గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

పరిశుభ్రత కార్యక్రమాల్లో అగ్రపథాన విజయవాడ


'స్వచ్ఛ సర్వేక్షణ్ 2023' పరిశుభ్రమైన నగరాల్లో 6వ స్థానంలో బెజవాడ; చెత్త రహిత నగరంగా 5-స్టార్‌ రేటింగ్, వాటర్+ ఖ్యాతి

Posted On: 01 MAR 2024 4:35PM by PIB Hyderabad

పరిశుభ్రత కార్యక్రమాల్లో విజయవాడ నగరం వేగంగా ఎదుగుతోంది, దేశంలోని అగ్రగామి నగరాల సరసన చోటు నిలుపుకుంది. పట్టణ పారిశుద్ధ్యంలో ప్రమాణాలను కచ్చితంగా పాటించడం, అంకితభావం & సంఘటితంగా పని చేసిన ప్రయత్నాలకు ఈ సానుకూల ఫలితం దక్కింది. 'స్వచ్ఛ సర్వేక్షణ్ 2023' పరిశుభ్రత నగరాల ర్యాంకుల్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) 6వ స్థానాన్ని సాధించింది. మిలియన్ల జనాభా ఉన్న బెజవాడలో రోజుకు 520 టన్నుల (టీపీడీ) వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిని నిర్వహించడానికి దాదాపు 4,000 మంది పారిశుధ్య కార్మికులు, 300 తడి వ్యర్థాల కార్మికులతో బలమైన కార్మిక బలం విజయవాడలో ఉంది. పొడి చెత్త నిర్వహణ కోసం ఒక ఎంఆర్‌ఎఫ్‌ కేంద్రం, 'చెత్త నుంచి విద్యుత్‌' ఉత్పత్తి కేంద్రం సహా అధునాతన శుద్ధి సౌకర్యాలు కార్పొరేషన్‌లో ఉన్నాయి. వీఎంసీలో ఆరు వర్మీకంపోస్ట్ కేంద్రాలు, నాలుగు విండ్రో కంపోస్ట్ ప్లాంట్లు, ఒక బయో-మెథనేషన్ ప్లాంట్ ఉన్నాయి. ప్రమాదకర & శానిటరీ వ్యర్థాల నిర్వహణ కేంద్రం కూడా బెజవాడలో ఉంది. ముఖ్యంగా, పూల వ్యర్థాలు, కొబ్బరిబోండాల వ్యర్థాలు, ఉద్యానవన వ్యర్థాలను శుద్ధి చేయడానికి కూడా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

వీఎంసీలో ఏర్పాటు చేసిన బయో-మెథనేషన్ కేంద్రంతో తక్కువ ఖర్చుతో, అత్యంత ప్రభావవంతంగా తడి వ్యర్థాలను శుద్ధి చేయవచ్చు. బయో-మెథనేషన్ కేంద్రం రోజుకు 16 టన్నుల తడి వ్యర్థాలను ప్రాసెస్ చేస్తుంది. వ్యర్థాల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించడానికి, సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రంలో సమాచార పార్కును ఏర్పాటు చేయాలని కూడా వీఎంసీ భావించింది. ఇక్కడ, కార్పొరేషన్‌ చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు, ప్రయత్నాల వివరాలను ప్రదర్శిస్తారు.

విజయవాడలో నిర్మాణాలు, కూల్చివేతల నుంచి రోజుకు 47 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. 200-టీపీడీ సామర్థ్యం గల శుద్ధి కేంద్రానికి వాటిని పంపుతారు. ఆ వ్యర్థాలను ఇటుకలు & పేవర్ బ్లాక్‌లుగా మార్చి నివాస & వాణిజ్య ప్రాంతాల్లో ఉంచుతారు. తద్వారా ప్రజలు నడవడానికి, వీధి వ్యాపారుల కోసం వ్యవస్థీకృత ప్రాంతాలను అందిస్తారు. నగరంలో ఎప్పటి నుంచో ఉన్న వ్యర్థాల నిల్వ ప్రాంతాలను వీఎంసీ తొలగించింది. బయో మైనింగ్ ప్రక్రియ ద్వారా 2.5 లక్షల టన్నుల చెత్తను అక్కడి నుంచి తీసేసింది. దీనివల్ల అందుబాటులోకి వచ్చిన 25 ఎకరాల భూమిలో పార్కును ఏర్పాటు చేశారు. మిగిలిన ప్రాంతంలో సమీకృత ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రాన్ని స్థాపించారు, థర్మల్ ప్రాసెసింగ్ సౌకర్యం కూడా ఉంది.

విజయవాడలోని మూడు శాశ్వత ఆర్‌ఆర్‌ఆర్‌ కేంద్రాలను స్వయం సహాయక సంఘాల మహిళలను నిర్వహిస్తున్నాయి. సేకరించిన వ్యర్థాలను టేబుళ్లు, కుర్చీలు, హ్యాండ్‌బ్యాగ్‌లు, ఇతర వస్తువులుగా మహిళా సభ్యులు మారుస్తారు. వాటిని ప్రజలకు విక్రయిస్తారు. వ్యర్థాలు, ఉపయోగించని వస్తువులను విరాళంగా ఇచ్చేలా పౌరులను ప్రోత్సహించేందుకు 'వాల్ ఆఫ్ కైండ్‌నెస్', ప్లాస్టిక్ సేకరణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.


విజయవాడలో రోజుకు 132 మిలియన్ లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అవుతోంది. భూగర్భ మురుగునీటి పైప్‌లైన్ల ద్వారా ఆ నీటిని ఆరు మురుగునీటి శుద్ధి కర్మాగారాలు (ఎస్‌టీపీలు), సహ-శుద్ధి కర్మాగారానికి పంపుతారు. ఈ నెట్‌వర్క్‌ సామర్థ్యం 140 ఎంఎల్‌డీ. శుద్ధి చేసిన నీటిని వ్యవసాయ పనులు, రోడ్లను శుభ్రపరచడం, చెట్లకు నీరు పెట్టడం కోసం వినియోగిస్తారు. కాల్వలు ఎక్కువగా ఉన్న విజయవాడలో, కాలువ గట్ల నుంచి 6,000 టన్నుల వ్యర్థాలను వీఎంసీ విజయవంతంగా తొలగించింది.

యూఎల్‌బీ, పౌరుల ఉమ్మడి ప్రయత్నాలతో, సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ & పారిశుద్ధ్య పద్ధతులకు విజయవాడ చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది. 

***



(Release ID: 2010892) Visitor Counter : 96


Read this release in: English , Urdu , Hindi