలో వినిపించేవని శ్రీ జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. గత 10 సంవత్సరాల్లో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంతో విమానయాన పరిశ్రమకు కొత్త దారులు తెరుచుకున్నాయని అన్నారు. మోదీ హయాంలో ఆరు కొత్త ప్రాంతీయ విమానయాన సంస్థలు పుట్టుకొచ్చాయని చెప్పారు. దేశంలో పౌర విమానయాన రంగంలోని బహుముఖ వృద్ధి గురించి కూడా శ్రీ సింధియా మాట్లాడారు. ఉడాన్ పథకం ద్వారా టైర్ 2, టైర్ 3 నగరాలను అనుసంధానించడంలో కేంద్ర ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోందని చెప్పారు. 2014లో కేవలం 6 కోట్లుగా ఉన్న దేశీయ విమాన ప్రయాణీకుల సంఖ్యను 2030 నాటికి 30 కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు.

గోవాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు, హైదరాబాద్, జల్‌గావ్, అగట్టి, పుణె, నాందేడ్ మధ్య మార్చి 18 నుంచి దశలవారీగా విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని విమానయాన సంస్థ ఫ్లై91 తెలిపింది. బెంగళూరు, హైదరాబాద్, పుణె నుంచి సింధుదుర్గ్, జల్గావ్, నాందేడ్, గోవా వరకు కూడా విమానాలను నడుపుతామని వెల్లడించింది.


ఈ కొత్త విమాన సర్వీసులు దేశవ్యాప్తంగా మెరుగైన అనుసంధానతను అందిస్తాయి, వివిధ ప్రాంతాలకు రాకపోకలను సులభతరం చేస్తాయి. దీనివల్ల పర్యాటకమేగాక వ్యాపారం, వాణిజ్యం కూడా ఊపందుకుంటాయి. ప్రయాణీకులకు తక్కువ ధరలో సమయానికి, సురక్షితమైన, ఇబ్బందులు లేని ప్రయాణ అనుభవాన్ని అందించాలన్న కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు దన్నుగా నిలుస్తాయి.

ఫ్లై91 చైర్మన్ శ్రీ హర్ష రాఘవన్, గోవా అంతర్జాతీయ విమానాశ్రయం అధికార్లు, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికార్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

***


(Release ID: 2013964) Visitor Counter : 125


Read this release in: English , Urdu , Hindi , Tamil