కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో ఉప-ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్న ఇఎస్ఐసి
7 ఇఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణానికి అంచనాల ఆమోదం
Posted On:
06 MAR 2024 9:00AM by PIB Hyderabad
ఉద్యోగుల రాష్ట్ర బీమా కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ 231వ సమావేశం న్యూఢిల్లీలో 05.03.2024న కార్మిక & ఉపాధి కార్యదర్శి మిస్ సుమితా దావ్రా అధ్యక్షతన జరిగింది. సమావేశం సందర్భంగా బీమా చేసిన కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సంరక్షణ, నగదు ప్రయోజనాల లభ్యతను పెంపొందించే లక్ష్యంతో దిగువన పేర్కొన్న ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం జరిగిందిః
ఆల్వార్‌లో ఉప-ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్న ఇఎస్ఐసిః
రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఉప- ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అల్వార్, ఖైర్తాల్-తిజారా, కొత్‌పుటిల్లి- బెరార్, భరత్‌పూర్, డీగ్ జిల్లాల్లో నివసిస్తున్న దాదాపు 12 లక్షల మంది బీమా పొందిన కార్మికుల, ఇఎస్ఐ పథకం లబ్ధిదారులు అల్వార్‌లో కొత్త ఇఎస్ఐసి ఉప- ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుతో ప్రయోజనం పొందుతారు.
7 ఇఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణం కోసం అంచనాల ఆమోదంః
హరోహళ్ళి, నర్సాపుర, బొమ్మసాంద్ర (కర్ణాటక), మీరూట్, బరేలీ (ఉత్తరప్రదేశ్), పీతంపూర్ (మధ్యప్రదేశ్), దుబూరి (ఒడిశా)లలో మొత్తం అంచనా వ్యయం రూ. 1128.21 కోట్లతో 7 కొత్త ఇఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణానికి సమావేశం ఆమోదం తెలిపింది.
ఈ అంచనాల ఆమోదంతో త్వరలో ఈ ఆసుపత్రుల నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఆసుపత్రులు ఇఎస్ఐసి ప్రస్తుత వైద్య సంరక్షణ మౌలిక సదుపాయాలకు 800 పడకలను జోడిస్తాయి.
వైద్య, నగదు ప్రయోజనాల బట్వాడా మౌలికసదుపాయాలను పెంపొందించడానికి వికసిత్ భారత దార్శనికతకు అనుగుణంగా, ఈ ఆసుపత్రులు, కార్యాలయాల స్థాపనకు సంబంధించిన నిర్ణయాలను తీసుకున్నారు. గత పది సంవత్సరాలలో ఇఎస్ఐ పథకం కింద బీమా పొందిన కార్మికులు, జిల్లాల సంఖ్య విశేషంగా వృద్ధి చెంది, వాటి సంఖ్య వరుసగా 3.43 కోట్లు, 666గా పెరిగింది. ఈ సమావేశానికి ఇఎస్ఐసి డైరెక్టర్ జనరల్ డా. రాజేంద్ర కుమార్, యాజమాన్యాల ప్రతినిధులు, కార్మిక ప్రతినిధులు, కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ, ఇఎస్ఐసి సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
***
(Release ID: 2012075)
Visitor Counter : 103