వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

అడ్వాన్స్ ఆథరైజేషన్ హోల్డర్లు, ఎగుమతి ఆధారిత యూనిట్లు, సెజ్‌ యూనిట్లు ఎగుమతి చేసిన ఉత్పత్తులపై సుంకాలు & పన్నుల ఉపశమనాన్ని పొడిగించిన భారత ప్రభుత్వం

Posted On: 08 MAR 2024 5:38PM by PIB Hyderabad

అడ్వాన్స్ ఆథరైజేషన్ హోల్డర్లు, ఎగుమతి ఆధారిత యూనిట్లు, సెజ్‌ యూనిట్లు ఎగుమతి చేసిన ఉత్పత్తులపై సుంకాలు & పన్నుల ఉపశమనాన్ని భారత ప్రభుత్వం పొడిగించింది. అదనపు ఎగుమతి రంగాలకు 'ఎగుమతి చేసిన ఉత్పత్తులపై సుంకాలు & పన్నుల మినహాయింపు' (ఆర్‌వోడీటీఈపీ) పథకం మద్దతును పొడిగిస్తున్నట్లు కేంద్ర వాణిజ్యం & పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ రోజు న్యూదిల్లీలో ప్రకటించారు. అడ్వాన్స్ ఆథరైజేషన్ (ఏఏ) హోల్డర్లు, ఎగుమతి ఆధారిత యూనిట్లు (ఈవోయూ), ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) ఎగుమతి యూనిట్ల ద్వారా జరిగిన ఎగుమతులకు ఆర్‌వోడీటీఈపీ పథకం మద్దతును పొడిగించారు. భారతదేశ ఎగుమతుల్లో ఈ ఎగుమతుల వాటా దాదాపు 25% ఉండడంతో, ఈ రంగాల కీలక సహకారాన్ని గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, సరఫరా గొలుసు అంతరాయాల మధ్య ఏఏ, ఈఓయూ, సెజ్‌ యూనిట్ల వంటి వాటికి ఈ పథకం దన్నుగా నిలుస్తుంది.

ఎగుమతి చేసిన ఉత్పత్తులపై వివిధ పన్నులు & సుంకాలను తిరిగి చెల్లించే లక్ష్యంతో భారత ప్రభుత్వం తీసుకున్న చొరవ 'ఎగుమతి చేసిన ఉత్పత్తులపై సుంకాలు & పన్నుల ఉపశమన పథకం'. 2021 జనవరిలో దీనిని ప్రారంభించారు. అప్పటి నుంచి, ఈ పథకం ఇప్పటికే 8-అంకెల ఐటీసీ హెచ్‌ కోడ్ స్థాయిలో 10,500కు పైగా ఎగుమతి వస్తువులకు ₹42,000 కోట్లను తిరిగి చెల్లించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కోసం ₹15,070 కోట్లు కేటాయించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఎఫ్‌వై 2024-25 కోసం కేటాయింపులను 10% పెంచారు.

బడ్జెట్ కేటాయింపులను దృష్ట్యా, అదనపు రంగాలకు ఆర్‌వోడీటీఈపీ మద్దతు 30.09.2024 వరకు కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లలో భారతదేశ ఎగుమతుల పోటీని పెంచడం ఈ పథకం లక్ష్యం. ఇంజినీరింగ్, వస్త్రాలు, రసాయనాలు,
ఔషధాలు, ఆహార శుద్ధి సహా మరికొన్ని కీలక రంగాలు ఈ పథకం నుంచి ప్రయోజనం పొందుతాయి.

కీలక ఎగుమతి రంగాలకు మద్దతుగా నిలవడం ద్వారా, ఆయా రంగాల పోటీతత్వాన్ని పెంచడమే కాకుండా ఉపాధి అవకాశాలను సృష్టించి ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించాలనే దృక్పథానికి అనుగుణంగా, మొత్తం ఆర్థిక వృద్ధికి తోడ్పడే ఉద్దేశంతో ఈ పథకం పని చేస్తుంది. కొత్త ఎఫ్‌టీఏల చర్చలు సహా, భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలు 1 ట్రిలియన్ అమెరికన్‌ డాలర్ల ఎగుమతి స్థాయిని సాధించే దిశగా భారతదేశాన్ని నడిపిస్తాయని విశ్వసిస్తున్నారు.

 


***



(Release ID: 2013372) Visitor Counter : 97


Read this release in: English , Urdu , Hindi